Ist
-
మనకూ ‘టైమ్’ వచ్చింది..!
భారత ప్రామాణిక సమయం (ఇండియన్ స్టాండర్డ్ టైమ్–ఐఎస్టీ)కి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైంది. అత్యాధునిక సాంకేతికత విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రత్యర్థుల సైబర్ దాడుల నుంచి దేశాన్ని కాపాడుకోవడంతో పాటు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశీయంగా అధికారయుతమైన ప్రామాణిక సమయాన్ని ఖరారు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకసారి ఇది చట్టబద్ధమైతే మనదైన సొంత సమయాన్ని దేశవ్యాప్తంగా అన్నిరకాల సర్వీస్ ప్రొవైడర్లు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. దేశానికి అధికారిక ‘టైమ్‌కీపర్’గా వ్యవహరిస్తున్న నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (ఎన్పీఎల్) నుంచే మొబైల్, ఇతర సర్వీస్ ప్రొవైడర్లంతా నిర్ధారిత సమయాన్ని తీసుకోవాలి. మొబైల్ టైమ్లన్నీ అమెరికావే.. ప్రస్తుతం భారత్‌లోని కోట్లాది సెల్‌ఫోన్ వినియోగదారులు తమ ఫోన్లలో అమెరికాకు చెందిన నెట్వర్క్ టైం ప్రోటోకాల్ ఇస్తున్న టైమ్‌ను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఫోన్లతో పాటు, ఐఫోన్లు అమెరికాలోని నెట్వర్క్ టైమ్ ప్రోటోకాల్ సర్వర్ల నుంచే ఈ సమయాన్ని తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మనవాళ్లు అత్యధికశాతం, మైక్రోసాఫ్ట్, ఐఫోన్ సాఫ్ట్వేర్లనే వాడుతుండడంతో ఈ ఫోన్లలో ఈ సమయాన్నే ఉపయోగిస్తున్నారు. ‘ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారన్న దాని ప్రాతిపదికన ఒక సెకన్ నుంచి కొన్ని సెకన్ల వరకు ఈ సమయాల్లో తేడాలుంటాయి. అమెరికాకు చెందిన సర్వర్ల నుంచి, ఆ దేశ సొంత టెక్నాలజీతో రూపొందించిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్( జీపీఎస్) నుంచే ఎక్కువ మటుకు ఈ టైమ్‌ను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది’ అని ఎన్పీఎల్ డైరెక్టర్ దినేశ్ కె ఆస్వల్ తెలిపారు. తాము ఒక దేశం, ఒక సమయం అనే నినాదంతో ముందుకెళుతున్నందున, ఐఎస్టీ అనే ఒకే ప్రామాణిక, ఆధారిత సమయం ఉండాలన్నారు. మున్ముందు దేశ రక్షణ, భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఏటీఎం, ఆన్లైన్ లావాదేవీల విషయంలో కొన్ని సెకన్లు కూడా కీలకంగా మారతాయని ఎన్పీఎల్ సైంటిస్ట్ అశిష్ అగర్వాల్ వెల్లడించారు. ఐఎస్టీని గుర్తించని లీగల్ మెట్రోలజీ..! భారత లీగల్ మెట్రోలజీ యాక్ట్, 2009 దేశ ప్రామాణిక సమయంగా ఐఎస్టీని గుర్తించడం లేదు. ఈ చట్టానికి అనుగుణంగానే మనదేశంలో ప్రామాణిక బరువులు, కొలతలు అమలవుతున్నాయి. వీటి అధారంగానే వాణిజ్య, వ్యాపారాలు క్రమబద్దీకరిస్తున్నారు. చట్టబద్ధంగా ఒకే సమయాన్ని పాటించే ‘ ఏక విధానం’ ఆవశ్యకతను భారతీయ రైల్వే తత్కాల్ టికెటింగ్ వ్యవస్థ ఎత్తి చూపుతోంది. ఐఎస్టీ సమయాన్ని రైల్వేశాఖ అనుసరిస్తుంటే, ఓ వినియోగదారుడు తన ఫోన్లో మరో నెట్వర్క్ సమయాన్ని ఉపయోగిస్తున్న పక్షంలో రెండింటి మధ్య టైమ్‌లో వ్యత్యాసాల కారణంగా అతడు లాగిన్ అయ్యేప్పటికి టికెట్లన్నీ అమ్ముడైపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ప్రస్తుతం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐస్రో), భారత వాయుసేన, విమానాశ్రయాలు, వివిధ బ్యాంకులు ఎన్పీఎల్ రూపొందించిన ఐఎస్టీనే ఉపయోగిస్తున్నాయి. అయితే లీగల్ మెట్రోలజీ చట్టాన్ని సవరించి అందులో ఐఎస్టీని చేర్చడానికి ముందే ఆ ప్రామాణిక సమయాన్ని పాటించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. టైమ్ తీరుతెన్నులు ఇలా ! ఢిల్లీలోని ఎన్పీఎల్ వద్ద కచ్చితమైన సమయ నిర్ధారణకు అయిదు క్లాక్ జనరేషన్ మాడ్యూల్ (సీజియమ్) గడియారాలు, ఓ హైడ్రోజన్ మాస్టర్క్లాక్ ఉన్నాయి. సంప్రదాయ గడియారాలు క్వాడ్జ్ క్రిస్టల్ కంపనాలపై పనిచేస్తుండగా, అందుకు భిన్నంగా ఆటమిక్ గడియారం సీజియం అణు శక్తిని ఉపయోగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 400కుపైగా సీజియమ్ గడియారాలున్నాయి. అందులో ఐదు భారత్‌లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ సంస్థ వివిధదేశాల్లోని ఈ గడియారాలను సమన్వయం చేసి, ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సెకన్ ఒకే విధంగా మొదలయ్యేలా చూస్తుంది. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నర్సరీ అడ్మిషన్లపై ఏడున తీర్పు
నర్సరీ అడ్మిషన్లపై ఐదు నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి ఈ నెల ఏడో తేదీన తెరపడనుంది. ఇందుకు సంబంధించి ఆరోజున సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. అంతర్రాష్ట్ర బదిలీ కేటగిరీ (ఐఎస్టీ)లో ఉన్న విద్యార్థులకు నర్సరీలో ప్రవేశం కల్పిస్తామని సూచనప్రాయంగా తెలియజేసింది. దీనిపై సాధారణ ఉత్తర్వు జారీ చేయలేమని, తమ 24 మంది పిల్లల ప్రవేశాల కోసం దరఖాస్తు చేసిన 22 మంది తల్లిదండ్రులకు ఊరట కల్పిస్తామని పేర్కొంది. ఇరుగుపొరుగుతోపాటు ఇతర కేటగిరీల్లో దరఖాస్తు చేసుకుని, లాటరీ విధానంలో ఎంపికైన వారికి ప్రవేశాలు కల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు ఇచ్చిన తర్వాత ఏప్రిల్ 11వ తేదీన నర్సరీ అడ్మిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి నిలిపివేసిన సంగతి విదితమే. నర్సరీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే నిబంధలను మార్చాలని నిర్ణయించడమేమిటంటూ సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అంతరాష్ట్ర బదిలీ కేటగిరీలో సీట్ల సంఖ్యను ఐదు నుంచి ఆరుకు పెంచాలని సూచించింది. ఇతర రాష్ట్రాల నుంచి బదిలీపై నగరానికి వచ్చి స్థిరపడిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు దాఖలుచేసిన పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది. -
ఊరట పొందుతున్న వాహన కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రూపాయి బలపడుతోంది. మరి ఎవరికి లాభం. ఎవరికి నష్టం. దిగుమతులపై ఆధారపడ్డ వాహన కంపెనీలు మాత్రం ఆనందంగా ఉన్నాయి. డాలరు మారకంతో పోలిస్తే గత ఎనిమిది నెలల్లో తొలిసారిగా డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.60కి దిగువకు వచ్చి చేరింది. 2013 జూలై చివరి వారం నుంచి ఆగస్టు చివరి వారంలో రూపాయి విలువ ఏకంగా 12.5 శాతం పడి రూ.68.36కు చేరింది. భారత చరిత్రలో కొత్త రికార్డులను నమోదు చేసింది. ప్రస్తుతం రూ.59.91 వద్ద ఉంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న వాహన పరిశ్రమ తాజా పరిణామాలను కొంతలో కొంత ఉపశమనంగా అభివర్ణిస్తోంది. వాహన కంపెనీలు చాలావరకూ విడిభాగాలను, ఇంజన్లను దిగుమతి చేసుకుంటాయి. మరికొన్ని మొత్తం వాహన కిట్స్‌ను దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేస్తుంటాయి. కష్ట కాలంలో పరిశ్రమ.. గత కొంత కాలంగా భారత వాహన పరిశ్రమలో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లే వు. దేశీయంగా సెంటిమెంటు బలహీనంగా ఉండడం, వడ్డీ రేట్లు అధికంగా ఉండడం ఈ పరిస్థితికి కారణమైంది. కొన్ని వాహన విభాగాల్లో వృద్ధి స్తబ్దుగా ఉంది. మరి కొన్ని విభాగాల్లో తిరోగమన వృద్ధి నమోదవుతోంది. ఈ పరిస్థితుల్లో కంపెనీలు నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. 2012-13 ఏప్రిల్-ఫిబ్రవరితో పోలిస్తే 2013-14 ఏప్రిల్-ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 5.91 శాతం, వాణిజ్య వాహనాలు 19.71 శాతం, త్రిచక్ర వాహనాలు 11.33 శాతం తగ్గాయి. ద్విచక్ర వాహనాలు మాత్రం 6.11 శాతం వృద్ధిని నమోదు చేయడం కొసమెరుపు. దిగుమతులపై స్వల్పంగా ఆధారపడ్డ కంపెనీలు ఒకింత ఫర్వాలేదనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలకు రెక్కలు రావడం, తయారీ వ్యయం పెరగడం, డాలరు బలపడడం తదితర కారణాలతో దిగుమతుల వ్యయం అదే స్థాయిలో దూసుకెళ్లింది. దిగుమతులపై పెద్ద ఎత్తున ఆధారపడ్డ కంపెనీలకు ఈ పరిణామం తలకు మించిన భారంగా పరిణమించింది. రూపాయి బలపడుతుండడంతో ఈ కంపెనీల ఆశలు చిగురిస్తున్నాయి. కొంత వెసులుబాటు.. ప్రస్తుతం రూపాయి బలపడుతున్నా పరిశ్రమ ఆశిస్తున్న స్థాయిలో లేదు. స్వల్ప వ్యవధి మార్పులు వాహన కంపెనీలకు ప్రయోజనం కలిగించవని వోల్వో ఆటో ఇండియా మార్కెటింగ్ డెరైక్టర్ సుదీప్ నారాయణ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రూపాయి మరింత బలపడుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలకు కొంత వెసులుబాటు వాస్తవమేనని అన్నారు. రూపాయి బలపడడం శుభపరిణామమని మహీంద్రా నవీస్టార్ ఎండీ నలిన్ మెహతా అభిప్రాయపడ్డారు. తయారీ వ్యయం కొంత తగ్గించుకుంటున్నామని డీఎస్కే మోటోవీల్స్ డెరైక్టర్ శిరీష్ కులకర్ణి వెల్లడించారు. దిగుమతులపై పెద్ద ఎత్తున ఆధారపడ్డ కంపెనీలేవీ ప్రస్తుతం లాభాలు ఆర్జించడం లేదని అన్నారు. విడిభాగాలు, వాహనాల దిగుమతుల విషయంలో సరఫరా చేసే కంపెనీకి చెల్లింపులన్నీ డాలర్లలో ఉంటాయి. రూపాయి బలపడడం వల్ల ఒక్కో డాలరు కోసం కంపెనీలు చేసే వ్యయం తగ్గుతుంది. గతేడాది ఆగస్టులో ఒక డాలరు కోసం రూ.68.36 చెల్లిస్తే, నేడు రూ.59.91 చెల్లించాలన్నమాట. మరింత బలపడితేనే ధరల తగ్గింపు... రూపాయి పెరిగినప్పుడు వాహన ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచలేదని సుదీప్ నారాయణ్ అన్నారు. ఇప్పుడు రూపాయి బలపడ్డంత మాత్రాన ధరలను వెంటనే తగ్గించలేమని స్పష్టం చేశారు. రూపాయి కదలికలను ఆధారంగా మూడు నెలల సరాసరి తీసుకుని ధరలను నిర్ణయిస్తాం. ప్రస్తుతం ఇంకా అంతర్గత వ్యయాలు అధికంగానే ఉన్నాయి. పన్నులూ అదే స్థాయిలో ఉన్నాయి. రూపాయి మరింత బలపడితేనే వాహన ధరలు దిగొస్తాయని అన్నారు. ఎన్నికలయ్యాక రూపాయి ఇంకాస్త బలపడుతుందన్న అంచనాలు ఉన్నాయని శిరీష్ కులకర్ణి పేర్కొన్నారు. అప్పటి రూపాయి తీరు ఆధారంగానే వాహన ధరలు నిర్ణయమవుతాయని తెలిపారు. హ్యోసంగ్ బైక్‌లను తయారు చేస్తున్న కొరియా కంపెనీ ఎస్అండ్టీకి భారత భాగస్వామిగా డీఎస్కే వ్యవహరిస్తోంది. -
ఎస్బీఐ 1,456 కోట్ల ముందస్తు పన్ను
ముంబై: మార్చి క్వార్టర్‌కు దేశ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.1,456 కోట్ల ముందస్తు పన్ను చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో బ్యాంక్ చెల్లింపులు రూ.1,450 కోట్లతో పోల్చితే ఇది తక్కువ. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించి బ్యాంక్ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. స్థూలంగా చూస్తే- బ్యాంకులు, సిమెంట్ కంపెనీలు అడ్వాన్స్ పన్ను చెల్లింపు అంశంలో వెనుకడుగు వేయగా, ఐటీ సంస్థలు మాత్రం ముందున్నాయి. ఈ అంశాలు ఆర్థిక మందగమన స్థితికి అద్దం పడుతున్నాయని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరికొన్ని సంస్థల తీరు... ఎస్బీఐ సహా ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 14 సంస్థల ముందస్తు పన్ను చెల్లింపులు 13.6 శాతం పెరిగాయి. కొన్ని ముఖ్య సంస్థలను చూస్తే- భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఏటీ చెల్లింపు రూ.230 కోట్ల నుంచి రూ.705 కోట్లకు చేరింది. బ్యాంక్ ఆఫ్ బరోడా విషయంలో ఈ మొత్తం రూ. 350 కోట్ల నుంచి రూ.360 కోట్లకు పెరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీ చెల్లింపులు రూ.790 కోట్ల నుంచి రూ.500 కోట్లకు తగ్గాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చెల్లింపులు రూ.600 కోట్ల నుంచి రూ.1,130 కోట్లకు ఎగిశాయి. ఏసీసీ లిమిటెడ్ ఏటీ చెల్లింపులు గణనీయంగా రూ.220 కోట్ల నుంచి రూ. 110 కోట్లకు పడిపోయాయి. అంబుజా సిమెంట్ విషయంలోనూ ఇదే రీతిలో చెల్లింపులు రూ. 280 కోట్ల నుంచి రూ. 170 కోట్లకు తగ్గాయి. యస్‌బ్యాంక్ రూ.200 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించింది. గత ఏడాది ఇదే కాలం తో పోల్చితే ఇది 20% (రూ.167 కోట్లు) అధికం. నేడు చివరి తేదీ...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముందస్తు పన్ను చెల్లింపులకు మార్చి 18 చివరి తేదీ. దేశంలోని మొత్తం పన్ను వసూళ్లలో ముంబై వాటా 33 శాతం. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ముంబై సర్కిల్లో ఆదాయపు పన్ను శాఖ మొత్తం పన్ను లక్ష్యం రూ.2.04 లక్షల కోట్లు. మార్చి 17 నాటికి ఈ వసూళ్లు రూ.1.63 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ వసూళ్ల మొత్తం రూ.1.56 లక్షల కోట్లు. -
ఓఎన్జీసీ లాభం 28 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ఆయిల్ రంగ దిగ్గజం ఓఎన్జీసీ ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంలో రూ. 7,126 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 5,563 కోట్లతో పోలిస్తే ఇది 28% వృద్ధి. డాలరుతో మారకంలో రూపాయి విలువ క్షీణించడం వల్ల లాభదాయకత మెరుగుపడిందని, దీంతో సబ్సిడీ చెల్లింపులు భారీగా పెరిగినప్పటికీ లాభాల్లో వృద్ధి సాధ్యపడిందని కంపెనీ చైర్మన్ సుధీర్ వాసుదేవ చెప్పారు. ఈ కాలంలో కంపెనీ సబ్సిడీలకింద రూ. 13,764 కోట్లను చెల్లించింది. గతంలో చెల్లించిన రూ. 12,433 కోట్లతో పోలిస్తే ఇవి దాదాపు 11% అధికం. డీజిల్, వంటగ్యాస్‌లను ఉత్పత్తి వ్యయాలకంటే దిగువన విక్రయించే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కొంతమేర సబ్సిడీలను ఓఎన్జీసీ చెల్లించే సంగతి తెలిసిందే. ఇక ముడిచమురును స్థూలంగా బ్యారల్‌కు 108.18 డాలర్లకు విక్రయించినప్పటికీ, నికరంగా 45.98 డాలర్లు లభించినట్లు కంపెనీ తెలిపింది. అంతక్రితం ఇదే కాలంలో బ్యారల్ చమురు విక్రయ ధర స్థూలంగా 110.13 డాలర్లు, నికరంగా 47.94 డాలర్లు చొప్పున నమోదైంది. ఈ కాలంలో చమురు ఉత్పత్తి యథాతథంగా 6.1 మిలియన్ టన్నులుగా నమోదుకాగా, సహజవాయువు ఉత్పత్తి దాదాపు 1% తగ్గి 6.285 మిలియన్ ఘనపు మీటర్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు ధర 3% క్షీణించి రూ. 273 వద్ద ముగిసింది.