వనా క్రై 2.0 | International Ransomware Virus Prompts Warnings of More Cyberattacks | Sakshi
Sakshi News home page

వనా క్రై 2.0

Published Mon, May 15 2017 12:54 AM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM

వనా క్రై 2.0

వనా క్రై 2.0

నేడు ప్రపంచం నెత్తిన మరో సైబర్‌ పిడుగు
దీన్ని తట్టుకోవటం కష్టమేనని నిపుణుల హెచ్చరిక
సోమవారం బయటపడనున్న ర్యాన్‌సమ్‌వేర్‌ అసలు ప్రభావం
భారత్‌కూ ముప్పు పొంచి ఉందన్న సెర్ట్‌–ఇన్‌
మౌలిక సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచన
150 దేశాల్లో 2 లక్షల మంది వనాక్రై బాధితులు  


లండన్‌/న్యూఢిల్లీ: ‘వనా క్రై’ సృష్టించిన బీభత్సం నుంచి కోలుకునే ప్రయత్నాల్లో ఉండగానే మరో సైబర్‌ సునామీ విరుచుకుపడనున్నట్లు నిపుణులు హెచ్చరించారు. అది కూడా సోమవారమే జరిగే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. వనా క్రై (ర్యాన్‌సమ్‌వేర్‌ వైరస్‌) ద్వారా ప్రపంచవ్యాప్తంగా 1.25 లక్షల కంప్యూటర్‌ వ్యవస్థలు తీవ్రంగా నష్టపోయాయి. అయితే రానున్న సైబర్‌ వైరస్‌ ఇంతకన్నా రెట్టింపు ప్రమాదకారిగా ఉండొచ్చని.. అందువల్ల కోలుకునేందుకు అవకాశం కూడా ఉండకపోవచ్చని హెచ్చరించారు. ర్యాన్‌సమ్‌వేర్‌ అటాక్‌ ప్రభావాన్ని కొంతమేర తగ్గించటంలో సహాయపడిన యూకే సెక్యూరిటీ రీసెర్చ్‌ సంస్థ ‘మాల్‌వేర్‌టెక్‌’ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

‘ర్యాన్‌సమ్‌వేర్‌ (వనా క్రై వర్షన్‌1) నష్టాన్ని మేము అతికష్టంమీద తగ్గించగలిగాం. కానీ వచ్చే (వనా క్రై వర్షన్‌ 2.0) ఉపద్రవాన్ని మేము కూడా ఆపలేం. వైరస్‌ను అప్‌గ్రేడ్‌ను చేసి ‘కిల్‌ స్విచ్‌’ ఆప్షన్‌ను తొలగించి సరికొత్త దాడికి హ్యాకర్లు పాల్పడే అవకాశం ఉంది. కంప్యూటర్‌ వ్యవస్థను వీలైనంత త్వరగా ప్యాచ్‌ చేసుకోవటమే ఏకైక పరిష్కారం’ అని సంస్థ ప్రతినిధి ట్వీట్‌ చేశారు. పలు మాల్‌వేర్‌ పరిశోధన నిపుణులు కూడా ఇదే విషయాన్ని హెచ్చరిస్తున్నారు. 150 దేశాల్లో 2 లక్షల మంది బాధితులు ఈ వైరస్‌ బారిన పడ్డారని యూరప్‌ ప్రముఖ సెక్యూరిటీ నిపుణుడు రోబ్‌ వైన్‌రైట్‌ తెలిపారు.

‘మనం పెనుప్రమాదం అంచున ఉన్నాం. శుక్రవారం నాటి వైరస్‌ దాడి బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వారాంతం తర్వాత సోమవారం ఉదయం మళ్లీ పని మొదలైన తర్వాత ఈ ప్రమాదం మరెంత తీవ్రంగా ఉంటుందో నేను చెప్పలేను’ అని ఆయన స్పష్టం చేశారు. ‘సైబర్‌ నేరగాళ్లు తమనెవరూ గుర్తించలేమనుకుంటున్నారు. కానీ మేం అన్ని సాధ్యమైన ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలోనే వారిని గుర్తించి చట్టంముందు నిలబెడతాం’ అని యూకే నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ తెలిపింది.

భారత్‌కు పొంచిఉన్న ముప్పు
ప్రపంచాన్ని గడగడలాడించిన వనా క్రైతో భారత్‌కు ముప్పు పొంచి ఉందని మన దేశ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (సెర్ట్‌–ఇన్‌) హెచ్చరించింది. పనిప్రదేశాల్లో (వర్క్‌ స్టేషన్లు) ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అందరు ఇంటర్నెట్‌ వినియోగదారులు తమ కంప్యూటర్లను రిమోట్‌ లాకింగ్‌ చేయాలని అప్రమత్తం చేసింది. ఈ దిశగా సెర్ట్‌–ఇన్‌ ఎర్రరంగులో ‘క్రిటికల్‌ అలర్ట్‌’ను జారీ చేసింది. ‘వనా క్రై భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. విండోస్‌ సిస్టమ్స్‌ హార్డ్‌డిస్క్‌లోని ఫైళ్లను ఈ వైరస్‌ ఎన్‌క్రిప్ట్‌ చేస్తుంది. ఆ తర్వాత కంప్యూటర్, లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌ (లాన్‌)లలో విస్తరిస్తుంది.

ఈ–మెయిల్స్‌లో వచ్చే అనవసర అటాచ్‌మెంట్ల ద్వారా కూడా ఈ వైరస్‌ విస్తరిస్తోంది’ అని వెల్లడించింది. ఇప్పటికే దీని ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆసుపత్రులు, టెలికమ్యూనికేషన్‌ సంస్థలు, పోలీసు కంప్యూటర్లు, ఇతర కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ వైరస్‌ వ్యాపించిన కంప్యూటర్‌లు ఆన్‌లైన్‌ ద్వారా హ్యాకర్‌కు కొంతమొత్తం చెల్లించేంతవరకు మీ సమాచారం మొత్తాన్ని బ్లాక్‌ చేస్తుంది. ప్లీజ్‌ రీడ్‌ మి.టీఎక్స్‌టీ ఫైల్‌ను స్క్రీన్‌పై చూపిస్తుంది. ఈ టెక్స్‌ట్‌ ఫైల్‌లో కంప్యూటర్‌ ఎందుకు బ్లాక్‌ అయిందే వివరాలుంటాయి. ‘వనా క్రై వైరస్‌ ఉన్న ఫైళ్లు .ఎల్‌ఏవై6, .ఎస్‌క్యూఎల్‌ఐటీ3, .ఎస్‌క్యూఎల్‌ఐటీడీబీ, .ఏసీసీడీబీ, .జావా, .డాక్స్‌ వంటి ఫైళ్లతో వస్తాయి. ఇలాంటి ఫైళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి’ అని సెర్ట్‌–ఇన్‌ హెచ్చరించింది.

రంగంలోకి సమాచార సాంకేతిక శాఖ
వనా క్రై వైరస్‌పై ప్రపంచమంతా అతలాకుతలం అవుతుండటంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ రంగంలోకి దిగింది. ఆర్బీఐ, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఐసీ, ఆధార్‌ (యూఐడీఏఐ) వంటి సంస్థలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దేశంలోని డిజిటల్‌ పేమెంట్ల చెల్లింపుల వ్యవస్థ భద్రంగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

‘ర్యాన్‌సమ్‌వేర్‌ విధ్వంసంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. దీని ఆటకట్టించేందుకు సంబంధిత ఏజెన్సీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. టెలికాం మంత్రిత్వ శాఖ, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, సీడీఏసీలతోనూ సంప్రదింపులు జరుపుతూ.. వైరస్‌ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలిస్తోంది.

మౌలికసంస్థలూ బహుపరాక్‌!
కీలకమైన మౌలికవసతుల సంస్థలైన బ్యాంకులు, విమానాశ్రయాలు, టెలికామ్‌ నెట్‌వర్క్‌లు, స్టాక్‌ మార్కెట్లు, రక్షణ, విద్యుత్‌ తదితర రంగాలు వనా క్రై విషయంలో జాగ్రత్తగా ఉండాలని సెర్ట్‌–ఇన్‌ హెచ్చరించింది. చరిత్రలోనే అతిపెద్ద సైబర్‌దాడిగా పేర్కొంటున్న ఈ వనా క్రై ఘటనలో అమెరికా, రష్యా సహా వందకుపైగా దేశాలు అతలాకుతలం అయిన విషయాన్ని గుర్తుచేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ వ్యవస్థ మినహా భారత్‌లో భారీ నష్టం జరిగినట్లుగా ఇంతవరకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది.

అయినా అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రజావినియోగ వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. చేయాల్సిన, చేయకూడని అంశాలను అన్ని ప్రభుత్వ శాఖలకు చేరవేసింది. ‘ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ అందించిన సాఫ్ట్‌వేర్‌ పాచ్‌ వినియోగిస్తున్న ఇంటర్నెట్‌ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిగిలిన వారు వెంటనే ఈ ప్యాచ్‌ కోసం అప్లై చేసుకోవాలి’ అని సెర్ట్‌ ఇన్‌ సూచించింది. కాగా, వనా క్రై వైరస్‌ ప్రభావం తమపైనా కనబడుతోందని మహారాష్ట్ర పొలీస్‌ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement