Ransomware Virus
-
సీఈవోలే టార్గెట్!
సాక్షి, హైదరాబాద్: ‘కంపెనీల సీఈవోలే టార్గెట్. ఇతరుల కన్నా కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సైబర్ దాడుల నుంచి 12 రెట్లు అధిక ముప్పు ఎదుర్కొన్నారు. వారిపై సైబర్ దాడుల తీవ్రత 9 రెట్లు పెరిగి పోయింది’అని డేటా చోర్యంపై వెరిజాన్ అనే సంస్థ రూపొందించిన పరిశోధన నివేదిక హెచ్చరించింది. పని ఒత్తిడిలో ఉండే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు అనుమానాస్పద ఈ– మెయిల్స్‌ను తెరిచి సైబర్ దాడులకు గురవుతున్నారని వెల్లడించింది. ఇలాంటి 370 ఘటనలను విశ్లేషించగా, అందులో 248 సంఘటనలకు సైబర్ సెక్యూరిటీ లోపాలే కారణమని తేల్చింది. కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు తరచుగా సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ బారిన పడుతున్నారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ రంగానికి చెందిన 73 దర్యాప్తు, ఇతర సంస్థల నుంచి 2018లో జరిగిన సైబర్ నేరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఈ విశ్లేషణాత్మక నివేదికను వెరిజాన్ రూపొం దించింది. బుధవారం ఇక్కడ జరి గిన ఓ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఈ నివేదికను ఆవిష్కరించారు. మొత్తం 41,688 సైబర్ భద్రత ఉల్లంఘనలను విశ్లేషించగా, అందులో 2013 కేసులు భద్రత లోపాల వల్లే జరిగా యని నిర్ధారించింది. కార్యక్రమంలో వెరిజాన్ ఇండియా హెడ్ ప్రశాంత్, ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ముస్తఫా షేక్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు జకీ ఖురేషి పాల్గొన్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు.. - ఇటీవల ర్యాన్సమ్వేర్ దాడులు పెరిగిపోయాయి. ర్యాన్సమ్వేర్ దాడుల వాటా 24 శాతానికి పెరిగింది. క్రిప్టోమైనింగ్ దాడులు అంత మాత్రమే. వాటి వాటా 2 శాతమే. - ఖర్చులు తగ్గించేందుకు క్లౌడ్ మెమొరీలో కంపెనీలు తమ సమాచారాన్ని షేర్ చేయడం, స్టోర్ చేస్తుండటంతో రిస్క్ పెరిగిపోయింది. దొంగిలించిన పాస్‌వర్డ్‌లతో క్లౌడ్ ఆధారిత ఈ–మెయిల్ ఖాతాలపై దాడులు పెరిగిపోయాయి. మిస్ కాన్ఫిగరేషన్ కారణంగా అనేక క్లౌడ్ ఆధారిత స్టోరేజ్‌పై దాడులు చోటు చేసుకుంటున్నాయి. - బిజినెస్ ఈ–మెయిల్స్, డేటా చౌర్యం ఆధారంగా జరిగిన ఆర్థిక దోపిడీ కేసులపై ఎఫ్‌బీఐ ఇంటర్నెట్ క్రైమ్ కంప్లైంట్ సెంటర్ తక్షణ చర్యలు తీసుకుంటోంది. అనుమానాస్పద ఈ–మెయిల్స్ ద్వారా జరిగిన దాడులకు సంబంధించిన సగానికి పైగా ఉదంతాల్లో 99 శాతం వరకు డబ్బులను ఎఫ్‌బీఐ రికవరీ చేసింది. - కంపెనీల హెచ్ఆర్ సిబ్బందిపై గతేడాది 6 రెట్లు దాడులు తగ్గాయి. - చిప్, పిన్ పేమెంట్ టెక్నాలజీ ఆధారంగా కార్డులతో జరిపే ఆర్థిక లావాదేవీలు అత్యంత సురక్షితమని తేలింది. వెబ్ ఆధారిత అప్లికేషన్లతో పోలిస్తే కార్డులతో జరిపే చెల్లింపుల్లో నేరాలు తగ్గాయి. రంగాల వారీగా సైబర్ నేరాలు.. విద్య: విద్యా సేవల రంగంపై ఆర్థిక పర సైబర్ నేరాలు 80% పెరిగాయి. ఇందుకు 35% మానవ తప్పిదాలే కారణం. వెబ్ ఆప్లికేషన్ల ఆధారంగా జరిగిన దాడులతో మరో 25% దాడులు జరిగాయి. దొంగిలించిన పాస్‌వర్డ్‌లతో క్లౌడ్ ఆధారిత ఈ–మెయిల్స్ హ్యాక్ చేయడం పెరిగింది. ఆరోగ్య రంగం: ఈ రంగంలోని సంస్థలు బయటి వ్యక్తుల కన్నా అంతర్గత వ్యక్తుల నుంచే ఎక్కువ ముప్పు ఎదుర్కొంటున్నాయి. ఇతర రంగాలతో పోల్చితే వైద్య రంగ డేటా 18 రెట్లు అధికంగా చౌర్యానికి గురవుతోంది. తయారీ రంగం: తయారీ రంగంలో సైబర్ గూఢచర్యం కంటే ఆర్థికపర దాడులే వరుసగా రెండో ఏడాది అధిక సంఖ్యలో కనిపించాయి. ఇది 68% వృద్ధి చోటు చేసుకుంది. ప్రభుత్వ రంగం: సైబర్ గూఢచర్యం ఈ ఏడాది పెరిగింది. అయితే 47% ఉదంతాలను దాడులు జరిగిన ఏడాది తర్వాతే కనుగొన్నారు. రిటైల్: ఈ రంగంలో 2015తో పోల్చితే పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలతో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సైబర్ నేరాలు 10% తగ్గాయి. వెబ్ అప్లికేషన్ ఆధారిత ఆర్థిక దోపిడీ నేరాలు 13 రెట్లు పెరిగిపోయాయి. -
'ర్యాన్సమ్' రాక్షసి!
ర్యాన్సమ్వేర్..కంప్యూటర్ వాడుతున్న వారి గుండెల్లో ఇప్పుడు గుబులు పెట్టిస్తున్న పేరు. ఎప్పుడు.. ఏ కంప్యూటర్ను హ్యాక్ చేసి సమాచారాన్ని దొంగిలిస్తారో తెలియక బెంబేలెత్తుతున్నారు. సంస్థలకు సంబంధించిన డేటా తస్కరణకు గురైతే దాని పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. తాజాగా తెలంగాణ, ఏపీలకు చెందిన డిస్కంలకు సంబంధించిన కంప్యూటర్లను ర్యాన్సమ్వేర్ అటాక్ చేసిన విషయం తెలిసిందే. గడువులోగా ఆ సైబర్ నేరగాళ్లు 6 బిట్‌కాయిన్స్ (దాదాపు రూ.24 లక్షలు) డిమాండ్ చేస్తున్నారు. ఆ మొత్తాన్ని చెల్లించకపోతే కంప్యూటర్లను బ్లాక్ చేస్తామని బెదిరిస్తున్నారు. నానాటికీ పెరిగిపోతున్న ఈ నేరాలను కట్టడి చేయడం ఎలాగో తెలియక సైబర్ నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. –సాక్షి, హైదరాబాద్ ‘కీ’లేకుండా అన్‌లాక్ కష్టమే.. కంప్యూటర్లోని డేటా ఎన్క్రిప్షన్ (లాక్ చేయడంలో) రెండు రకాలు ఉంటాయి. సెమెట్రిక్ విధానంలో లాకింగ్, అన్–లాకింగ్కు ఉపకరించే పబ్లిక్, ప్రైవేట్ ‘కీ’లు ఒకటే ఉంటాయి. నాన్–సెమెట్రిక్ విధానంలో వేర్వేరుగా ఉంటాయి. ర్యాన్సమ్వేర్ పంపే నేరస్తులు ఈ విధానంలోనే లాక్ చేస్తారు. దీంతో వారి వద్ద ఉన్న ప్రైవేట్ కీ తెలిస్తే తప్ప ఆ కంప్యూటర్ అన్‌లాక్ కాదు. ఫార్మాట్ చేస్తే అందులో ఉన్న డేటా మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. దీంతో వినియోగదారులకు మరో దారి లేక మనీప్యాక్, ఓచర్స్, ఈ–మనీ రూపాల్లో వారు డిమాండ్ చేసిన మొత్తం చెల్లించాల్సి వస్తోంది. నగదు తమకు చేరిన తర్వాత ఆ సైబర్ నేరస్తులు వైరస్ ప్రోగ్రామ్ ద్వారానే అన్ లాక్ కీ పంపిస్తున్నారు. దీన్ని వినియోగిస్తే మాత్రమే కంప్యూటర్/ల్యాప్‌టాప్ యథాప్రకారం ఓపెన్ కావడంతో పాటు అందులోని డేటా భద్రంగా ఉంటుంది. దర్యాప్తు, నిఘా సంస్థల పేరుతోనూ ర్యాన్సమ్వేర్తో పాటు బ్రౌజర్ లాకర్ వైరస్ ముప్పు పెరిగింది. ఇందులో కంప్యూటర్ మొత్తం లాక్ కావడంతో పాటు ఆ పని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ, అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్‌పోల్ చేసినట్లు స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ వైరస్ దానంతట అదే వెబ్క్యాప్ను ఆపరేట్ చేయడంతో పాటు కంప్యూటర్ ఐపీ అడ్రస్, లొకేషన్స్ తెరపై డిస్ప్లే చేస్తుంది. ‘మీ కదలికల్ని గమనిస్తున్నాం. చేసిన పొరపాటుకు పెనాల్టీ చెల్లించండి’ అంటూ కనిపిస్తుంది. ర్యాన్సమ్వేర్, బ్రౌజర్ లాకర్ వంటి వైరస్‌లను సైబర్ నేరగాళ్లు ఈ–మెయిల్స్, యాడ్స్ రూపంలో కంప్యూటర్లకు పంపిస్తున్నారు. ఉద్యోగార్థులకు సంబంధించిన ఈ–మెయిల్ ఐడీలను వివిధ ఉద్యోగ సంబంధిత వెబ్సైట్లు, అవివాహితులు, వివాహం కోసం రిజిస్టర్ చేసుకున్న వారికి మాట్రిమోనియల్ సైట్స్ నుంచి సైబర్ నేరస్తులు సంగ్రహిస్తున్నారు. అలా ఈ–మెయిల్ ఐడీలు సంగ్రహించే సైబర్ నేరస్తులు వాటికి అనుగుణంగా ఉద్యోగావకాశం, వివాహ సంబంధం, వృత్తి, వ్యాపారం పెంపొందించే మార్గాలంటూ టార్గెట్ చేసిన వారికి మెయిల్స్ పంపడం, యాడ్స్ రూపంలో పాప్అప్స్ ఇస్తున్నారు. వీటిని చూసిన వారు ఆకర్షితులవుతున్నారు. ఈ–మెయిల్, యాడ్‌లోని వివరాలు చూసేందుకు లింకు ఓపెన్ చేస్తే చాలు.. ఆ వైరస్ కంప్యూటర్/ ల్యాప్‌టాప్‌లోకి జొరపడుతోంది. లాక్ చేశామని చెబుతూనే ఈ ర్యాన్సమ్వేర్ వైరస్ కంప్యూటర్లో ప్రవేశించిన మరుక్షణం అందులో ఉన్న డేటా మొత్తాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి, సిస్టం మొత్తాన్ని లాక్ చేస్తుంది. మానిటర్‌పై ‘మీ కంప్యూటర్ను లాక్ చేశాం’అనే మెసేజ్ కనిపిస్తుంది. దీన్ని అన్‌లాక్ చేయడానికి పాస్వర్డ్ మావద్ద ఉందని చెబుతూ.. 