ఆయిల్‌ఫెడ్‌పై ‘ర్యాన్సమ్‌’ ఎటాక్‌ | Cyber Criminals Demands For Bitcoins in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ఫెడ్‌పై ‘ర్యాన్సమ్‌’ ఎటాక్‌

Published Sat, Feb 9 2019 10:44 AM | Last Updated on Sat, Feb 9 2019 10:44 AM

Cyber Criminals Demands For Bitcoins in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రెండేళ్ల క్రితం ప్రపంచ దేశాలను వణికించిన ర్యాన్సమ్‌ వేర్‌ ఎటాక్‌ రాజధానిలో మరోసారి వెలుగు చూసింది. ఆయిల్‌ ఫెడ్‌గా పిలిచే తెలంగాణ నూనె గింజల ఉత్పతిదారుల సహకార సమాఖ్య (తెలంగాణ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ ఆయిల్‌ సీడ్స్‌ గ్రోయర్స్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌) టార్గెట్‌గా చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు కంప్యూటర్లను స్తంభింపజేశారు. ఆన్‌లైన్‌ క్రిమినల్స్‌ డిమాండ్‌ చేసిన నాలుగు బిట్‌ కాయిన్లు (రూ.9,72,066) చెల్లించకపోతే సంస్థకు చెందిన డేటా క్రాష్‌ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. భవిష్యత్‌లో ర్యాన్సమ్‌వేర్‌కు గురికాకుండా ఉండాలంటే మరికొంత చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై శుక్రవారం ఫిర్యాదు అందుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయిల్‌ఫెడ్‌ సంస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి నెలా లావాదేవీలకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తూ ఉంటుంది. ఈ వ్యవహారాలన్నీ ఉండే సర్వర్‌ను ఓ ప్రైవేట్‌ సంస్థ నిర్వహిస్తోంది. నాలుగు రోజుల క్రితం యథావిధిగా ఈ సంస్థ సిబ్బంది తమ దైనందిన విధుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా ర్యాన్సమ్‌వేర్‌ ఎటాక్‌ జరిగింది.

ర్యాన్సమ్‌ వేర్‌ వైరస్‌లను సైబర్‌ నేరగాళ్లు ఈ–మెయిల్‌ రూపంలో పంపినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ర్యాన్సమ్‌వేర్‌ వైరస్‌ కంప్యూటర్లలోకి ప్రశించిన మరుక్షణం వాటిలో ఉన్న డేటా మొత్తం ఎన్‌క్రిప్ట్‌ అయిపోయి సిస్టమ్స్‌తో సర్వర్‌ సైతం లాక్‌ అయింది. ఆయిల్‌ఫెడ్‌లోని కంప్యూటర్లలోని డేటా ఎన్‌క్రిప్షన్‌ నాన్‌–సెమెట్రిక్‌ విధానంలో జరగడంతో ‘ప్రైవేట్‌ కీ’కు ట్రాక్‌ చేయడం ఐటీ సేవలు అందిస్తున్న ప్రైవేట్‌ సంస్థలోని ఎవరికీ సాధ్యం కాలేదు. సైబర్‌ నేరగాళ్లు ఈ సంస్థ ఎన్‌క్రిప్టెడ్‌ డేటాను డీక్రిప్ట్‌ చేయడానికి నాలుగు బిట్‌ కాయిన్లు డిమాండ్‌ చేశారు. భవిష్యత్‌లో ఇలా జరగకుండా రక్షణ కల్పించాలంటే మరికొంత ఇవ్వాలన్నారు. బిట్‌కాయిన్స్‌ కొనుగోలు, బదిలీ తదితరాలను గూగుల్‌ నుంచి తెలుసుకోవాలంటూ సందేశాన్నీ పంపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఎటాక్‌ ఎక్కడ నుంచి జరిగింది? సైబర్‌ నేరగాళ్ళు ఏ విధానంలో డబ్బు చెల్లించిమని చెప్పారు? తదితర అంశాలను సైబర్‌ కాప్స్‌ ఆరా తీస్తున్నారు. పటిష్టమైన వ్యవస్థ లేకుంటే ర్యాన్సమ్‌వేర్‌కు పరిష్కారం లేదని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. సాధారణ వినియోగదారులకు డేటా అంత ప్రాముఖ్యం కాకపోయినా... ఇలాంటి ప్రభుత్వరంగ సంస్థలు, సాఫ్ట్‌వేర్‌ రంగం, ఉన్నతోద్యోగులు, బీపీఓ ఉద్యోగులకు ఇది ఎంతో కీలకమైంది. నేరగాళ్లు ఏ రెండు కంప్యూటర్లకూ ఒకే రకమైన ప్రైవేట్‌ కీ ఏర్పాటు చేయడని వివరిస్తున్నారు. దీంతో బాధితులుగా మారిన ప్రతి ఒక్కరూ వారు అడిగినంత చెల్లించాల్సి రావడమో, డేటా కోల్పోవడమో జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.  ఈ తరహాలో నేరాలు చేసే వాళ్ళు బోగస్‌ సర్వీర్లు, ఐపీ అడ్రస్‌లు వినియోగిస్తుంటారు. దీంతో అలాంటి వారిని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. అపరిచిత ఐడీ నుంచి వచ్చే ఈ–మెయిల్స్, అనుమానాస్పద యాడ్స్‌కు దూరంగా ఉండటం, కంప్యూటర్‌లో పటిష్టమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవడమే దీనికి పరిష్కారంగా సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement