Hot Pursuit News
-
ఊరట పొందుతున్న వాహన కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రూపాయి బలపడుతోంది. మరి ఎవరికి లాభం. ఎవరికి నష్టం. దిగుమతులపై ఆధారపడ్డ వాహన కంపెనీలు మాత్రం ఆనందంగా ఉన్నాయి. డాలరు మారకంతో పోలిస్తే గత ఎనిమిది నెలల్లో తొలిసారిగా డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.60కి దిగువకు వచ్చి చేరింది. 2013 జూలై చివరి వారం నుంచి ఆగస్టు చివరి వారంలో రూపాయి విలువ ఏకంగా 12.5 శాతం పడి రూ.68.36కు చేరింది. భారత చరిత్రలో కొత్త రికార్డులను నమోదు చేసింది. ప్రస్తుతం రూ.59.91 వద్ద ఉంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న వాహన పరిశ్రమ తాజా పరిణామాలను కొంతలో కొంత ఉపశమనంగా అభివర్ణిస్తోంది. వాహన కంపెనీలు చాలావరకూ విడిభాగాలను, ఇంజన్లను దిగుమతి చేసుకుంటాయి. మరికొన్ని మొత్తం వాహన కిట్స్‌ను దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేస్తుంటాయి. కష్ట కాలంలో పరిశ్రమ.. గత కొంత కాలంగా భారత వాహన పరిశ్రమలో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లే వు. దేశీయంగా సెంటిమెంటు బలహీనంగా ఉండడం, వడ్డీ రేట్లు అధికంగా ఉండడం ఈ పరిస్థితికి కారణమైంది. కొన్ని వాహన విభాగాల్లో వృద్ధి స్తబ్దుగా ఉంది. మరి కొన్ని విభాగాల్లో తిరోగమన వృద్ధి నమోదవుతోంది. ఈ పరిస్థితుల్లో కంపెనీలు నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. 2012-13 ఏప్రిల్-ఫిబ్రవరితో పోలిస్తే 2013-14 ఏప్రిల్-ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 5.91 శాతం, వాణిజ్య వాహనాలు 19.71 శాతం, త్రిచక్ర వాహనాలు 11.33 శాతం తగ్గాయి. ద్విచక్ర వాహనాలు మాత్రం 6.11 శాతం వృద్ధిని నమోదు చేయడం కొసమెరుపు. దిగుమతులపై స్వల్పంగా ఆధారపడ్డ కంపెనీలు ఒకింత ఫర్వాలేదనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలకు రెక్కలు రావడం, తయారీ వ్యయం పెరగడం, డాలరు బలపడడం తదితర కారణాలతో దిగుమతుల వ్యయం అదే స్థాయిలో దూసుకెళ్లింది. దిగుమతులపై పెద్ద ఎత్తున ఆధారపడ్డ కంపెనీలకు ఈ పరిణామం తలకు మించిన భారంగా పరిణమించింది. రూపాయి బలపడుతుండడంతో ఈ కంపెనీల ఆశలు చిగురిస్తున్నాయి. కొంత వెసులుబాటు.. ప్రస్తుతం రూపాయి బలపడుతున్నా పరిశ్రమ ఆశిస్తున్న స్థాయిలో లేదు. స్వల్ప వ్యవధి మార్పులు వాహన కంపెనీలకు ప్రయోజనం కలిగించవని వోల్వో ఆటో ఇండియా మార్కెటింగ్ డెరైక్టర్ సుదీప్ నారాయణ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రూపాయి మరింత బలపడుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలకు కొంత వెసులుబాటు వాస్తవమేనని అన్నారు. రూపాయి బలపడడం శుభపరిణామమని మహీంద్రా నవీస్టార్ ఎండీ నలిన్ మెహతా అభిప్రాయపడ్డారు. తయారీ వ్యయం కొంత తగ్గించుకుంటున్నామని డీఎస్కే మోటోవీల్స్ డెరైక్టర్ శిరీష్ కులకర్ణి వెల్లడించారు. దిగుమతులపై పెద్ద ఎత్తున ఆధారపడ్డ కంపెనీలేవీ ప్రస్తుతం లాభాలు ఆర్జించడం లేదని అన్నారు. విడిభాగాలు, వాహనాల దిగుమతుల విషయంలో సరఫరా చేసే కంపెనీకి చెల్లింపులన్నీ డాలర్లలో ఉంటాయి. రూపాయి బలపడడం వల్ల ఒక్కో డాలరు కోసం కంపెనీలు చేసే వ్యయం తగ్గుతుంది. గతేడాది ఆగస్టులో ఒక డాలరు కోసం రూ.68.36 చెల్లిస్తే, నేడు రూ.59.91 చెల్లించాలన్నమాట. మరింత బలపడితేనే ధరల తగ్గింపు... రూపాయి పెరిగినప్పుడు వాహన ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచలేదని సుదీప్ నారాయణ్ అన్నారు. ఇప్పుడు రూపాయి బలపడ్డంత మాత్రాన ధరలను వెంటనే తగ్గించలేమని స్పష్టం చేశారు. రూపాయి కదలికలను ఆధారంగా మూడు నెలల సరాసరి తీసుకుని ధరలను నిర్ణయిస్తాం. ప్రస్తుతం ఇంకా అంతర్గత వ్యయాలు అధికంగానే ఉన్నాయి. పన్నులూ అదే స్థాయిలో ఉన్నాయి. రూపాయి మరింత బలపడితేనే వాహన ధరలు దిగొస్తాయని అన్నారు. ఎన్నికలయ్యాక రూపాయి ఇంకాస్త బలపడుతుందన్న అంచనాలు ఉన్నాయని శిరీష్ కులకర్ణి పేర్కొన్నారు. అప్పటి రూపాయి తీరు ఆధారంగానే వాహన ధరలు నిర్ణయమవుతాయని తెలిపారు. హ్యోసంగ్ బైక్‌లను తయారు చేస్తున్న కొరియా కంపెనీ ఎస్అండ్టీకి భారత భాగస్వామిగా డీఎస్కే వ్యవహరిస్తోంది. -
ఎస్బీఐ 1,456 కోట్ల ముందస్తు పన్ను
ముంబై: మార్చి క్వార్టర్‌కు దేశ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.1,456 కోట్ల ముందస్తు పన్ను చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో బ్యాంక్ చెల్లింపులు రూ.1,450 కోట్లతో పోల్చితే ఇది తక్కువ. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించి బ్యాంక్ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. స్థూలంగా చూస్తే- బ్యాంకులు, సిమెంట్ కంపెనీలు అడ్వాన్స్ పన్ను చెల్లింపు అంశంలో వెనుకడుగు వేయగా, ఐటీ సంస్థలు మాత్రం ముందున్నాయి. ఈ అంశాలు ఆర్థిక మందగమన స్థితికి అద్దం పడుతున్నాయని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరికొన్ని సంస్థల తీరు... ఎస్బీఐ సహా ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 14 సంస్థల ముందస్తు పన్ను చెల్లింపులు 13.6 శాతం పెరిగాయి. కొన్ని ముఖ్య సంస్థలను చూస్తే- భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఏటీ చెల్లింపు రూ.230 కోట్ల నుంచి రూ.705 కోట్లకు చేరింది. బ్యాంక్ ఆఫ్ బరోడా విషయంలో ఈ మొత్తం రూ. 350 కోట్ల నుంచి రూ.360 కోట్లకు పెరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీ చెల్లింపులు రూ.790 కోట్ల నుంచి రూ.500 కోట్లకు తగ్గాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చెల్లింపులు రూ.600 కోట్ల నుంచి రూ.1,130 కోట్లకు ఎగిశాయి. ఏసీసీ లిమిటెడ్ ఏటీ చెల్లింపులు గణనీయంగా రూ.220 కోట్ల నుంచి రూ. 110 కోట్లకు పడిపోయాయి. అంబుజా సిమెంట్ విషయంలోనూ ఇదే రీతిలో చెల్లింపులు రూ. 280 కోట్ల నుంచి రూ. 170 కోట్లకు తగ్గాయి. యస్‌బ్యాంక్ రూ.200 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించింది. గత ఏడాది ఇదే కాలం తో పోల్చితే ఇది 20% (రూ.167 కోట్లు) అధికం. నేడు చివరి తేదీ...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముందస్తు పన్ను చెల్లింపులకు మార్చి 18 చివరి తేదీ. దేశంలోని మొత్తం పన్ను వసూళ్లలో ముంబై వాటా 33 శాతం. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ముంబై సర్కిల్లో ఆదాయపు పన్ను శాఖ మొత్తం పన్ను లక్ష్యం రూ.2.04 లక్షల కోట్లు. మార్చి 17 నాటికి ఈ వసూళ్లు రూ.1.63 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ వసూళ్ల మొత్తం రూ.1.56 లక్షల కోట్లు. -
