సైబర్‌ దాడి వెనక ఓ 14 ఏళ్ల బాలుడి హస్తం ? | Teen boy arrested on suspicion of creating ransomware virus | Sakshi
Sakshi News home page

సైబర్‌ దాడి వెనక ఓ 14 ఏళ్ల బాలుడి హస్తం ?

Published Mon, Jun 5 2017 5:59 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

సైబర్‌ దాడి వెనక ఓ 14 ఏళ్ల బాలుడి హస్తం ? - Sakshi

సైబర్‌ దాడి వెనక ఓ 14 ఏళ్ల బాలుడి హస్తం ?

యెకోహామా :
ప్రపంచాన్ని వణికించిన ర్యాన్సమ్‌వేర్‌ వైరస్‌ ప్రభావం అంతా ఇంతా కాదు. అయితే ఈ సైబర్‌ దాడి వెనక ఓ 14 ఏళ్ల బాలుడి హస్తం ఉన్నట్టు వస్తున్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ర్యాన్సమ్‌వేర్‌ వైరస్‌ కేసులో జపాన్‌ పోలీసులు తొలిసారిగా ఓ బాలుడిని అరెస్ట్‌ చేశారు.  వైరస్‌ ప్రొగ్రామ్‌లు రాసి వాటితో తయారు చేసిన సాఫ్టావేర్‌ను ఈమెయిల్‌ల రూపంలో పంపించేవాడని బాలుడు పోలీసులకు తెలిపాడు. తన పేరు అందరికి తెలియాలనే ఈ పని చేశానని ఆ బాలుడు చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు.

బాలుడు తన ఇంట్లో వినియోగించే కంప్యూటర్‌ నుంచి వైరస్‌ ప్రోగ్రామ్‌లు రాసినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. ర్యాన్సమ్‌వేర్‌ వైరస్‌ని నేనే తయారు చేశా.. దీన్ని మీరూ ఫ్రీగా వాడుకోవొచ్చు అంటూ సోషల్‌ మీడియాలో సదరు బాలుడు ఓ కామెంట్‌ కూడా పెట్టాడు. అంతేకాదు ఈ కామెంట్‌ను చూసి సదరు లింక్ ద్వారా వందకి పైగా వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌లు అయినట్టు పోలీసులు గుర్తించారు.

అయితే ఈ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేయడంతో ఎలాంటి నష్టం వాటిల్లే ప్రమాదం లేదు. కానీ, సదరు వైరస్‌ సాఫ్ట్‌ వేర్‌ సహాయంతో మరిన్ని ర్యాన్సమ్‌వేర్‌ వైరస్‌లని సులభంగా తయారు చేసే అవకాశం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా పంపే ఈ మెయిల్‌లను క్లిక్‌ చేస్తే.. మీ కంప్యూటర్‌లో వైరస్‌ అటాక్‌ అయింది. మీరు తిరిగి మీ కంప్యూటర్‌ వినియోగించాలనుకుంటే మాకు ఫైన్‌ కట్టాలి అని ఓ పాప్‌అప్‌ మెసేజ్ వస్తుంది. జువైనల్‌ యాక్ట్‌ అమలులో ఉండటంతో సదరు బాలుడి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ప్రొగ్రామర్‌(బాలుడు) తన ప్రతిభ చూపించడానికే ఈ ర్యాన్సమ్‌వేర్‌ వైరస్‌ను తయారు చేసినట్టు ఒప్పుకోవడం కొసమెరుపు. అయితే బాలుడు రూపొందించిన వైరస్‌ సాఫ్ట్‌ వేర్‌ ప్రభావం ఏమేరకు ఉందో తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న వన్నా క్రై :
ఇటీవలికాలంలో భారత్‌ సహా దాదాపు వంద దేశాల్లోని లక్షలాది కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే. వాటిల్లోని డేటా మొత్తాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి, దానిని తీయాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సైబర్‌ దాడుల మూలంగా బ్రిటన్‌లో చాలా ఆస్పత్రులు చికిత్స కోసం వచ్చిన రోగులను చేర్చుకోకుండా తిప్పిపంపాల్సి వచ్చింది. ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు ఆపరేషన్లు, చికిత్సలు నిలిచిపోయాయి. జర్మనీలో రైళ్ల రాకపోకలు తెలియకుండా పోయాయి. స్పెయిన్‌లో టెలికమ్యూనికేషన్లు, గ్యాస్‌ వ్యవస్థలకు అంతరాయం కలిగింది. రష్యాలో బ్యాంకులు ఉలిక్కిపడ్డాయి. ప్రభుత్వ కంప్యూటర్లు వెయ్యికి పైగా మూగబోయాయి. చైనాలో కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఇబ్బందులపాలయ్యాయి. ఉత్తరకొరియాలోని ఆస్పత్రులూ ఇక్కట్లపాలయ్యాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో 18 పోలీస్‌స్టేషన్లలో కంప్యూటర్లు స్తంభించిపోయాయి. వనా క్రై దాడిని తిప్పికొట్టేందుకు ప్రపంచ దేశాల్లో సైబర్‌ భద్రతా నిపుణులు రేయింబవళ్లూ శ్రమిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement