డాక్టర్ రెడ్డీస్ నికర లాభం 70 శాతం జంప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి డాక్టర్ రెడ్డీస్ నికర లాభంలో 70% వృద్ధిని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి రూ.363 కోట్లుగా ఉన్న లాభం ఈ ఏడాది రూ.619 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో ఆదాయం 23% వృద్ధితో రూ.2,865 కోట్ల నుంచి రూ.3,534 కోట్లకు చేరింది. ఉత్తర అమెరికాలో న్యూ జనరిక్ వెర్షన్ ఔషధాలు పెంచడం, దేశీ ఫార్మా కంపెనీల నుంచి తక్కువ పోటీ వంటివి లాభదాయకత పెరగడానికి దోహదం చేసినట్లు కంపెనీ సీఎఫ్‌ఓ సౌమెన్ చక్రవర్తి చెప్పారు.
ఫలితాలను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తర అమెరికా అమ్మకాల్లో ఏకంగా 76% వృద్ధి నమోదయిందని చెప్పారు. సమీక్షా కాలంలో ఉత్తర అమెరికా జనరిక్ ఆదా యం రూ.924 కోట్ల నుంచి రూ.1,622 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో యూరప్ నుంచి వచ్చే ఆదాయం 4% క్షీణించి రూ.186 కోట్లకు తగ్గితే, ఇండియా అమ్మకాలు 5% పెరిగి రూ.391 కోట్లకు చేరాయి.
ఈ త్రైమాసికంలో కొత్త ఉత్పత్తులను విడుదల చేయకపోవడం వల్ల ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ అండ్ యాక్టివ్ ఇంగ్రిడియెంట్స్(పీఎస్‌ఏఐ) అమ్మకాలు 29% క్షీణించినట్లు డాక్టర్ రెడ్డీస్ ప్రెసిడెంట్(పీఎస్‌ఏఐ) ఆర్.అనంత నారాయణ్ చెప్పారు. ఈ త్రైమాసికంలో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నామని, అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పదుల సంఖ్యలో కొత్త ఉత్పత్తులు విడుదల చేయనుండటంతో పీఎస్‌ఏఐ ఆదాయం భారీగా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆర్‌అండ్‌డీకి రూ.1,000 కోట్లు
వచ్చే ఏడాది పరిశోధనలు, అభివృద్ధికి సుమారు రూ.1,000 కోట్లు కేటాయించనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ గ్లోబల్ జెనరిక్ హెడ్ అభిజిత్ ముఖర్జీ తెలిపారు. ఈ ఏడాది సుమారు రూ.800 కోట్లు ఆర్‌అండ్‌డీపై వినియోగిస్తున్నట్లు తెలిపారు.
ఫలితాల అనంతరం డాక్టర్ రెడ్డీస్ షేరు స్వల్పంగా 0.44 శాతం నష్టపోయి రూ.2660 వద్ద ముగిసింది.