ఓఎన్జీసీ లాభం 28 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ఆయిల్ రంగ దిగ్గజం ఓఎన్జీసీ ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంలో రూ. 7,126 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 5,563 కోట్లతో పోలిస్తే ఇది 28% వృద్ధి. డాలరుతో మారకంలో రూపాయి విలువ క్షీణించడం వల్ల లాభదాయకత మెరుగుపడిందని, దీంతో సబ్సిడీ చెల్లింపులు భారీగా పెరిగినప్పటికీ లాభాల్లో వృద్ధి సాధ్యపడిందని కంపెనీ చైర్మన్ సుధీర్ వాసుదేవ చెప్పారు. ఈ కాలంలో కంపెనీ సబ్సిడీలకింద రూ. 13,764 కోట్లను చెల్లించింది. గతంలో చెల్లించిన రూ. 12,433 కోట్లతో పోలిస్తే ఇవి దాదాపు 11% అధికం. డీజిల్, వంటగ్యాస్‌లను ఉత్పత్తి వ్యయాలకంటే దిగువన విక్రయించే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కొంతమేర సబ్సిడీలను ఓఎన్జీసీ చెల్లించే సంగతి తెలిసిందే. ఇక ముడిచమురును స్థూలంగా బ్యారల్‌కు 108.18 డాలర్లకు విక్రయించినప్పటికీ, నికరంగా 45.98 డాలర్లు లభించినట్లు కంపెనీ తెలిపింది. అంతక్రితం ఇదే కాలంలో బ్యారల్ చమురు విక్రయ ధర స్థూలంగా 110.13 డాలర్లు, నికరంగా 47.94 డాలర్లు చొప్పున నమోదైంది. ఈ కాలంలో చమురు ఉత్పత్తి యథాతథంగా 6.1 మిలియన్ టన్నులుగా నమోదుకాగా, సహజవాయువు ఉత్పత్తి దాదాపు 1% తగ్గి 6.285 మిలియన్ ఘనపు మీటర్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు ధర 3% క్షీణించి రూ. 273 వద్ద ముగిసింది. -
డాక్టర్ రెడ్డీస్ నికర లాభం 70 శాతం జంప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి డాక్టర్ రెడ్డీస్ నికర లాభంలో 70% వృద్ధిని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి రూ.363 కోట్లుగా ఉన్న లాభం ఈ ఏడాది రూ.619 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో ఆదాయం 23% వృద్ధితో రూ.2,865 కోట్ల నుంచి రూ.3,534 కోట్లకు చేరింది. ఉత్తర అమెరికాలో న్యూ జనరిక్ వెర్షన్ ఔషధాలు పెంచడం, దేశీ ఫార్మా కంపెనీల నుంచి తక్కువ పోటీ వంటివి లాభదాయకత పెరగడానికి దోహదం చేసినట్లు కంపెనీ సీఎఫ్ఓ సౌమెన్ చక్రవర్తి చెప్పారు. ఫలితాలను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తర అమెరికా అమ్మకాల్లో ఏకంగా 76% వృద్ధి నమోదయిందని చెప్పారు. సమీక్షా కాలంలో ఉత్తర అమెరికా జనరిక్ ఆదా యం రూ.924 కోట్ల నుంచి రూ.1,622 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో యూరప్ నుంచి వచ్చే ఆదాయం 4% క్షీణించి రూ.186 కోట్లకు తగ్గితే, ఇండియా అమ్మకాలు 5% పెరిగి రూ.391 కోట్లకు చేరాయి. ఈ త్రైమాసికంలో కొత్త ఉత్పత్తులను విడుదల చేయకపోవడం వల్ల ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ అండ్ యాక్టివ్ ఇంగ్రిడియెంట్స్(పీఎస్‌ఏఐ) అమ్మకాలు 29% క్షీణించినట్లు డాక్టర్ రెడ్డీస్ ప్రెసిడెంట్(పీఎస్‌ఏఐ) ఆర్.అనంత నారాయణ్ చెప్పారు. ఈ త్రైమాసికంలో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నామని, అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పదుల సంఖ్యలో కొత్త ఉత్పత్తులు విడుదల చేయనుండటంతో పీఎస్‌ఏఐ ఆదాయం భారీగా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్‌అండ్‌డీకి రూ.1,000 కోట్లు వచ్చే ఏడాది పరిశోధనలు, అభివృద్ధికి సుమారు రూ.1,000 కోట్లు కేటాయించనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ గ్లోబల్ జెనరిక్ హెడ్ అభిజిత్ ముఖర్జీ తెలిపారు. ఈ ఏడాది సుమారు రూ.800 కోట్లు ఆర్అండ్డీపై వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఫలితాల అనంతరం డాక్టర్ రెడ్డీస్ షేరు స్వల్పంగా 0.44 శాతం నష్టపోయి రూ.2660 వద్ద ముగిసింది.