ఎస్‌బీఐ 1,456 కోట్ల ముందస్తు పన్ను
ముంబై: మార్చి క్వార్టర్‌కు దేశ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రూ.1,456 కోట్ల ముందస్తు పన్ను చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో బ్యాంక్ చెల్లింపులు రూ.1,450 కోట్లతో పోల్చితే ఇది తక్కువ. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించి బ్యాంక్ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. స్థూలంగా చూస్తే- బ్యాంకులు, సిమెంట్ కంపెనీలు అడ్వాన్స్ పన్ను చెల్లింపు అంశంలో వెనుకడుగు వేయగా, ఐటీ సంస్థలు మాత్రం ముందున్నాయి. ఈ అంశాలు ఆర్థిక మందగమన స్థితికి అద్దం పడుతున్నాయని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మరికొన్ని సంస్థల తీరు...
ఎస్‌బీఐ సహా ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 14 సంస్థల ముందస్తు పన్ను చెల్లింపులు 13.6 శాతం పెరిగాయి. కొన్ని ముఖ్య సంస్థలను చూస్తే- భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఏటీ చెల్లింపు రూ.230 కోట్ల నుంచి రూ.705 కోట్లకు చేరింది. బ్యాంక్ ఆఫ్ బరోడా విషయంలో ఈ మొత్తం రూ. 350 కోట్ల నుంచి రూ.360 కోట్లకు పెరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీ చెల్లింపులు రూ.790 కోట్ల నుంచి రూ.500 కోట్లకు తగ్గాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చెల్లింపులు రూ.600 కోట్ల నుంచి రూ.1,130 కోట్లకు ఎగిశాయి. ఏసీసీ లిమిటెడ్ ఏటీ చెల్లింపులు గణనీయంగా రూ.220 కోట్ల నుంచి రూ. 110 కోట్లకు పడిపోయాయి. అంబుజా సిమెంట్ విషయంలోనూ ఇదే రీతిలో చెల్లింపులు రూ. 280 కోట్ల నుంచి రూ. 170 కోట్లకు తగ్గాయి. యస్‌బ్యాంక్ రూ.200 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించింది. గత ఏడాది ఇదే కాలం తో పోల్చితే ఇది 20% (రూ.167 కోట్లు) అధికం.
నేడు చివరి తేదీ...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముందస్తు పన్ను చెల్లింపులకు మార్చి 18 చివరి తేదీ. దేశంలోని మొత్తం పన్ను వసూళ్లలో ముంబై వాటా 33 శాతం. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ముంబై సర్కిల్‌లో ఆదాయపు పన్ను శాఖ మొత్తం పన్ను లక్ష్యం రూ.2.04 లక్షల కోట్లు. మార్చి 17 నాటికి ఈ వసూళ్లు రూ.1.63 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ వసూళ్ల మొత్తం రూ.1.56 లక్షల కోట్లు.