ఊరట పొందుతున్న వాహన కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రూపాయి బలపడుతోంది. మరి ఎవరికి లాభం. ఎవరికి నష్టం. దిగుమతులపై ఆధారపడ్డ వాహన కంపెనీలు మాత్రం ఆనందంగా ఉన్నాయి. డాలరు మారకంతో పోలిస్తే గత ఎనిమిది నెలల్లో తొలిసారిగా డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.60కి దిగువకు వచ్చి చేరింది. 2013 జూలై చివరి వారం నుంచి ఆగస్టు చివరి వారంలో రూపాయి విలువ ఏకంగా 12.5 శాతం పడి రూ.68.36కు చేరింది. భారత చరిత్రలో కొత్త రికార్డులను నమోదు చేసింది. ప్రస్తుతం రూ.59.91 వద్ద ఉంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న వాహన పరిశ్రమ తాజా పరిణామాలను కొంతలో కొంత ఉపశమనంగా అభివర్ణిస్తోంది. వాహన కంపెనీలు చాలావరకూ విడిభాగాలను, ఇంజన్లను దిగుమతి చేసుకుంటాయి. మరికొన్ని మొత్తం వాహన కిట్స్‌ను దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేస్తుంటాయి.
కష్ట కాలంలో పరిశ్రమ..
గత కొంత కాలంగా భారత వాహన పరిశ్రమలో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లే వు. దేశీయంగా సెంటిమెంటు బలహీనంగా ఉండడం, వడ్డీ రేట్లు అధికంగా ఉండడం ఈ పరిస్థితికి కారణమైంది. కొన్ని వాహన విభాగాల్లో వృద్ధి స్తబ్దుగా ఉంది. మరి కొన్ని విభాగాల్లో తిరోగమన వృద్ధి నమోదవుతోంది. ఈ పరిస్థితుల్లో కంపెనీలు నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. 2012-13 ఏప్రిల్-ఫిబ్రవరితో పోలిస్తే 2013-14 ఏప్రిల్-ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 5.91 శాతం, వాణిజ్య వాహనాలు 19.71 శాతం, త్రిచక్ర వాహనాలు 11.33 శాతం తగ్గాయి.
ద్విచక్ర వాహనాలు మాత్రం 6.11 శాతం వృద్ధిని నమోదు చేయడం కొసమెరుపు. దిగుమతులపై స్వల్పంగా ఆధారపడ్డ కంపెనీలు ఒకింత ఫర్వాలేదనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలకు రెక్కలు రావడం, తయారీ వ్యయం పెరగడం, డాలరు బలపడడం తదితర కారణాలతో దిగుమతుల వ్యయం అదే స్థాయిలో దూసుకెళ్లింది. దిగుమతులపై పెద్ద ఎత్తున ఆధారపడ్డ కంపెనీలకు ఈ పరిణామం తలకు మించిన భారంగా పరిణమించింది. రూపాయి బలపడుతుండడంతో ఈ కంపెనీల ఆశలు చిగురిస్తున్నాయి.
కొంత వెసులుబాటు..
ప్రస్తుతం రూపాయి బలపడుతున్నా పరిశ్రమ ఆశిస్తున్న స్థాయిలో లేదు. స్వల్ప వ్యవధి మార్పులు వాహన కంపెనీలకు ప్రయోజనం కలిగించవని వోల్వో ఆటో ఇండియా మార్కెటింగ్ డెరైక్టర్ సుదీప్ నారాయణ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రూపాయి మరింత బలపడుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలకు కొంత వెసులుబాటు వాస్తవమేనని అన్నారు. రూపాయి బలపడడం శుభపరిణామమని మహీంద్రా నవీస్టార్ ఎండీ నలిన్ మెహతా అభిప్రాయపడ్డారు. తయారీ వ్యయం కొంత తగ్గించుకుంటున్నామని డీఎస్‌కే మోటోవీల్స్ డెరైక్టర్ శిరీష్ కులకర్ణి వెల్లడించారు.
దిగుమతులపై పెద్ద ఎత్తున ఆధారపడ్డ కంపెనీలేవీ ప్రస్తుతం లాభాలు ఆర్జించడం లేదని అన్నారు. విడిభాగాలు, వాహనాల దిగుమతుల విషయంలో సరఫరా చేసే కంపెనీకి చెల్లింపులన్నీ డాలర్లలో ఉంటాయి. రూపాయి బలపడడం వల్ల ఒక్కో డాలరు కోసం కంపెనీలు చేసే వ్యయం తగ్గుతుంది. గతేడాది ఆగస్టులో ఒక డాలరు కోసం రూ.68.36 చెల్లిస్తే, నేడు రూ.59.91 చెల్లించాలన్నమాట.
మరింత బలపడితేనే ధరల తగ్గింపు...
రూపాయి పెరిగినప్పుడు వాహన ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచలేదని సుదీప్ నారాయణ్ అన్నారు. ఇప్పుడు రూపాయి బలపడ్డంత మాత్రాన ధరలను వెంటనే తగ్గించలేమని స్పష్టం చేశారు. రూపాయి కదలికలను ఆధారంగా మూడు నెలల సరాసరి తీసుకుని ధరలను నిర్ణయిస్తాం. ప్రస్తుతం ఇంకా అంతర్గత వ్యయాలు అధికంగానే ఉన్నాయి. పన్నులూ అదే స్థాయిలో ఉన్నాయి. రూపాయి మరింత బలపడితేనే వాహన ధరలు దిగొస్తాయని అన్నారు. ఎన్నికలయ్యాక రూపాయి ఇంకాస్త బలపడుతుందన్న అంచనాలు ఉన్నాయని శిరీష్ కులకర్ణి పేర్కొన్నారు. అప్పటి రూపాయి తీరు ఆధారంగానే వాహన ధరలు నిర్ణయమవుతాయని తెలిపారు. హ్యోసంగ్ బైక్‌లను తయారు చేస్తున్న కొరియా కంపెనీ ఎస్‌అండ్‌టీకి భారత భాగస్వామిగా డీఎస్‌కే వ్యవహరిస్తోంది.