ఏటికేటా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఇంటర్‌నెట్‌ను ఊతంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఆశచూపి సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. దీంతో అమాయకులు బలవుతున్నారు. లక్షల్లో నగదు పోగొట్టుకున్నాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని కేసుల్లో నగదు రికవరీ అవుతున్నా, మరికొన్ని ఘటనల్లో నగదు కోసం బాధితులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఆన్‌లైన్ జాబ్స్, పార్ట్‌టైం జాబ్స్ ఆశచూపి తాజాగా 56 ఏళ్ల వ్యక్తి దగ్గర ఏకంగా రూ.77 లక్షలు కొట్టేసిన ఘటన నాగ్‌పుర్‌లో చోటుచేసుకుంది.
యూట్యూబ్ లైక్‌ల ద్వారా నగదు సంపాదించవచ్చు అని చెప్పి సైబర్ నేరగాళ్లు నాగ్‌పుర్‌కు చెందిన 56 ఏళ్లు సరికొండ రాజు అనే వ్యక్తిని టెలిగ్రాం ద్వారా తొలుత సంప్రదించారు. తమ వద్ద ఒక ఉద్యోగ అవకాశం ఉందని, సులభంగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించారు. ఇష్టమైన యూట్యూబ్ ఛానల్‌ను లైక్‌చేసి స్క్రీన్ షాట్‌లు పంపాలని కోరారు. అయితే ప్రారంభంలో అంతా మంచిగానే అనిపించింది. తనకు ఎటువంటి ఇబ్బంది రాదని రాజు భావించాడు.
తాను చేసిన పనికి డబ్బులు కూడా వస్తుండడంతో సైబర్ నేరగాళ్లపై ఎలాంటి అనుమానం రాలేదు. దాంతో తన బ్యాంకు ఖాతా వివరాలను వారితో పంచుకున్నాడు. ఇదే అదనుగా భావించి సైబర్ నేరగాళ్లు రాజు బ్యాంక్ ఖాతా నుంచి అనధికార లావాదేవీలు నిర్వహించారు. ఏకంగా రూ.77 లక్షలు దోచుకున్నారు. చేసేదేమిలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు, ఓ బుకీని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మరో కోణం బయటపడింది.
ఇటీవల జరిగిన భారత్ పాక్ ప్రపంచ కప్ మ్యాచ్‌పై బెట్టింగ్ పాల్పడినట్లు సదరు బుకీ అంగీకరించాడు. పార్ట్ టైం ఉద్యోగాలు, సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు అంటూ ఎవరైనా ఆశచూపిస్తే జాగ్రత్తగా ఉండాలని, వారు ఎంత మభ్యపెట్టినా.. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను పంచుకోకూడదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment