అమెరికా-రష్యాలు విరోధులుగా ఎందుకు మారాయి | From Syria airstrikes to cyber attacks, a quick glance at US-Russia rivalry | Sakshi
Sakshi News home page

అమెరికా-రష్యాలు విరోధులుగా ఎందుకు మారాయి

Published Sat, Oct 8 2016 6:19 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ప్రచ్ఛన్న యుద్ధ ప్రత్యర్ధులు యూఎస్, రష్యాల మధ్య గత కొద్ది రోజులుగా పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

ప్రచ్ఛన్న యుద్ధ ప్రత్యర్ధులు యూఎస్, రష్యాల మధ్య గత కొద్ది రోజులుగా పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సిరియా ఎయిర్ స్ట్రైక్స్, యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన వెబ్ సైట్ ను రష్యాకు చెందిన వారు హ్యాక్ చేసేందుకు ప్రయత్నించడం లాంటి సంఘటనలు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దారుణంగా దెబ్బతీశాయి.

అశాంతి నెలకొన్న సిరియాలో శాంతిని పునరుద్ధరించాలని ఇరుదేశాలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.  రష్యా రాయబారితో సమావేశమైన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ సిరియా అధ్యక్షుడు అస్సాద్ తో కలిసి సమస్యను పరిష్కరించగల శక్తి రష్యాకు ఉందని అన్నారు. బాంబు దాడులను నిలిపివేయాలని ఇరుదేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది రోజులకే వైమానిక దాడుల్లో 23 మంది మృతి చెందారు. దీంతో ఒప్పందాన్ని మీరు ఉల్లంఘించారంటే మీరని ఇరుదేశాలు ఒకదాన్ని ఒకటి నిందించుకున్నాయి. అయితే, ఈ దాడులను ఎవరు నిర్వహించారనే విషయం మాత్రం తెలియలేదు.

ఐసిస్ ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న అల్-మయాదిన్ పట్టణంపై ఈ దాడులు జరిగినా ఇరుదేశాలు దీన్ని తీవ్రంగా పరిగణించాయి. ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై దాడులు చేయొచ్చని యూఎస్-రష్యాలు చేసుకున్న ఒప్పందంలో ఉంది. ఐసిస్ చేతిలోనే ఉన్న మరో సిరియా పట్టణం అలెప్పోలో కూడా వైమానిక దాడులు జరగడంతో యూఎస్ రష్యాతో చర్చలను నిలిపివేసింది.

కేవలం ఈ విషయంలోనే కాకుండా హ్యాకింగ్ ద్వారా కూడా అమెరికా-రష్యా దేశాలు ఒకరి సమాచారాలను మరొకరు కొల్లగొట్టుకున్నారు.  ప్రభుత్వ ఈ-మెయిల్ సర్వర్లను రష్యా హ్యాక్ చేస్తోందని అమెరికా అధికారికంగా ఆరోపించింది. తమ ఈ-మెయిల్ సర్వర్లను హ్యాక్ చేయగలిగే సామర్ధ్యం కేవలం రష్యా సీనియర్ హ్యాకర్లకే సాధ్యమని ఓ అమెరికన్ ప్రభుత్వ అధికారి వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకే రష్యా ఇలా చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య జాతీయ కమిటీ(డీఎన్సీ) అమెరికాకు చెందిన ఈ-మెయిళ్లలోని సమాచారన్ని బయటపెట్టింది.

దీంతో అగ్రరాజ్యం రష్యా యుద్ధం పేరుతో నేరాలకు పాల్పడుతోందని ఆరోపించింది. రష్యాలో ఆసుపత్రులు ఎల్లప్పుడూ మహిళలు, చిన్నపిల్లలతో కిటకిటలాడుతుంటాయని పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రష్యా.. ఒప్పందాన్ని నిలబెట్టుకోలేకపోయిన అమెరికా ప్రత్యక్ష్య దూషణలకు దిగుతోందని విమర్శించింది. రష్యా పత్రికల్లో ఒకటి ఈ సంఘటనలను ఇరుదేశాల మధ్య మరో ప్రచ్ఛన్న యుద్ధంగా పేర్కొంది.

సిరియాలో దాడుల ఒప్పందం ఉల్లంఘనే అమెరికా-రష్యాల మధ్య వ్యతిరేకత రావడానికి ప్రధానకారణంగా తెలుస్తోంది. సిరియాతో రష్యాకు చక్కటి సంబంధాలు ఉన్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు మద్దతుగా నిలుస్తున్న రష్యా ఈ ఏడాది సెప్టెంబర్ లో ఐసిస్ ఆక్రమిత ప్రాంతాల్లో వైమానిక దాడులు నిర్వహించింది. రష్యా తరఫున నిలుస్తున్న అసద్ ను అమెరికా వ్యతిరేకిస్తోంది. 2014 సెప్టెంబర్ నుంచి ఐసిస్ ఆక్రమిత ప్రాంతాల్లో అమెరికా వైమానిక దాడులు నిర్వహిస్తూ వస్తోంది. సిరియన్ పౌరులను అసద్ వేధిస్తున్నారని అమెరికా వ్యాఖ్యానించింది కూడా. కాగా, వైమానిక దాడుల్లో సాధారణ పౌరులు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటుండటంతో దాడులు నిలిపివేయడానికి అమెరికా-రష్యాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement