సీఈవోలే టార్గెట్‌! | Cyber criminals focus is on CEOs | Sakshi
Sakshi News home page

సీఈవోలే టార్గెట్‌!

Published Thu, May 9 2019 2:19 AM | Last Updated on Thu, May 9 2019 2:19 AM

Cyber criminals focus is on CEOs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కంపెనీల సీఈవోలే టార్గెట్‌. ఇతరుల కన్నా కంపెనీల సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు సైబర్‌ దాడుల నుంచి 12 రెట్లు అధిక ముప్పు ఎదుర్కొన్నారు. వారిపై సైబర్‌ దాడుల తీవ్రత 9 రెట్లు పెరిగి పోయింది’అని డేటా చోర్యంపై వెరిజాన్‌ అనే సంస్థ రూపొందించిన పరిశోధన నివేదిక హెచ్చరించింది. పని ఒత్తిడిలో ఉండే సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు అనుమానాస్పద ఈ– మెయిల్స్‌ను తెరిచి సైబర్‌ దాడులకు గురవుతున్నారని వెల్లడించింది. ఇలాంటి 370 ఘటనలను విశ్లేషించగా, అందులో 248 సంఘటనలకు సైబర్‌ సెక్యూరిటీ లోపాలే కారణమని తేల్చింది.

కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు తరచుగా సోషల్‌ ఇంజనీరింగ్‌ అటాక్స్‌ బారిన పడుతున్నారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ సెక్యూరిటీ రంగానికి చెందిన 73 దర్యాప్తు, ఇతర సంస్థల నుంచి 2018లో జరిగిన సైబర్‌ నేరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఈ విశ్లేషణాత్మక నివేదికను వెరిజాన్‌ రూపొం దించింది. బుధవారం ఇక్కడ జరి గిన ఓ కార్యక్రమంలో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఈ నివేదికను ఆవిష్కరించారు. మొత్తం 41,688 సైబర్‌ భద్రత ఉల్లంఘనలను విశ్లేషించగా, అందులో 2013 కేసులు భద్రత లోపాల వల్లే జరిగా యని నిర్ధారించింది. కార్యక్రమంలో వెరిజాన్‌ ఇండియా హెడ్‌ ప్రశాంత్, ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ముస్తఫా షేక్, సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు జకీ ఖురేషి పాల్గొన్నారు.

నివేదికలోని ముఖ్యాంశాలు..
- ఇటీవల ర్యాన్‌సమ్‌వేర్‌ దాడులు పెరిగిపోయాయి. ర్యాన్‌సమ్‌వేర్‌ దాడుల వాటా 24 శాతానికి పెరిగింది. క్రిప్టోమైనింగ్‌ దాడులు అంత మాత్రమే. వాటి వాటా 2 శాతమే.
- ఖర్చులు తగ్గించేందుకు క్లౌడ్‌ మెమొరీలో కంపెనీలు తమ సమాచారాన్ని షేర్‌ చేయడం, స్టోర్‌ చేస్తుండటంతో రిస్క్‌ పెరిగిపోయింది. దొంగిలించిన పాస్‌వర్డ్‌లతో క్లౌడ్‌ ఆధారిత ఈ–మెయిల్‌ ఖాతాలపై దాడులు పెరిగిపోయాయి. మిస్‌ కాన్ఫిగరేషన్‌ కారణంగా అనేక క్లౌడ్‌ ఆధారిత స్టోరేజ్‌పై దాడులు చోటు చేసుకుంటున్నాయి.
- బిజినెస్‌ ఈ–మెయిల్స్, డేటా చౌర్యం ఆధారంగా జరిగిన ఆర్థిక దోపిడీ కేసులపై ఎఫ్‌బీఐ ఇంటర్నెట్‌ క్రైమ్‌ కంప్లైంట్‌ సెంటర్‌ తక్షణ చర్యలు తీసుకుంటోంది. అనుమానాస్పద ఈ–మెయిల్స్‌ ద్వారా జరిగిన దాడులకు సంబంధించిన సగానికి పైగా ఉదంతాల్లో 99 శాతం వరకు డబ్బులను ఎఫ్‌బీఐ రికవరీ చేసింది.
- కంపెనీల హెచ్‌ఆర్‌ సిబ్బందిపై గతేడాది 6 రెట్లు దాడులు తగ్గాయి.
- చిప్, పిన్‌ పేమెంట్‌ టెక్నాలజీ ఆధారంగా కార్డులతో జరిపే ఆర్థిక లావాదేవీలు అత్యంత సురక్షితమని తేలింది. వెబ్‌ ఆధారిత అప్లికేషన్లతో పోలిస్తే కార్డులతో జరిపే చెల్లింపుల్లో నేరాలు తగ్గాయి.
రంగాల వారీగా సైబర్‌ నేరాలు..
విద్య: విద్యా సేవల రంగంపై ఆర్థిక పర సైబర్‌ నేరాలు 80% పెరిగాయి. ఇందుకు 35% మానవ తప్పిదాలే కారణం. వెబ్‌ ఆప్లికేషన్‌ల ఆధారంగా జరిగిన దాడులతో మరో 25% దాడులు జరిగాయి. దొంగిలించిన పాస్‌వర్డ్‌లతో క్లౌడ్‌ ఆధారిత ఈ–మెయిల్స్‌ హ్యాక్‌ చేయడం పెరిగింది.
ఆరోగ్య రంగం: ఈ రంగంలోని సంస్థలు బయటి వ్యక్తుల కన్నా అంతర్గత వ్యక్తుల నుంచే ఎక్కువ ముప్పు ఎదుర్కొంటున్నాయి. ఇతర రంగాలతో పోల్చితే వైద్య రంగ డేటా 18 రెట్లు అధికంగా చౌర్యానికి గురవుతోంది.
తయారీ రంగం: తయారీ రంగంలో సైబర్‌ గూఢచర్యం కంటే ఆర్థికపర దాడులే వరుసగా రెండో ఏడాది అధిక సంఖ్యలో కనిపించాయి. ఇది 68% వృద్ధి చోటు చేసుకుంది.
ప్రభుత్వ రంగం: సైబర్‌ గూఢచర్యం ఈ ఏడాది పెరిగింది. అయితే 47% ఉదంతాలను దాడులు జరిగిన ఏడాది తర్వాతే కనుగొన్నారు.
రిటైల్‌: ఈ రంగంలో 2015తో పోల్చితే పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ యంత్రాలతో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సైబర్‌ నేరాలు 10% తగ్గాయి. వెబ్‌ అప్లికేషన్‌ ఆధారిత ఆర్థిక దోపిడీ నేరాలు 13 రెట్లు పెరిగిపోయాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement