భారత ప్రామాణిక సమయం (ఇండియన్ స్టాండర్డ్ టైమ్–ఐఎస్‌టీ)కి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైంది. అత్యాధునిక సాంకేతికత విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రత్యర్థుల సైబర్ దాడుల నుంచి దేశాన్ని కాపాడుకోవడంతో పాటు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశీయంగా అధికారయుతమైన ప్రామాణిక సమయాన్ని ఖరారు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకసారి ఇది చట్టబద్ధమైతే మనదైన సొంత సమయాన్ని దేశవ్యాప్తంగా అన్నిరకాల సర్వీస్ ప్రొవైడర్లు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. దేశానికి అధికారిక ‘టైమ్‌కీపర్’గా వ్యవహరిస్తున్న నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (ఎన్‌పీఎల్) నుంచే మొబైల్, ఇతర సర్వీస్ ప్రొవైడర్లంతా నిర్ధారిత సమయాన్ని తీసుకోవాలి.
మొబైల్ టైమ్‌లన్నీ అమెరికావే..
ప్రస్తుతం భారత్‌లోని కోట్లాది సెల్‌ఫోన్ వినియోగదారులు తమ ఫోన్లలో అమెరికాకు చెందిన నెట్‌వర్క్ టైం ప్రోటోకాల్ ఇస్తున్న టైమ్‌ను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఫోన్లతో పాటు, ఐఫోన్లు అమెరికాలోని నెట్‌వర్క్ టైమ్ ప్రోటోకాల్ సర్వర్ల నుంచే ఈ సమయాన్ని తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మనవాళ్లు అత్యధికశాతం, మైక్రోసాఫ్ట్, ఐఫోన్ సాఫ్ట్‌వేర్‌లనే వాడుతుండడంతో ఈ ఫోన్లలో ఈ సమయాన్నే ఉపయోగిస్తున్నారు. ‘ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారన్న దాని ప్రాతిపదికన ఒక సెకన్ నుంచి కొన్ని సెకన్ల వరకు ఈ సమయాల్లో తేడాలుంటాయి.
అమెరికాకు చెందిన సర్వర్ల నుంచి, ఆ దేశ సొంత టెక్నాలజీతో రూపొందించిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్( జీపీఎస్) నుంచే ఎక్కువ మటుకు ఈ టైమ్‌ను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది’ అని ఎన్‌పీఎల్ డైరెక్టర్ దినేశ్ కె ఆస్వల్ తెలిపారు. తాము ఒక దేశం, ఒక సమయం అనే నినాదంతో ముందుకెళుతున్నందున, ఐఎస్‌టీ అనే ఒకే ప్రామాణిక, ఆధారిత సమయం ఉండాలన్నారు. మున్ముందు దేశ రక్షణ, భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఏటీఎం, ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో కొన్ని సెకన్లు కూడా కీలకంగా మారతాయని ఎన్‌పీఎల్ సైంటిస్ట్ అశిష్ అగర్వాల్ వెల్లడించారు.
ఐఎస్‌టీని గుర్తించని లీగల్ మెట్రోలజీ..!
భారత లీగల్ మెట్రోలజీ యాక్ట్, 2009 దేశ ప్రామాణిక సమయంగా ఐఎస్‌టీని గుర్తించడం లేదు. ఈ చట్టానికి అనుగుణంగానే మనదేశంలో ప్రామాణిక బరువులు, కొలతలు అమలవుతున్నాయి. వీటి అధారంగానే వాణిజ్య, వ్యాపారాలు క్రమబద్దీకరిస్తున్నారు. చట్టబద్ధంగా ఒకే సమయాన్ని పాటించే ‘ ఏక విధానం’ ఆవశ్యకతను భారతీయ రైల్వే తత్కాల్ టికెటింగ్ వ్యవస్థ ఎత్తి చూపుతోంది. ఐఎస్‌టీ సమయాన్ని రైల్వేశాఖ అనుసరిస్తుంటే, ఓ వినియోగదారుడు తన ఫోన్‌లో మరో నెట్‌వర్క్ సమయాన్ని ఉపయోగిస్తున్న పక్షంలో రెండింటి మధ్య టైమ్‌లో వ్యత్యాసాల కారణంగా అతడు లాగిన్ అయ్యేప్పటికి టికెట్లన్నీ అమ్ముడైపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ప్రస్తుతం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐస్రో), భారత వాయుసేన, విమానాశ్రయాలు, వివిధ బ్యాంకులు ఎన్‌పీఎల్ రూపొందించిన ఐఎస్‌టీనే ఉపయోగిస్తున్నాయి. అయితే లీగల్ మెట్రోలజీ చట్టాన్ని సవరించి అందులో ఐఎస్‌టీని చేర్చడానికి ముందే ఆ ప్రామాణిక సమయాన్ని పాటించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
టైమ్ తీరుతెన్నులు ఇలా !
- ఢిల్లీలోని ఎన్‌పీఎల్ వద్ద కచ్చితమైన సమయ నిర్ధారణకు అయిదు క్లాక్ జనరేషన్ మాడ్యూల్ (సీజియమ్) గడియారాలు, ఓ హైడ్రోజన్ మాస్టర్‌క్లాక్ ఉన్నాయి.
- సంప్రదాయ గడియారాలు క్వాడ్జ్ క్రిస్టల్ కంపనాలపై పనిచేస్తుండగా, అందుకు భిన్నంగా ఆటమిక్ గడియారం సీజియం అణు శక్తిని ఉపయోగిస్తుంది.
- ప్రపంచవ్యాప్తంగా 400కుపైగా సీజియమ్ గడియారాలున్నాయి. అందులో ఐదు భారత్‌లో ఉన్నాయి.
- ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ సంస్థ వివిధదేశాల్లోని ఈ గడియారాలను సమన్వయం చేసి, ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సెకన్ ఒకే విధంగా మొదలయ్యేలా చూస్తుంది.
-సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment