మార్కెట్లకు బ్లాక్ ‘వీక్’
⇒ఈ వారం 1100 పాయింట్లు హుష్
⇒మూడేళ్లలో ఇదే అత్యధిక నష్టం
⇒తాజాగా 251 పాయింట్లు పతనం
⇒27,351 వద్ద ముగిసిన సెన్సెక్స్
ఈ వారం స్టాక్ మార్కెట్లకు బ్లాక్ ‘వీక్’గా నిలిచింది. మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ తాజాగా 251 పాయింట్లు పతనంకావడంతో వారం మొత్తంగా 1,107 పాయింట్లు(దాదాపు 4%) కోల్పోయింది. గత మూడేళ్ల కాలంలో ఇదే అత్యధిక నష్టంకాగా, ఇంతక్రితం 2011 డిసెంబర్‌లో మాత్రమే ఈ స్థాయిలో నష్టపోయింది. వెరసి సెన్సెక్స్ 27,351 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 69 పాయింట్లు క్షీణించి 8,224 వద్ద స్థిరపడింది.
బీఎస్‌ఈలో అన్ని రంగాలూ నష్టపోగా, ప్రధానంగా ఆయిల్ గ్యాస్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్ రంగాలు 2.5-1.5% మధ్య వెనకడుగు వేశాయి. అక్టోబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ), నవంబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు మరోసారి అమ్మకాలకే ప్రాధన్యమివ్వడం గమనార్హం.
అమెరికా వడ్డీ పెంపు భయాలు
అంచనాలకంటే ముందుగానే అమెరికా వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చునన్న భయాలు ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు ఉసిగొల్పుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు ముడిచమరు ధరల పతనానికి కారణమైన అంచనాలు సైతం ఆందోళనలు పెంచుతున్నట్లు తెలిపారు. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు సైతం 1.5% స్థాయిలో నీరసించాయి.
ఆయిల్ షేర్లు డీలా
సెన్సెక్స్‌లో ఆయిల్ దిగ్గజాలు గెయిల్, ఓఎన్‌జీసీ, రిలయన్స్ 4.5-2.5% మధ్య పతనంకాగా, మెటల్ షేర్లు టాటా స్టీల్, సెసాస్టెరిలైట్ 4-3% మధ్య క్షీణించాయి. ఈ బాటలో భెల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ సైతం 3-2% మధ్య తిరోగమించాయి. అయితే మరోపక్క మారుతీ, భారతీ, ఇన్ఫోసిస్ 1% స్థాయిలో బలపడ్డాయి.