![Phishing Attack Targets Mnc Companies Through Rogue Email In Bangalore - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/10/Phishing%20attack.jpg.webp?itok=JEdZv42d)
బనశంకరి: పెద్ద పెద్ద ప్రైవేటు సంస్థల ఈమెయిల్స్‌ను పోలిన నకిలీ ఈమెయిల్స్ రూపొందించి వాటి ద్వారా తప్పుడు సమాచారం పంపి కోట్ల రూపాయలను సైబర్ ముఠాలు దోచుకుంటున్నాయి. బెంగళూరులో ఇటువంటి వంచక మెసేజ్‌లను నమ్మి అనేక కంపనీలు డబ్బు కోల్పోతున్నాయి. ఇలా ఐదు ప్రముఖ కంపెనీలు నగరంలోని సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. కాంటినెంటల్, ఫ్యూచర్‌రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, అద్విక్ ఆటో, ఇతర కంపెనీలు ఆగ్నేయవిభాగ సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి.
ఎలా జరుగుతుందంటే
తాము ముడిసరుకులను ఒక సంస్థ నుంచి తెప్పించుకుంటామని ఓ బాధిత కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈమెయిల్, బ్యాంకు అకౌంట్ల ద్వారా లావాదేవీలను నిర్వహిస్తుంటామని చెప్పారు. తమకు సరుకులను సరఫరా చేసే సంస్థ ఇటీవల నగదు జమచేయాలని ఈ మెయిల్ చేసిందని, వారు సూచించిన ఖాతాల్లోకి రూ.60 లక్షలను పంపామని తెలిపారు. కానీ అది కంపెనీకి చెందిన మెయిల్, అకౌంటు కాదని, సైబర్ నేరగాళ్లు తప్పుడు ఈమెయిల్ ద్వారా తమ డబ్బును కొట్టేశారని వాపోయారు. రూ.34 లక్షలు ఒక సంస్థ, రూ.2 లక్షలు మరో సంస్థ ఇలాగే మోసపోయాయి. కొద్దిరోజుల తరువాత కంపెనీ వారిని సంప్రదించగా, తమకు ఏ డబ్బూ అందలేదని చెప్పారన్నారు. దాదాపు ప్రతి సంస్థదీ ఇదే సమస్య.
జాగ్రత్తలు పాటించాలి
కంపెనీల మధ్య సాగే ఈమెయిళ్లను హ్యాక్ చేయడమో, లేదా ఇంటి దొంగల ద్వారా మెయిల్ ఐడీలను కనుక్కుని, అచ్చం అటువంటి ఈమెయిల్‌నే క్రియేట్ చేస్తారు. తద్వారా బురిడీ కొట్టిస్తారని పోలీసులు తెలిపారు. ఈమెయిల్‌పైనే ఆధారపడకుండా వీడియో కాన్ఫరెన్స్‌లు, ఫోన్లలో మాట్లాడుకుని నిర్ధారించుకోవాలని, ఆ తరువాతే నగదు లావాదేవీలు జరడం సురక్షితమని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment