ఓఎన్‌జీసీ లాభం 28 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ఆయిల్ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంలో రూ. 7,126 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 5,563 కోట్లతో పోలిస్తే ఇది 28% వృద్ధి. డాలరుతో మారకంలో రూపాయి విలువ క్షీణించడం వల్ల లాభదాయకత మెరుగుపడిందని, దీంతో సబ్సిడీ చెల్లింపులు భారీగా పెరిగినప్పటికీ లాభాల్లో వృద్ధి సాధ్యపడిందని కంపెనీ చైర్మన్ సుధీర్ వాసుదేవ చెప్పారు. ఈ కాలంలో కంపెనీ సబ్సిడీలకింద రూ. 13,764 కోట్లను చెల్లించింది.
గతంలో చెల్లించిన రూ. 12,433 కోట్లతో పోలిస్తే ఇవి దాదాపు 11% అధికం. డీజిల్, వంటగ్యాస్‌లను ఉత్పత్తి వ్యయాలకంటే దిగువన విక్రయించే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కొంతమేర సబ్సిడీలను ఓఎన్‌జీసీ చెల్లించే సంగతి తెలిసిందే. ఇక ముడిచమురును స్థూలంగా బ్యారల్‌కు 108.18 డాలర్లకు విక్రయించినప్పటికీ, నికరంగా 45.98 డాలర్లు లభించినట్లు కంపెనీ తెలిపింది.
అంతక్రితం ఇదే కాలంలో బ్యారల్ చమురు విక్రయ ధర స్థూలంగా 110.13 డాలర్లు, నికరంగా 47.94 డాలర్లు చొప్పున నమోదైంది. ఈ కాలంలో చమురు ఉత్పత్తి యథాతథంగా 6.1 మిలియన్ టన్నులుగా నమోదుకాగా, సహజవాయువు ఉత్పత్తి దాదాపు 1% తగ్గి 6.285 మిలియన్ ఘనపు మీటర్లకు పరిమితమైంది.
ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు ధర 3% క్షీణించి రూ. 273 వద్ద ముగిసింది.