విమానాల్లో ల్యాప్‌టాప్‌లపై అమెరికా నిషేధం
వాషింగ్టన్: సైబర్ ప్రపంచాన్ని వణికిస్తున్న ర్యాన్సమ్‌వేర్ వాన్నా క్రై కారణంగా అమెరికాలోనూ ఆందోళన తీవ్రమైంది. ఈ నేపథ్యంలో యూరప్ నుంచి అమెరికాకు విమానంలో వచ్చే ప్రయాణికులు ల్యాప్‌టాప్‌లు తీసుకురావద్దని నిషేధం విధించారు. యూరప్ నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికుల వద్ద ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్ లాంటి గాడ్జెట్లు తెస్తున్నారా అనే కోణంలో విమానాశ్రయాల్లో తనిఖీలు చేయాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సూచించింది. గత మార్చిలో ఎనిమిది దేశాలకు చెందిన 10 ఎయిర్‌పోర్టుల నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద ల్యాప్‌టాప్స్ ఉండొద్దంటూ అమెరికా నిషేధించిన విషయం తెలిసిందే.
అవసరమైతే యూరోప్ ఎయిర్‌లైన్స్‌ను అమెరికాకు రాకుండా తాత్కాలికంగా నిషేధించాలని భావిస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి డేవిడ్ లాపన్ అన్నారు. యూరోపియన్ ఎయిర్‌లైన్స్‌తో పాటు పలు దేశాల ఎయిర్‌లైన్స్‌ను ఆమెరికాకు రాకుండా త్వరలో నిషేధించే దిశగా ఆమెరికా అడుగులు వేస్తుంది. యూరప్‌లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న ర్యాన్సమ్‌వేర్ వాన్నా క్రై భారిన అమెరికా పడకుండా ఉండాలంటే ఈ చర్యలు తప్పవన్నారు. బుధవారం డిప్యూటీ సెక్రటరీ ఈలైన్ డ్యూక్ యూరోప్ సంబంధిత అధికారులతో బ్రస్సెల్స్‌లో సమావేశం కానున్నారు.
సమ్మర్‌లో ఈయూ నుంచి ప్రతివారం 3250కి పైగా విమానాలు అమెరికాకు వస్తుంటాయని, ఆ సమయంలో సైబర్ వైరస్ భారినపడ్డ వారి డివైజ్‌లు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్ వంటి వాటివల్ల తమ దేశంలోనూ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని డేవిడ్ లాపన్ ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ దాడి వల్ల బ్యాటరీలు పేలిపోయే అవకాశం ఉందని, ఈ క్రమంలో ఉగ్రదాడులు జరగొచ్చునని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారని చెప్పారు.
అధ్యక్షుడు ట్రంప్ రష్యాకు అందించిన నిఘా రహస్యాలు మరేవో కాదని, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ల్యాప్‌టాప్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను సాధనాలుగా వాడుకుని సైబర్ దాడితో పాటు పక్కా ప్రణాళికలతో ఉగ్రదాడులకు పాల్పడే సూచనలు కనిపిస్తున్నాయని రష్యాతో చర్చించినట్లు పేర్కొన్నారు.