3 రోజుల్లో బిట్‌కాయిన్స్ చెల్లించాలని బెదిరి స్తారు. ర్యాన్సమ్వేర్ వైరస్‌తో లాక్ అయిన కంప్యూటర్/ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై నిర్దేశించిన గడువుకు సంబంధించి కౌంట్‌డౌన్ కూడా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. డేటా భద్రంగానే ఉంది దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురైనా, సంస్థకు సంబంధించిన డేటా సురక్షితంగా ఉందని సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి గురువారం తెలిపారు. ఆన్లైన్లో విద్యుత్ బిల్లుల చెల్లింపు, వెబ్సైట్ ఆధారిత సేవలకు విఘాతం కలిగిందన్నారు. వెబ్సైట్ పునరుద్ధరణకు టీసీఎస్ సంస్థ నిర్విరామంగా పనిచేస్తోందని, సాధ్యమైనంత త్వరగా వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు. రాబిన్‌హుడ్ పేరుతో.. డిస్కం వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరస్తులు దానికి రాబిన్‌హుడ్ పేరు పెట్టారని పోలీసులు గుర్తించారు. -
తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలపై ఆన్లైన్ హ్యాకర్లు రెచ్చిపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్సైట్లను హ్యాక్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్), హన్మకొండ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్), తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్), వైజాగ్ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్)ల అధికారిక వెబ్సైట్లపై అంతర్జాతీయ హ్యాకర్లు పంజా విసిరారు. ర్యాన్సమ్వేర్ వైరస్ ద్వారా సర్వర్లలో ఉన్న డేటాను హ్యాకర్లు తస్కరించారు. అనంతరం సర్వర్లలో ఉన్న డేటాను పూర్తిగా డిలీట్ చేశారు. తస్కరించిన డేటాను వెనక్కి ఇచ్చేందుకు రూ.35 కోట్లకు పైగా డబ్బులు ఇవ్వాలని హ్యాకర్లు మెయిల్ పంపించినట్లు అధికారులు తెలిపారు. అయితే, 4 డిస్కంలకు సంబంధించిన సర్వర్లకు బ్యాకప్ ఉండడంతో డేటా భద్రత సమస్య తప్పింది. తిరుపతిలో డిస్కంల సర్వర్లు.. నాలుగు డిస్కంల ద్వారానే 2 రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఈ సంస్థల వెబ్సైట్లను తిరుపతి కేంద్రంగా టాటా కన్సల్టెన్సీ లిమిటెడ్(టీసీఎస్) నిర్వహిస్తోంది. ఉమ్మడి ఏపీ నుంచే డిస్కంల వెబ్సైట్ల సర్వర్లను తిరుపతి నుంచి నిర్వహిస్తున్నారు. గుర్తుతెలియని మెయిల్స్‌ను తెరవగానే వీటి సర్వర్లలో వైరస్ చొరబడి వెబ్సైట్లను హ్యాక్ చేసింది. సర్వర్ల నుంచి మొత్తం డేటాను డిలీట్ చేయడంతోపాటు వాటిని తెరుచుకోకుండా చేశారు. మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురికావడంతో 2 రోజులుగా ఆన్లైన్, పేటీఎం ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు స్తంభించిపోడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. టీసీఎస్ నిర్వహిస్తున్న వెబ్సైట్లే లక్ష్యం.. హ్యాకర్లు టీసీఎస్ కంపెనీ నిర్వహిస్తున్న పలు సంస్థల వెబ్సైట్లపై దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలోని 4 డిస్కంలతో పాటు ఇండియన్ ఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్‌సైట్‌ను సైతం హ్యాకింగ్‌కు పాల్పడినట్లు అధికారవర్గాలు తెలిపాయి. దీనితో పాటు ఆంధ్రాబ్యాంక్ వెబ్‌సైట్‌ను సైతం టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై ఇప్పటివరకు ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హ్యాకింగ్ నిజమే.. తమ సంస్థ వెబ్సైట్ హ్యాక్ అయినట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ధ్రువీకరించారు. సంస్థ వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలను టీసీఎస్‌కు అప్పగించామని, టీసీఎస్‌తో కలసి సంస్థ ఐటీ నిపుణులు వెబ్‌సైట్‌ను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ర్యాన్సమ్వేర్ వైరస్ కారణంగా వెబ్సైట్ హ్యాక్ అయ్యిందన్నారు. ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ వెబ్సైట్లను హ్యాక్ చేసిన దుండగులే తమ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు భావిస్తున్నామన్నారు. తిరుపతిలో డిస్కంల వెబ్సైట్లకు సంబంధించిన డేటా బ్యాకప్ ఉందన్నారు. బ్యాకప్ బాధ్యత టీసీఎస్‌దే.. తమ సంస్థ వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలు టీసీఎస్ చూస్తోందని, పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదేనని టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ ఎ.గోపాల్‌రావు అన్నారు. ఇప్పటికే వెబ్‌సైట్‌లోని కొన్ని ఆప్షన్లను పునరుద్ధరించామని తెలిపారు. డిస్కంల వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురికావడంపై హైదరాబాద్ నగర సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 65 కింద గుర్తుతెలియని హ్యాకర్లపై కేసు నమోదు చేశామని సీసీఎస్ అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు. -
ఆయిల్‌ఫెడ్‌పై ‘ర్యాన్సమ్’ ఎటాక్
సాక్షి, సిటీబ్యూరో: రెండేళ్ల క్రితం ప్రపంచ దేశాలను వణికించిన ర్యాన్సమ్ వేర్ ఎటాక్ రాజధానిలో మరోసారి వెలుగు చూసింది. ఆయిల్ ఫెడ్గా పిలిచే తెలంగాణ నూనె గింజల ఉత్పతిదారుల సహకార సమాఖ్య (తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్) టార్గెట్‌గా చేసుకున్న సైబర్ నేరగాళ్లు కంప్యూటర్లను స్తంభింపజేశారు. ఆన్లైన్ క్రిమినల్స్ డిమాండ్ చేసిన నాలుగు బిట్ కాయిన్లు (రూ.9,72,066) చెల్లించకపోతే సంస్థకు చెందిన డేటా క్రాష్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. భవిష్యత్‌లో ర్యాన్సమ్వేర్కు గురికాకుండా ఉండాలంటే మరికొంత చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై శుక్రవారం ఫిర్యాదు అందుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయిల్‌ఫెడ్ సంస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి నెలా లావాదేవీలకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తూ ఉంటుంది. ఈ వ్యవహారాలన్నీ ఉండే సర్వర్‌ను ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోంది. నాలుగు రోజుల క్రితం యథావిధిగా ఈ సంస్థ సిబ్బంది తమ దైనందిన విధుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా ర్యాన్సమ్వేర్ ఎటాక్ జరిగింది. ర్యాన్సమ్ వేర్ వైరస్‌లను సైబర్ నేరగాళ్లు ఈ–మెయిల్ రూపంలో పంపినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ర్యాన్సమ్వేర్ వైరస్ కంప్యూటర్లలోకి ప్రశించిన మరుక్షణం వాటిలో ఉన్న డేటా మొత్తం ఎన్‌క్రిప్ట్ అయిపోయి సిస్టమ్స్‌తో సర్వర్ సైతం లాక్ అయింది. ఆయిల్‌ఫెడ్‌లోని కంప్యూటర్లలోని డేటా ఎన్క్రిప్షన్ నాన్–సెమెట్రిక్ విధానంలో జరగడంతో ‘ప్రైవేట్ కీ’కు ట్రాక్ చేయడం ఐటీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ సంస్థలోని ఎవరికీ సాధ్యం కాలేదు. సైబర్ నేరగాళ్లు ఈ సంస్థ ఎన్క్రిప్టెడ్ డేటాను డీక్రిప్ట్ చేయడానికి నాలుగు బిట్ కాయిన్లు డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలా జరగకుండా రక్షణ కల్పించాలంటే మరికొంత ఇవ్వాలన్నారు. బిట్‌కాయిన్స్ కొనుగోలు, బదిలీ తదితరాలను గూగుల్ నుంచి తెలుసుకోవాలంటూ సందేశాన్నీ పంపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఎటాక్ ఎక్కడ నుంచి జరిగింది? సైబర్ నేరగాళ్ళు ఏ విధానంలో డబ్బు చెల్లించిమని చెప్పారు? తదితర అంశాలను సైబర్ కాప్స్ ఆరా తీస్తున్నారు. పటిష్టమైన వ్యవస్థ లేకుంటే ర్యాన్సమ్వేర్కు పరిష్కారం లేదని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. సాధారణ వినియోగదారులకు డేటా అంత ప్రాముఖ్యం కాకపోయినా... ఇలాంటి ప్రభుత్వరంగ సంస్థలు, సాఫ్ట్వేర్ రంగం, ఉన్నతోద్యోగులు, బీపీఓ ఉద్యోగులకు ఇది ఎంతో కీలకమైంది. నేరగాళ్లు ఏ రెండు కంప్యూటర్లకూ ఒకే రకమైన ప్రైవేట్ కీ ఏర్పాటు చేయడని వివరిస్తున్నారు. దీంతో బాధితులుగా మారిన ప్రతి ఒక్కరూ వారు అడిగినంత చెల్లించాల్సి రావడమో, డేటా కోల్పోవడమో జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ తరహాలో నేరాలు చేసే వాళ్ళు బోగస్ సర్వీర్లు, ఐపీ అడ్రస్‌లు వినియోగిస్తుంటారు. దీంతో అలాంటి వారిని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. అపరిచిత ఐడీ నుంచి వచ్చే ఈ–మెయిల్స్, అనుమానాస్పద యాడ్స్‌కు దూరంగా ఉండటం, కంప్యూటర్లో పటిష్టమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవడమే దీనికి పరిష్కారంగా సూచిస్తున్నారు. -
ప్రపంచంపై మరో హ్యాకింగ్ పిడుగు
మాస్కో : సైబర్ నేరగాళ్లు ప్రపంచంపై మరోసారి మల్వేర్‌తో విరుచుపడ్డారు. ఎంత పటిష్టంగా రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నా.. హ్యాకర్లు మాత్రం అంతేస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ప్రపంచాన్ని బ్యాడ్‌రాబిట్ మల్వేర్ వణికిస్తోంది. రష్యా, ఉక్రెయిన్, జపాన్లపై బ్యాడ్‌రాబిట్ తీవ్రస్థాయిలో దాడి చేసింది. స్మార్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సైబర్ నేరస్థులు.. మల్వేర్లతో హ్యాకింగ్ చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్నారు. బ్యాడ్‌రాబిట్ ఎఫెక్ట్‌తో రష్యా, ఉక్రెయిన్‌లో విమానాలు నిలిచిపోయాయని రష్యన్ ఇంటర్ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. హ్యాకర్లు.. మల్వేర్లతో ప్రపంచం మీద దాడి చేసే అవకాశముందని రెండు నెలల కిందటే అమెరికా నిఘా వర్గాలు.. ప్రకటించాయి. భారీగా ఆర్థిక వ్యవస్థలు ధ్వంసమవుతాయని.. అప్పట్లోనే అమెరికా నిఘావర్గాలు హెచ్చరించాయి. హ్యాకర్లు.. మౌలిక వసతుల కల్పన, రవాణా, ఇతర ఆర్థిక వ్యవస్థలపై దాడి చేస్తారని సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్ రాబర్ట్ లిపోవస్కీ గతంలోనే పేర్కొన్నారు. బ్యాడ్‌రాబిట్ ర్యాన్సమ్వేర్ రకానికి చెందిన వైరస్. ఈ వైరస్ పొరపాటున కంప్యూటర్లలో ప్రవేశిస్తే.. సిస్టమ్ వెంటనే లాక్ అయిపోతుందని నిపుణులు చెబుతున్నారు. లాక్ ఓపెన్ చేసేందుకు బాధితుల నుంచి హ్యాకర్లు భారీ స్థాయిలో సొమ్మును డిమాండ్ చేస్తున్నారు. బ్యాడ్‌రాబిట్ లమ్వేర్ కారణంగా.. ఉక్రెయిన్‌లోని ఆడెస్సా ఎయిర్‌పోర్ట్‌లో విమానాలన్నీ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ప్యాసింజర్ల డేటాను అధికారులే స్వయంగా పరీక్షిస్తుండడం వల్ల విమానాలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ సైబర్ పోలీస్ చీఫ్ మాట్లాడుతూ.. పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. -
భారీ సైబర్ దాడి
- మళ్లీ పడగవిప్పిన ర్యాన్సమ్వేర్.. - రష్యా, ఉక్రెయిన్, బ్రిటన్ సహా ఈయూ దేశాలు అతలాకుతలం - ఎయిర్‌పోర్టు, కార్యాలయాల్లో ఎక్కడిక్కడే నిలిచిన పనులు మాస్కో/లండన్: సైబర్ ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. ర్యాన్సమ్వేర్ వైరస్‌తో మంగళవారం మరోమారు యూరప్ దేశాలపై విరుచుకుపడ్డారు. దీంతో రష్యా, ఉక్రెయిన్, బ్రిటన్, స్పెయిన్ తదితర దేశాల్లో కార్యకలాపాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. మొదటిగా రష్యాలోని అతిపెద్ద ఆయిల్ కంపెనీ సైబర్‌దాడికి గురైనట్లు గుర్తించారు. కొద్దిసేపటికే ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని కంప్యూటర్లు వైరస్ దాడికి గురయ్యాయి. ఈ రెండు దేశాల్లోని ఫార్మా, మీడియా, బయోటెక్నాలజీ తదితర కంపెనీలన్నీ వైరస్ బారిన పడటంతో గందరగోళం నెలకొంది. భారత్ సహా ఆసియాదేశాలు, అమెరికాలపై సైబర్‌దాడి ప్రభావం ఏమేరకు ఉందనేది తెలియాల్సిఉంది. అటు యూరప్‌లోని బ్రిటన్, స్పెయిన్‌లలోని పలు కంపెనీల ఆఫీసులు ర్యాన్సమ్ దాడికి గురైనట్లు వార్తలు వచ్చాయి. నెల రోజుల కిందటే ప్రపంచమంతా ర్యాన్సమ్వేర్ వాన్నాక్రై వైరస్ ధాటికి విలవిలలాడిన పరిస్థితి తెలిసిందే. ఇది చూశారంటే మీ ఫైల్స్ గోవిందా.. సైబర్‌దాడికి గురైన కంప్యూటర్ల స్క్రీన్లపై "If you see this text, then your files are no longer accessible, because they have been encrypted. Perhaps you are busy looking for a way to recover your files, but don't waste your time. Nobody can recover your files without our decryption service" అనే సందేశం ప్రత్యక్షమైంది. ఉక్రెయిన్‌కు భారీ దెబ్బ నేటి సైబర్ దాడితో అన్ని దేశాలకంటే ఎక్కువగా నష్టపోయింది ఉక్రెయినే అని ఆ దేశ ప్రధాని అన్నారు. ఎయిర్‌పోర్టు, కంపెనీల కార్యాలయాలన్నీ దాడికి గురయ్యాయని, గతంలో ఎప్పుడూ ఇంత నష్టాన్ని చవిచూడలేదని పేర్కొన్నారు. -
సైబర్ దాడి వెనక ఓ 14 ఏళ్ల బాలుడి హస్తం ?
యెకోహామా : ప్రపంచాన్ని వణికించిన ర్యాన్సమ్వేర్ వైరస్ ప్రభావం అంతా ఇంతా కాదు. అయితే ఈ సైబర్ దాడి వెనక ఓ 14 ఏళ్ల బాలుడి హస్తం ఉన్నట్టు వస్తున్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ర్యాన్సమ్వేర్ వైరస్ కేసులో జపాన్ పోలీసులు తొలిసారిగా ఓ బాలుడిని అరెస్ట్ చేశారు. వైరస్ ప్రొగ్రామ్‌లు రాసి వాటితో తయారు చేసిన సాఫ్టావేర్ను ఈమెయిల్ల రూపంలో పంపించేవాడని బాలుడు పోలీసులకు తెలిపాడు. తన పేరు అందరికి తెలియాలనే ఈ పని చేశానని ఆ బాలుడు చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు. బాలుడు తన ఇంట్లో వినియోగించే కంప్యూటర్ నుంచి వైరస్ ప్రోగ్రామ్‌లు రాసినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. ర్యాన్సమ్వేర్ వైరస్‌ని నేనే తయారు చేశా.. దీన్ని మీరూ ఫ్రీగా వాడుకోవొచ్చు అంటూ సోషల్ మీడియాలో సదరు బాలుడు ఓ కామెంట్ కూడా పెట్టాడు. అంతేకాదు ఈ కామెంట్‌ను చూసి సదరు లింక్ ద్వారా వందకి పైగా వైరస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్లు అయినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేయడంతో ఎలాంటి నష్టం వాటిల్లే ప్రమాదం లేదు. కానీ, సదరు వైరస్ సాఫ్ట్ వేర్ సహాయంతో మరిన్ని ర్యాన్సమ్వేర్ వైరస్లని సులభంగా తయారు చేసే అవకాశం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ సాఫ్ట్వేర్ ఆధారంగా పంపే ఈ మెయిల్లను క్లిక్ చేస్తే.. మీ కంప్యూటర్లో వైరస్ అటాక్ అయింది. మీరు తిరిగి మీ కంప్యూటర్ వినియోగించాలనుకుంటే మాకు ఫైన్ కట్టాలి అని ఓ పాప్అప్ మెసేజ్ వస్తుంది. జువైనల్ యాక్ట్ అమలులో ఉండటంతో సదరు బాలుడి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ప్రొగ్రామర్(బాలుడు) తన ప్రతిభ చూపించడానికే ఈ ర్యాన్సమ్వేర్ వైరస్‌ను తయారు చేసినట్టు ఒప్పుకోవడం కొసమెరుపు. అయితే బాలుడు రూపొందించిన వైరస్ సాఫ్ట్ వేర్ ప్రభావం ఏమేరకు ఉందో తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న వన్నా క్రై : ఇటీవలికాలంలో భారత్ సహా దాదాపు వంద దేశాల్లోని లక్షలాది కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే. వాటిల్లోని డేటా మొత్తాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి, దానిని తీయాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సైబర్ దాడుల మూలంగా బ్రిటన్‌లో చాలా ఆస్పత్రులు చికిత్స కోసం వచ్చిన రోగులను చేర్చుకోకుండా తిప్పిపంపాల్సి వచ్చింది. ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు ఆపరేషన్లు, చికిత్సలు నిలిచిపోయాయి. జర్మనీలో రైళ్ల రాకపోకలు తెలియకుండా పోయాయి. స్పెయిన్‌లో టెలికమ్యూనికేషన్లు, గ్యాస్ వ్యవస్థలకు అంతరాయం కలిగింది. రష్యాలో బ్యాంకులు ఉలిక్కిపడ్డాయి. ప్రభుత్వ కంప్యూటర్లు వెయ్యికి పైగా మూగబోయాయి. చైనాలో కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఇబ్బందులపాలయ్యాయి. ఉత్తరకొరియాలోని ఆస్పత్రులూ ఇక్కట్లపాలయ్యాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో 18 పోలీస్స్టేషన్లలో కంప్యూటర్లు స్తంభించిపోయాయి. వనా క్రై దాడిని తిప్పికొట్టేందుకు ప్రపంచ దేశాల్లో సైబర్ భద్రతా నిపుణులు రేయింబవళ్లూ శ్రమిస్తున్నారు. -
‘వాన్నా క్రై’.. లాజరస్ గ్రూప్ పనే!
-
విమానాల్లో ల్యాప్‌టాప్‌లపై అమెరికా నిషేధం
వాషింగ్టన్: సైబర్ ప్రపంచాన్ని వణికిస్తున్న ర్యాన్సమ్వేర్ వాన్నా క్రై కారణంగా అమెరికాలోనూ ఆందోళన తీవ్రమైంది. ఈ నేపథ్యంలో యూరప్ నుంచి అమెరికాకు విమానంలో వచ్చే ప్రయాణికులు ల్యాప్‌టాప్‌లు తీసుకురావద్దని నిషేధం విధించారు. యూరప్ నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికుల వద్ద ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్ లాంటి గాడ్జెట్లు తెస్తున్నారా అనే కోణంలో విమానాశ్రయాల్లో తనిఖీలు చేయాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సూచించింది. గత మార్చిలో ఎనిమిది దేశాలకు చెందిన 10 ఎయిర్‌పోర్టుల నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద ల్యాప్టాప్స్ ఉండొద్దంటూ అమెరికా నిషేధించిన విషయం తెలిసిందే. అవసరమైతే యూరోప్ ఎయిర్‌లైన్స్‌ను అమెరికాకు రాకుండా తాత్కాలికంగా నిషేధించాలని భావిస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి డేవిడ్ లాపన్ అన్నారు. యూరోపియన్ ఎయిర్‌లైన్స్‌తో పాటు పలు దేశాల ఎయిర్‌లైన్స్‌ను ఆమెరికాకు రాకుండా త్వరలో నిషేధించే దిశగా ఆమెరికా అడుగులు వేస్తుంది. యూరప్‌లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న ర్యాన్సమ్వేర్ వాన్నా క్రై భారిన అమెరికా పడకుండా ఉండాలంటే ఈ చర్యలు తప్పవన్నారు. బుధవారం డిప్యూటీ సెక్రటరీ ఈలైన్ డ్యూక్ యూరోప్ సంబంధిత అధికారులతో బ్రస్సెల్స్‌లో సమావేశం కానున్నారు. సమ్మర్లో ఈయూ నుంచి ప్రతివారం 3250కి పైగా విమానాలు అమెరికాకు వస్తుంటాయని, ఆ సమయంలో సైబర్ వైరస్ భారినపడ్డ వారి డివైజ్‌లు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్ వంటి వాటివల్ల తమ దేశంలోనూ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని డేవిడ్ లాపన్ ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ దాడి వల్ల బ్యాటరీలు పేలిపోయే అవకాశం ఉందని, ఈ క్రమంలో ఉగ్రదాడులు జరగొచ్చునని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారని చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్ రష్యాకు అందించిన నిఘా రహస్యాలు మరేవో కాదని, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను సాధనాలుగా వాడుకుని సైబర్ దాడితో పాటు పక్కా ప్రణాళికలతో ఉగ్రదాడులకు పాల్పడే సూచనలు కనిపిస్తున్నాయని రష్యాతో చర్చించినట్లు పేర్కొన్నారు. -
‘వాన్నా క్రై’.. లాజరస్ గ్రూప్ పనే!
లండన్/న్యూఢిల్లీ/ముంబై: సైబర్ ప్రపంచాన్ని వణికిస్తున్న ర్యాన్సమ్వేర్ వాన్నా క్రై.. గతంలోనూ ఇలాంటి వైరస్‌లను పంపిన లాజరస్ గ్రూప్ పనేనని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. వాన్నా క్రై పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడింది ఉత్తర కొరియాకు చెందిన లాజరస్ గ్రూపే కావొచ్చని గూగుల్ సెక్యూరిటీ రీసెర్చర్ నీల్ మెహతా తెలిపారు. వాన్నా క్రై సాఫ్ట్‌వేర్‌కు గతంలో లాజరస్ సృష్టించిన హ్యాకింగ్ టూల్స్‌కు మధ్య పోలికలు ఉన్నాయని చెప్పారు. ఒరిజినల్ వాన్నా క్రై కోడ్‌లోని అంకెలు, అక్షరాలు, సొమ్ము చెల్లించాలన్న హెచ్చరికలోని ఇంగ్లిష్ పదాల ప్రయోగం చూస్తే అది వేరే భాషలో రాసిన వాక్యాలను కంప్యూటర్ ద్వారా అనువదించినట్లు తెలుస్తోందని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు అలన్ వుడ్‌వర్డ్ అన్నారు. ర్యాన్సమ్వేర్ దాడితో వసూలు చేసింది 60 వేల డాలర్లేనని బిట్‌కాయిన్ సంస్థ చెబుతోంది. మన ‘ఐటీ’పై ప్రభావం లేదు: భారత్ వాన్నాక్రై ర్యాన్సమ్వేర్ వైరస్ భారత ఐటీ వ్యవస్థపై ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపలేదని ప్రభుత్వం తెలిపింది. ‘మాల్వేర్ ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి సంబంధించిన 18 కంప్యూటర్లకు, కేరళ పంచాయతీ కంప్యూటర్లకు సోకడం వంటి ఐదారు విడివిడి ఉదంతాలకే పరిమితమైంది. ఐటీని కుదేలు చేసినట్లు సమాచారమేదీ రాలేదు. వివిధ సంస్థలతో కూడిన బృందం పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తోంది’ అని ఐటీ కార్యదర్శి అరుణా సుందరరాజన్ మంగళవారం తెలిపారు. భారత్‌లో వాన్నాక్రై ర్యాన్సమ్వేర్ దాడులకు 48వేల ప్రయత్నాలు జరిగాయని, వీటిలో ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్నట్లు గుర్తించామని సైబర్ భద్రత సంస్థ క్విక్ హీల్ టెక్నాలజీస్ తెలిపింది. -
ప్రపంచం నెత్తిన మరో సైబర్ పిడుగు
-
వనా క్రై 2.0
నేడు ప్రపంచం నెత్తిన మరో సైబర్ పిడుగు ► దీన్ని తట్టుకోవటం కష్టమేనని నిపుణుల హెచ్చరిక ► సోమవారం బయటపడనున్న ర్యాన్సమ్వేర్ అసలు ప్రభావం ► భారత్‌కూ ముప్పు పొంచి ఉందన్న సెర్ట్–ఇన్ ► మౌలిక సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచన ► 150 దేశాల్లో 2 లక్షల మంది వనాక్రై బాధితులు లండన్/న్యూఢిల్లీ: ‘వనా క్రై’ సృష్టించిన బీభత్సం నుంచి కోలుకునే ప్రయత్నాల్లో ఉండగానే మరో సైబర్ సునామీ విరుచుకుపడనున్నట్లు నిపుణులు హెచ్చరించారు. అది కూడా సోమవారమే జరిగే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. వనా క్రై (ర్యాన్సమ్వేర్ వైరస్) ద్వారా ప్రపంచవ్యాప్తంగా 1.25 లక్షల కంప్యూటర్ వ్యవస్థలు తీవ్రంగా నష్టపోయాయి. అయితే రానున్న సైబర్ వైరస్ ఇంతకన్నా రెట్టింపు ప్రమాదకారిగా ఉండొచ్చని.. అందువల్ల కోలుకునేందుకు అవకాశం కూడా ఉండకపోవచ్చని హెచ్చరించారు. ర్యాన్సమ్వేర్ అటాక్ ప్రభావాన్ని కొంతమేర తగ్గించటంలో సహాయపడిన యూకే సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ ‘మాల్‌వేర్‌టెక్’ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ‘ర్యాన్సమ్వేర్ (వనా క్రై వర్షన్1) నష్టాన్ని మేము అతికష్టంమీద తగ్గించగలిగాం. కానీ వచ్చే (వనా క్రై వర్షన్ 2.0) ఉపద్రవాన్ని మేము కూడా ఆపలేం. వైరస్‌ను అప్‌గ్రేడ్‌ను చేసి ‘కిల్ స్విచ్’ ఆప్షన్‌ను తొలగించి సరికొత్త దాడికి హ్యాకర్లు పాల్పడే అవకాశం ఉంది. కంప్యూటర్ వ్యవస్థను వీలైనంత త్వరగా ప్యాచ్ చేసుకోవటమే ఏకైక పరిష్కారం’ అని సంస్థ ప్రతినిధి ట్వీట్ చేశారు. పలు మాల్వేర్ పరిశోధన నిపుణులు కూడా ఇదే విషయాన్ని హెచ్చరిస్తున్నారు. 150 దేశాల్లో 2 లక్షల మంది బాధితులు ఈ వైరస్ బారిన పడ్డారని యూరప్ ప్రముఖ సెక్యూరిటీ నిపుణుడు రోబ్ వైన్‌రైట్ తెలిపారు. ‘మనం పెనుప్రమాదం అంచున ఉన్నాం. శుక్రవారం నాటి వైరస్ దాడి బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వారాంతం తర్వాత సోమవారం ఉదయం మళ్లీ పని మొదలైన తర్వాత ఈ ప్రమాదం మరెంత తీవ్రంగా ఉంటుందో నేను చెప్పలేను’ అని ఆయన స్పష్టం చేశారు. ‘సైబర్ నేరగాళ్లు తమనెవరూ గుర్తించలేమనుకుంటున్నారు. కానీ మేం అన్ని సాధ్యమైన ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలోనే వారిని గుర్తించి చట్టంముందు నిలబెడతాం’ అని యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ తెలిపింది. భారత్‌కు పొంచిఉన్న ముప్పు ప్రపంచాన్ని గడగడలాడించిన వనా క్రైతో భారత్‌కు ముప్పు పొంచి ఉందని మన దేశ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సెర్ట్–ఇన్) హెచ్చరించింది. పనిప్రదేశాల్లో (వర్క్ స్టేషన్లు) ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అందరు ఇంటర్నెట్ వినియోగదారులు తమ కంప్యూటర్లను రిమోట్ లాకింగ్ చేయాలని అప్రమత్తం చేసింది. ఈ దిశగా సెర్ట్–ఇన్ ఎర్రరంగులో ‘క్రిటికల్ అలర్ట్’ను జారీ చేసింది. ‘వనా క్రై భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. విండోస్ సిస్టమ్స్ హార్డ్‌డిస్క్‌లోని ఫైళ్లను ఈ వైరస్ ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. ఆ తర్వాత కంప్యూటర్, లోకల్ ఏరియా నెట్వర్క్ (లాన్)లలో విస్తరిస్తుంది. ఈ–మెయిల్స్‌లో వచ్చే అనవసర అటాచ్మెంట్ల ద్వారా కూడా ఈ వైరస్ విస్తరిస్తోంది’ అని వెల్లడించింది. ఇప్పటికే దీని ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆసుపత్రులు, టెలికమ్యూనికేషన్ సంస్థలు, పోలీసు కంప్యూటర్లు, ఇతర కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ వైరస్ వ్యాపించిన కంప్యూటర్లు ఆన్లైన్ ద్వారా హ్యాకర్‌కు కొంతమొత్తం చెల్లించేంతవరకు మీ సమాచారం మొత్తాన్ని బ్లాక్ చేస్తుంది. ప్లీజ్ రీడ్ మి.టీఎక్స్‌టీ ఫైల్‌ను స్క్రీన్‌పై చూపిస్తుంది. ఈ టెక్స్ట్ ఫైల్లో కంప్యూటర్ ఎందుకు బ్లాక్ అయిందే వివరాలుంటాయి. ‘వనా క్రై వైరస్ ఉన్న ఫైళ్లు .ఎల్ఏవై6, .ఎస్క్యూఎల్ఐటీ3, .ఎస్క్యూఎల్ఐటీడీబీ, .ఏసీసీడీబీ, .జావా, .డాక్స్ వంటి ఫైళ్లతో వస్తాయి. ఇలాంటి ఫైళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి’ అని సెర్ట్–ఇన్ హెచ్చరించింది. రంగంలోకి సమాచార సాంకేతిక శాఖ వనా క్రై వైరస్‌పై ప్రపంచమంతా అతలాకుతలం అవుతుండటంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ రంగంలోకి దిగింది. ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్ఐసీ, ఆధార్ (యూఐడీఏఐ) వంటి సంస్థలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దేశంలోని డిజిటల్ పేమెంట్ల చెల్లింపుల వ్యవస్థ భద్రంగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ‘ర్యాన్సమ్వేర్ విధ్వంసంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. దీని ఆటకట్టించేందుకు సంబంధిత ఏజెన్సీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. టెలికాం మంత్రిత్వ శాఖ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సీడీఏసీలతోనూ సంప్రదింపులు జరుపుతూ.. వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలిస్తోంది. మౌలికసంస్థలూ బహుపరాక్! కీలకమైన మౌలికవసతుల సంస్థలైన బ్యాంకులు, విమానాశ్రయాలు, టెలికామ్ నెట్‌వర్క్‌లు, స్టాక్ మార్కెట్లు, రక్షణ, విద్యుత్ తదితర రంగాలు వనా క్రై విషయంలో జాగ్రత్తగా ఉండాలని సెర్ట్–ఇన్ హెచ్చరించింది. చరిత్రలోనే అతిపెద్ద సైబర్‌దాడిగా పేర్కొంటున్న ఈ వనా క్రై ఘటనలో అమెరికా, రష్యా సహా వందకుపైగా దేశాలు అతలాకుతలం అయిన విషయాన్ని గుర్తుచేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మినహా భారత్‌లో భారీ నష్టం జరిగినట్లుగా ఇంతవరకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది. అయినా అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రజావినియోగ వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. చేయాల్సిన, చేయకూడని అంశాలను అన్ని ప్రభుత్వ శాఖలకు చేరవేసింది. ‘ఇప్పటికే మైక్రోసాఫ్ట్ అందించిన సాఫ్ట్వేర్ పాచ్ వినియోగిస్తున్న ఇంటర్నెట్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిగిలిన వారు వెంటనే ఈ ప్యాచ్ కోసం అప్లై చేసుకోవాలి’ అని సెర్ట్ ఇన్ సూచించింది. కాగా, వనా క్రై వైరస్ ప్రభావం తమపైనా కనబడుతోందని మహారాష్ట్ర పొలీస్ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.