కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా రివాల్వర్ అందుకుంటున్న బెస్ట్ ఆల్‌రౌండ్ ప్రొబేషనరీ ఐపీఎస్ సమీర్ అస్లాం షేక్, బెస్ట్ ఆల్‌రౌండ్ లేడీ ప్రొబేషనరీ ఐపీఎస్‌గా ట్రోఫీ అందుకుంటున్న అమృత దుహాన్
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం, తీవ్రవాదం, సైబర్ దాడులు సహా దేశ భవిష్యత్ ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రొబేషనరీ ఐపీఎస్‌లకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. దేశ భద్రతకు ఐసిస్, అల్‌కైదా తదితర ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందని, సాంకేతికతను ఉపయోగించి ఉగ్రవాదం నుంచి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సోమవారం హైదరాబాద్ శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 69వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్‌ఔట్ పరేడ్‌లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. 11 నెలలపాటు శిక్షణ పొందిన 122 మంది ఐపీఎస్‌లతోపాటు నేపాల్, భూటాన్, మాల్దీవులకు చెందిన 14 మంది అధికారులు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు.
ప్రొబేషనరీ అధికారుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాజ్‌నాథ్ మాట్లాడుతూ ఉగ్రవాదం, తీవ్రవాదం రోజురోజుకూ కొత్త రూపంలో ముప్పు తెచ్చేలా కనిపిస్తోందన్నారు. అణు బాంబుల నుంచి సైబర్ దాడుల వరకు, నకిలీ కరెన్సీ నోట్ల నుంచి పేలుళ్ల వరకు ఉగ్ర సంస్థలు కుట్రలకు పాల్పడు తు న్నాయని, వాటిపై అప్రమత్తంగా ఉంటూ నియంత్రణకు టెక్నా లజీని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవా లని ప్రొబేషనరీ అధి కారులకు సూచించా రు. ఐసిస్ ఉగ్రవా దం దేశ యువతను ప్రేరేపించేందుకు కుట్రలు పన్నుతోందని, అయితే యువతలో ఉన్న దేశాభిమానం ముందు ఐసిస్ కుట్రలు సాగట్లేదన్నారు.
దేశంలో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ. 25 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఇటీవలే ప్రకటించినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. శ్రమించే తత్వం, నిజాయితీ, ప్రజలపట్ల సానుకూల వైఖరి, న్యాయం చేయాలన్న దృక్పథాన్ని అలవరచుకోవాలని పిలుపు నిచ్చారు. పోలీస్ అకాడమీ ఉద్యోగుల సంక్షేమం కోసం రూ. 5 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ప్రొబేషనరీ ఐపీఎస్‌లతో పోలీస్ అకాడమీ డైరెక్టర్ డీఆర్ డోలే బర్మన్ ప్రతిజ్ఞ చేయించారు. స్మార్ట్ పోలీసింగ్‌లో శిక్షణ పొందిన ఐపీఎస్‌లంతా విజయం సాధించాలని, దేశం కోసం ప్రతిక్షణం పాటుపడేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. శిక్షణ కాలంలో ప్రతిభ కనబరిచిన ఆరుగురు ఐపీఎస్‌లకు రాజ్‌నాథ్ మెడల్స్, ట్రోఫీలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రిటైర్డ్ డీజీపీలు, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment