అది ‘డంకీ’ విమానమేనా?.. ఆ పాతిక మంది పరిస్థితి ఏంటో? | Flight with 300 Indians Detained France At last Reach Mumbai Airport | Sakshi
Sakshi News home page

వీడిన ఉత్కంఠ.. ముంబై చేరిన ఆ విమానం.. 25 మంది ఇంకా ఫ్రా‍న్స్‌లోనే?!

Published Tue, Dec 26 2023 7:31 AM | Last Updated on Tue, Dec 26 2023 12:59 PM

Flight with 300 Indians Detained France At last Reach Mumbai Airport - Sakshi

300 మంది భారతీయుల్ని అక్రమంగా దేశాలు దాటిస్తున్నారనే సమాచారంతో ఒక విమానాన్నే.. 

ముంబై, సాక్షి: ఎట్టకేలకు.. ఉత్కంఠకు తెరపడింది. భారతీయులతో ఉన్న విమానం స్వదేశానికే తిరిగి చేరుకుంది. మానవ అక్రమ రవాణా అనుమానాల నేపథ్యంలో రొమేనియన్‌ ఎయిర్‌సర్వీస్‌కు చెందిన ఈ విమానాన్ని ఫ్రాన్స్‌లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.  అయితే నాలుగు రోజులపాటు విచారణ తర్వాత క్లియరెన్స్‌ లభించడంతో.. మంగళవారం వేకువ ఝామున ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యింది ఆ విమానం. 

ఉదయం 4గం. సమయంలో విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. మొత్తం ప్రయాణికుల్లో.. 276 మంది స్వదేశానికి చేరారు. అయితే.. పాతిక మంది ఫ్రాన్స్‌లోనే ఉండిపోయారు. ఇందులో 20 మంది పెద్దలు, ఐదుగురు మైనర్లు ఉన్నట్లు సమాచారం. వాళ్ల పౌరసత్వ గుర్తింపు తేలకపోవడంతోనే నిలిపివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. వీళ్లను శరణార్థులుగా పరిగణిస్తామని.. ఫ్రాన్స్‌ అంతర్జాతీయ చట్టాల ప్రకారం వాళ్లను వెనక్కి పంపడం కుదరని చెబుతున్నారు వాళ్లు. 

అది డంకీ విమానమేనా?

ఏదైనా సరిహద్దులను అక్రమంగా దాటేందుకు ప్రయత్నించే వారిని డంకీ అని పిలుస్తారు. ఈమధ్యే షారూఖ్‌ ఖాన్‌ డంకీ సినిమా అదే కాన్సెప్ట్‌తో వచ్చింది. ప్రస్తుతం ఆ పదం ట్రెండింగ్‌లో ఉండడంతో.. ఆ విమానం డంకీ విమానమేనంటూ చర్చ నడుస్తోంది.  

వాళ్ల పరిస్థితి ఏంటి?
ఫ్రాన్స్‌ మీడియా చానెల్స్‌ కథనం ప్రకారం.. మొత్తం 303 భారతీయ ప్రయాణికుల్లో 11 మంది మైనర్లు ఎవరి సాయం లేకుండానే ప్రయాణిస్తున్నట్లు అక్కడి అధికారులు గుర్తించారట. వీళ్లలో భారతీయ పౌరసత్వం గుర్తింపు ఉన్నవాళ్లను మాత్రమే వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. వీళ్లను తరలిస్తున్న ఇద్దరు ప్రధాన నిందితుల్ని సైతం అక్కడి దర్యాప్తు ఏజెన్సీలు విచారిస్తున్నాయి. ఈ ఘటనపై అటు ఫ్రాన్స్‌.. ఇటు భారత అధికార వర్గాలు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.

ఏం జరిగిందంటే..
రొమేనియాకు చెందిన లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌ ఏ340 ఛార్టర్‌ విమానం 303 మంది ప్రయాణికులతో డిసెంబర్‌ 23వ తేదీన యూఏఈ(దుబాయ్‌) నుంచి నికరాగువాకు బయల్దేరింది. ఇంధనం కోసం ప్యారిస్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉండే వ్యాట్రి(Vatry) ఎయిర్‌పోర్ట్‌లో ఆగింది. అయితే అప్పటికే మనుషుల్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందడంతో.. ఫ్రాన్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. విమానాన్ని ఎయిర్‌పోర్టులోనే ఆపేసి.. ఇద్దరి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు.

మరోవైపు భారత అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇంకోవైపు ఈ నాలుగు రోజులపాటు ప్రయాణికులందరికీ అక్కడే బస ఏర్పాట్లు చేశారు. ఈ తరలింపు వెనుక.. మనుషుల్ని అక్రమంగా పలు దేశాలకు పంపించే కరడుగట్టిన ముఠా హస్తం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఫ్రాన్స్‌ నేర పరిశోధన నిఘా సంస్థ జునాల్కో దర్యాప్తు చేస్తోంది. భారత్‌ నుంచి వీళ్ల ప్రయాణం అసలు ఎలా మొదలైంది? ఎలా దుబాయ్‌కి చేరారు? అనే విషయాలపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఫ్రాన్స్‌ చట్టాల ప్రకారం.. నేరం గనుక రుజువు అయితే 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది. 


ఇన్నిరోజులు అదుపులోనా?

ఫ్రాన్స్‌ చట్టాల ప్రకారం.. అక్కడి నేలపై అడుగుపెట్టిన ఒక విదేశీయుడ్ని ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడి భద్రతా బలగాలు నాలుగు రోజుల పాటు తమ అదుపులో ఉంచుకోవచ్చు. అక్కడి కోర్టులు గనుక అనుమతిస్తే.. మరో ఎనిమిది రోజులు,  అసాధారణ పరిస్థితుల్లో ఇంకో ఎనిమిది రోజులు.. గరిష్టంగా 26 రోజులపాటు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టవచ్చు.

అక్రమంగా వెళ్లే క్రమంలో?
అక్రమంగా దేశాల్ని తరలించే ఉద్దేశంతోనే వీళ్లను తీసుకెళ్తున్నారా? అనే కోణం ఈ కేసులో బలపడుతోంది. తొలుత వీళ్లను మధ్య అమెరికాకు చేర్చి.. అక్కడి నుంచి అమెరికా లేదంటే కెనడాకు అక్రమంగా ప్రవేశిస్తారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రయాణికుల్లో భారతీయులు ఎంతమంది అనేదానిపై కూడా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఆందోళన కలిగించే అంశమే!
ఇదసలు అక్రమంగా మనుషుల్ని తరలించడమేనా?. ఒకవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోకి అక్రమ చొరబాట్లు.. శరణార్థుల సంఖ్య పెరిగిపోతున్న వేళ ఈ విమానం మధ్య అమెరికా దేశం నికరాగువాకు వెళ్తుండడం ఆ అనుమానాల్ని బలపరుస్తోంది. అమెరికా కస్టమ్స్‌ & బార్డర్‌ ప్యాట్రోల్‌(CBP) గణాంకాల ప్రకారం.. అమెరికాలోకి అక్రమంగా చొరబడుతున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. 2023 సంవత్సరానికిగానూ ఆ సంఖ్య 96,917 మందిగా నమోదు అయ్యింది. గతేడాదితో పోలిస్తే ఇది 52 శాతం పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement