email hacking
-
అమ్మ బాబోయ్..మెయిల్స్ పంపిస్తున్నారు, దర్జాగా కోట్లు నొక్కేస్తున్నారు..!
బనశంకరి: పెద్ద పెద్ద ప్రైవేటు సంస్థల ఈమెయిల్స్‌ను పోలిన నకిలీ ఈమెయిల్స్ రూపొందించి వాటి ద్వారా తప్పుడు సమాచారం పంపి కోట్ల రూపాయలను సైబర్ ముఠాలు దోచుకుంటున్నాయి. బెంగళూరులో ఇటువంటి వంచక మెసేజ్‌లను నమ్మి అనేక కంపనీలు డబ్బు కోల్పోతున్నాయి. ఇలా ఐదు ప్రముఖ కంపెనీలు నగరంలోని సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. కాంటినెంటల్, ఫ్యూచర్‌రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, అద్విక్ ఆటో, ఇతర కంపెనీలు ఆగ్నేయవిభాగ సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. ఎలా జరుగుతుందంటే తాము ముడిసరుకులను ఒక సంస్థ నుంచి తెప్పించుకుంటామని ఓ బాధిత కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈమెయిల్, బ్యాంకు అకౌంట్ల ద్వారా లావాదేవీలను నిర్వహిస్తుంటామని చెప్పారు. తమకు సరుకులను సరఫరా చేసే సంస్థ ఇటీవల నగదు జమచేయాలని ఈ మెయిల్ చేసిందని, వారు సూచించిన ఖాతాల్లోకి రూ.60 లక్షలను పంపామని తెలిపారు. కానీ అది కంపెనీకి చెందిన మెయిల్, అకౌంటు కాదని, సైబర్ నేరగాళ్లు తప్పుడు ఈమెయిల్ ద్వారా తమ డబ్బును కొట్టేశారని వాపోయారు. రూ.34 లక్షలు ఒక సంస్థ, రూ.2 లక్షలు మరో సంస్థ ఇలాగే మోసపోయాయి. కొద్దిరోజుల తరువాత కంపెనీ వారిని సంప్రదించగా, తమకు ఏ డబ్బూ అందలేదని చెప్పారన్నారు. దాదాపు ప్రతి సంస్థదీ ఇదే సమస్య. జాగ్రత్తలు పాటించాలి కంపెనీల మధ్య సాగే ఈమెయిళ్లను హ్యాక్ చేయడమో, లేదా ఇంటి దొంగల ద్వారా మెయిల్ ఐడీలను కనుక్కుని, అచ్చం అటువంటి ఈమెయిల్‌నే క్రియేట్ చేస్తారు. తద్వారా బురిడీ కొట్టిస్తారని పోలీసులు తెలిపారు. ఈమెయిల్‌పైనే ఆధారపడకుండా వీడియో కాన్ఫరెన్స్‌లు, ఫోన్లలో మాట్లాడుకుని నిర్ధారించుకోవాలని, ఆ తరువాతే నగదు లావాదేవీలు జరడం సురక్షితమని సూచించారు. -
అకౌంట్ టేకోవర్.. నయా ట్రిక్..
సాక్షి, సిటీబ్యూరో: వ్యాపార సంస్థలను టార్గెట్‌గా చేసుకుని ఈ–మెయిల్స్ హ్యాకింగ్, స్ఫూఫింగ్ ద్వారా వారికి రావాల్సిన డబ్బు కాజేసే నేరాలను అకౌంట్ టేకోవర్ క్రైమ్‌గా పిలుస్తారు. ఈ తరహా నేరాలు చేసే సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు కొత్త పంథా అనుసరిస్తున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన హేమ ఎలక్ట్రానిక్స్ సంస్థ శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వ్యాపారికి అనుమానం రాకుండా.. అకౌంట్ టేకోవర్ చేయడం కోసం తొలుత సైబర్ నేరగాళ్లు వ్యాపార/ఆర్థిక లావాదేవీతో కూడిన సంస్థల ఈ–మెయిల్ ఐడీలను హ్యాక్ చేస్తారు. అందులో ఉండే లావాదేవీలతో పాటు వారి భాషా శైలి, చెల్లింపులు/వసూళ్ల విధానం క్షుణ్ణంగా పరిశీలిస్తారు. హ్యాక్ చేసిన తర్వాత ఏ దశలోనూ సదరు వ్యాపారికి అనుమానం రాకుండా జాగ్రత్తపడుతూ వారికి డబ్బు రావాల్సి వచ్చినప్పుడు స్ఫూఫింగ్‌కు దిగుతున్నారు. నిర్ణీత రుసుం తీసుకుని స్ఫూఫింగ్ సాఫ్ట్వేర్, సదుపాయాన్ని అందించే వెబ్సైట్లు ఇంటర్నెట్లో అనేకం ఉన్నాయి. వీటిలోకి ఎంటర్ అయిన సైబర్ నేరగాడు తన ఈ–మెయిల్ ఐడీతో పాటు ఆ మెయిల్ అందుకోవాల్సిన వ్యక్తిది, రిసీవ్ చేసుకునేప్పుడు అతడి ఇన్‌బాక్స్‌లో ఏది కనిపించాలో అది కూడా పొందుపరుస్తారు. ఆ తర్వాత నగదు తీసుకోవాల్సిన వ్యక్తి పంపినట్లే ఇవ్వాల్సిన వారికి మెయిల్ చేస్తారు. వ్యాపారుల ఈ–మెయిల్స్ అప్పటికే హ్యాక్ చేసి ఉండటంతో వారే పంపిస్తున్నట్లు కస్టమర్లకు లేఖ పంపిస్తున్నారు. బ్యాంకు చెక్కునే మార్ఫింగ్ చేసి.. అనివార్య కారణాల నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతా మారిందని, కొత్త అకౌంట్లో నగదు వేయాలని చెప్తూ నేరగాళ్లకు సంబంధించిన నంబర్ ఇస్తున్నారు. దీంతో సదరు వ్యాపారికి చేరాల్సిన డబ్బు వీరి ఖాతాలో పడిపోతోంది. హేమ ఎలక్ట్రానిక్స్ పేరుతో దాని కస్టమర్ సంస్థకు మెయిల్ పంపిన నేరగాళ్లు మరో అడుగు ముందుకు వేశారు. ఎదుటి వారు పూర్తిగా నమ్మడం కోసం తమ బ్యాంకు చెక్కునే మార్ఫింగ్ చేశారు. వారి పేరు ఉండాల్సిన చోట హేమ ఎలక్ట్రానిక్స్ అని రాసి దాన్ని చెల్లింపులు చేసే వారికి పంపిన ఈ–మెయిల్లో అటాచ్ చేశారు. దీన్ని చూసిన ఓ కస్టమర్ హేమ ఎలక్ట్రానిక్స్‌కు చెల్లించాల్సిన రూ.లక్ష సైబర్ నేరగాళ్ల ఖాతాలో వేశాడు. ఈ విషయం తెలుసుకున్న హేమ సంస్థ తరఫు వాళ్లు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇది నైజీరియన్ నేరగాళ్ల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరో నాలుగు కేసుల్లో.. ♦ గౌలిగూడకు చెందిన యువకుడు కంప్యూటర్ హార్ట్‌వేర్ ఉత్పత్తుల వ్యాపారం చేస్తుంటారు. మదర్ బోర్డులను హోల్‌సేల్‌గా ఖరీదు చేయాలనే ఉద్దేశంతో ఇంటర్నెట్లో సెర్చ్ చేశారు. అందులో కనిపించిన బజాజ్ ఇంజినీర్స్ అనే సంస్థ యాడ్ చూసి వారిని సంప్రదించారు. బోర్డుల సరఫరాకు కొటేషన్లు పంపి, బేరసారాల తర్వాత ఓ ధర ఖరారైంది. అడ్వాన్సుగా రూ.2.25 లక్షలు పంపినా ఆ సంస్థ నుంచి స్పందన లేదు. సంప్రదించడానికి ప్రయత్నించగా ఫోన్లు స్విచ్ఛాఫ్ ఉండటంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ♦ కంచన్‌బాగ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.లక్ష స్వాహా చేశారు. అలానే టోలిచౌకి వాసి పేరుతో అతడి ప్రమేయం లేకుండా ధని లోన్ యాప్ నుంచి రూ.35 వేల రుణం తీసుకుని మోసం చేశారు. బోయిన్పల్లి ప్రాంతానికి ఓ వ్యక్తికి ఇటీవల ఆర్బీసీ బ్యాంకు నుంచి డెబిట్ కార్డు వచ్చింది. ఆ తర్వాత బ్యాంకు అధికారుల పేరుతో అతడికి ఫోన్ వచ్చింది. ఆ పేరుతో ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు సదరు కార్డు పని చేయడం ప్రారంభించాలంటే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఆ పేరుతో కార్డు నెంబర్, సీవీవీ కోడ్, ఓటీపీ సహా ఇతర వివరాలు బాధితుడి నుంచి తీసుకుని రూ.1.10 లక్షలు కాజేశారు. -
నకిలీ ఐడీ.. మెయిల్ హ్యాక్!
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ సంస్థ అధికారిక ఈ–మెయిల్ ఐడీలో ఒక్క అక్షరం మార్చి మరో ఐడీని సృష్టించిన సైబర్ నేరగాళ్ళు అకౌంట్ టేకోవర్ ఫ్రాడ్‌కు ప్రయత్నించారు. అయితే ఆఖరి నిమిషంలో సదరు సంస్థ అప్రమత్తం కావడంతో ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదు. తమ సంస్థ ఈ–మెయల్‌ను కొందరు దుండగులు హ్యాక్ చేశారంటూ ఆ సంస్థ గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన సదరు సంస్థ ఎలక్ట్రానిక్ వస్తువుల రంగంలో ఉంది. తమ ఉత్పత్తుల్ని దేశవిదేశాల్లోని అనేక కంపెనీలకు విక్రయిస్తూ ఉంటుంది. ఈ క్రయవిక్రయాలకు సంబంధించి ఆయా కంపెనీలకు ఈ సంస్థకు మధ్య ఈ–మెయిల్స్ రూపంలో ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతుంటాయి. ఆ కంపెనీలకు ఈ–మెయిల్ రూపంలో ఇన్వాయిస్లను పంపే బంజారాహిల్స్ సంస్థ ఆ మేరకు తమకు రావాల్సిన డబ్బును బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటుంది. బాధిత సంస్థకు చెందిన అధికారిక ఈ–మెయిల్‌ను హ్యాక్ చేసిన నేరగాళ్ళు అందులో ఉన్న ఉత్తరప్రత్యుత్తరాలను పరిశీలించారు. వీటి ఆధారంగా బంజారాహిల్స్ సంస్థ ఏఏ కంపెనీతో వ్యాపారం చేస్తోందో గుర్తించారు. ఆయా కంపెనీలకు చెందిన అధికారిక ఈ–మెయిల్ ఐడీలను మెయిల్ కాంటాక్టŠస్ నుంచి సంగ్రహించారు. వీటిని క్యాష్ చేసుకోవడానికి రంగంలోకి దిగిన సైబర్ నేరగాళ్ళు సిటీ సంస్థ అధికారిక మెయిల్ ఐడీని పొందినదే మరోటి సృష్టించాడు. ఇందులో కేవలం ఓ అక్షరాన్ని మార్చి సాధారణంగా గుర్తుపట్టలేని విధంగా రూపొందించాడు. బంజారాహిల్స్ సంస్థ మెయిల్లో ఉన్న కాంటాక్ట్ లిస్టుల్లో ఎంపిక చేసిన వాటిని సైబర్ నేరగాళ్ళు మెయిల్ పంపారు. ఏఏ కంపెనీల నుంచి అయితే ఈ సంస్థకు డబ్బు రావాల్సి ఉందో వాటినే టార్గెట్‌గా చేసుకున్నారు. అనివార్య కారణాల నేపథ్యంలో బ్యాంకు ఖాతా మార్చామని, ఈసారి నుంచి ఇందులోనే నగదు జమ చేయాలని సూచిస్తూ వాటికి ఈ–మెయిల్ పంపారు. మార్చిన ఖాతా అంటూ తమకు చెందిన అకౌంట్ వివరాలు పొందుపరిచారు. దీనిపై అనుమానం వచ్చిన కొన్ని కంపెనీలు బంజారాహిల్స్ సంస్థను సంప్రదించాయి. ఇలా జరిగిన విషయం తెలుసుకున్న బాధిత సంస్థ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హ్యాకింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఉద్యోగుల ఖాతాల హ్యాకింగ్‌పై దర్యాప్తు
న్యూఢిల్లీ: తమ కంపెనీ ఉద్యోగులకు సంబంధించిన ఖాతాలు హ్యాకింగ్‌కు (అడ్వాన్స్డ్ ఫిషింగ్ ద్వారా) గురైనట్లు గుర్తించామని.. దీనిపై దర్యాప్తును కూడా చేపట్టామని విప్రో మంగళవారం ఫలితాల ప్రకటన సందర్భంగా వెల్లడించింది. హ్యాకింగ్ ప్రభావాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని కూడా తెలిపింది. దర్యాప్తులో సహకారం కోసం స్వతంత్ర ఫోరెన్సిక్ సంస్థను నియమించుకున్నామని విప్రో పేర్కొంది. ‘అడ్వాన్స్డ్ ఫిషింగ్ క్యాంపెయిన్ ద్వారా కొంత మంది ఉద్యోగుల అకౌంట్లలో అసాధారణ కార్యకలాపాలను గుర్తించాం. వెనువెంటనే దీనిపై దర్యాప్తును మొదలుపెట్టడంతో పాటు నష్ట నివారణకు తగిన చర్యలు కూడా తీసుకున్నాం’ అని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగుల అకౌంట్లను హ్యాకింగ్ చేయడం ద్వారా విప్రోకు చెందిన కొందరు క్లయింట్లపై సైబర్ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోందని ఉందని సైబర్ సెక్యూరిటీ బ్లాగ్ క్రెబ్స్ ఆన్ సెక్యూరిటీ పేర్కొంది. -
డెలాయిట్పై భారీ సైబర్ దాడి
ప్రముఖ అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్‌కు సైబర్ షాక్ తగిలింది. సంస్థ అందించిన సమాచారం ప్రకారం ఈ మెయిల్ వ్యవస్థపై సైబర్‌దాడి జరిగింది. దీంతో క్లయింట్లకు చెందిన విలువైన సమాచారం, రహస్యమైన మెయిల్స్ హ్యాకర్ల బారిన పడ్డాయి. దీనిపై పూర్తిగా విచారణ ప్రారంభించామని డెలాయిట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. చాలా కొద్ది మంది ఖాతాదారులను మాత్రమే ఈ దాడి ప్రభావితం చేసిందనీ, ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించామని తెలిపింది. క్లయింట్ బిజినెస్ వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేదనీ పూర్తి విచారణ జరిపిస్తున్నామని ప్రకటించింది. అలాగే తమ సైబర్-సెక్యూరిటీ వ్యవస్థ చాలా ఉత్తమమైందనీ, ఖాతాదారుల రహస్య సమాచారాన్ని రక్షించడంలోనూ, వారి సైబర్‌సెక్యూరిటీ భద్రతకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని సంస్థ పేర్కొంది. అయితే చాలా పెద్ద సంఖ్యలో ఖాతాదారుల నుండి సమాచారం లీక్ అయిందనీ ది గార్డియన్ దినపత్రిక సోమవారం నివేదించింది. ఇందులో పెద్ద సంస్థలు, అమెరికా ప్రభుత్వ విభాగాలు కూడా ఉన్నాయని తెలిపింది. అమెరికాలోనే అతి పెద్ద ప్రైవేట్ సంస్థ డెలాయిట్ డేటాపై గత ఏడాది అక్టోబర్ నుంచి మార్చి వరకూ హ్యాకర్లు కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలోనే భారీ సైబర్‌దాడికి గురైందట. -
ఆదమరిస్తే అకౌంట్ టేకోవరే...
ఇంటర్నెట్లో పొంచిఉన్న నయా నేరగాళ్ళు - నగరానికి చెందిన సంస్థకు రూ.13 లక్షల టోకరా - నైజీరియన్లే ప్రధాన సూత్రధారులుగా గుర్తింపు - సహకరించిన ముగ్గురు ఢిల్లీవాసుల అరెస్టు హైదరాబాద్: ఈ-మెయిల్స్, ఎస్సెమ్మెస్‌లే పెట్టుబడిగా ఆన్లైన్లో అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు తాజాగా చేస్తున్న సరికొత్త నేరం అకౌంట్ టేకోవర్. ఆర్థిక లావాదేవీలతో కూడిన ఈ-మెయిల్ ఖాతాలను హ్యాక్ చేయడం, చెల్లింపుల సమయం వరకు వేచి చూసి బ్యాంక్ ఖాతా’ మార్చేయడం ద్వారా తేలిగ్గా లక్షలు, కోట్లలో స్వాహా చేస్తున్నారు. ఈ నేరగాళ్ల బారినపడి నగరానికి చెందిన ఆర్.ఎల్. ట్రేడింగ్ కంపెనీ రూ.13 లక్షలు నష్టపోయింది. ఈ కేసును హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లోని సైబర్ క్రైమ్ ఠాణా అధికారులు దర్యాప్తు చేశారు. ఆదివారం ఢిల్లీలో ముగ్గురు నేరగాళ్ళను అరెస్టు చేసి రూ.12 లక్షలు రికవరీ చేశారు. అకౌంట్ టేకోవర్‌గా పిలిచే ఈ వ్యవహారంలో బాధితులంతా దాదాపు వ్యాపారులే ఉంటున్నారు. ఈ సైబర్ నేరం చేయడం కోసం తొలుత నైజీరియన్లు గ్రూపులుగా ఏర్పడి వ్యాపార/ఆర్థిక లావాదేవీలతో కూడిన ఈ-మెయిల్ ఐడీలను హ్యాక్ చేస్తున్నారు. అందులో ఉండే లావాదేవీలతో పాటు వారి భాషా శైలి, చెల్లింపులు/వసూళ్ల విధానం కొంతకాలం పాటు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా రెండు రాష్ట్రాలు, దేశాల మధ్య ఇంపోర్ట్-ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసే వారే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు. హ్యాకింగ్ తరవాత స్ఫూఫింగ్... ఇలా హ్యాక్ చేసిన ఈ-మెయిల్‌ను నిరంతరం అధ్యయనం చేడయం ద్వారా వారికి డబ్బు రావాల్సి, చెల్లించాల్సిన సమయం వచ్చినప్పుడు స్ఫూఫింగ్‌కు దిగుతున్నారు. నిర్ణీత రుసుం తీసుకుని స్ఫూఫింగ్ సాఫ్ట్వేర్, సదుపాయాన్ని అందించే వెబ్సైట్లు ఇంటర్నెట్లో అనేకం ఉన్నాయి. వీటి సర్లర్వు విదేశాల్లో ఉండటం నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఈ సైట్లోకి ఎంటర్ అయిన తరవాత సదరు వ్యక్తి ఈ-మెయిల్ ఐడీతో పాటు ఆ మెయిల్ అందుకోవాల్సిన వ్యక్తిది, రిసీవ్ చేసుకునేప్పుడు అతడి ఇన్‌బాక్స్‌లో ఏది కనిపించాలో అది కూడా పొందుపరుస్తారు. ఆ తరవాత నగదు తీసుకోవాల్సిన వ్యక్తి పంపినట్లే ఇవ్వాల్సిన వారికి మెయిల్ చేస్తారు. వ్యాపారుల ఈ-మెయిల్స్ అప్పటికే హ్యాక్ చేసి ఉండటంతో వారే పంపిస్తున్నట్లు కస్టమర్లకు లేఖ పంపిస్తున్నారు. అందులో అనివార్య కారణాల నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతా మారిందని, కొత్త అకౌంట్లో నగదు వేయాలని చెప్తూ నేరగాళ్లకు సంబంధించిన నెంబర్ ఇస్తున్నారు. దీంతో సదరు వ్యాపారికి చేరాల్సిన డబ్బు వీరి ఖాతాలో పడిపోతోంది. చిక్కకుండా ఉండేందుకు జాగ్రత్తలు... పక్కా వ్యవస్థీకృతంగా వ్యవహారాలు సాగిస్తున్న నైజీరియన్లు ఏ సందర్భంలోనూ ఇక్కడకు రాకుండా, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అకౌంట్ టేకోవర్ స్కామ్స్‌లో బ్యాంకు ఖాతాలు ఎంతోకీలకం. వీటిని వారే నేరుగా తెరిస్తే పోలీసులకు దొరికే అవకాశాలు ఉంటాయి. ఇలా కాకుండా ఉండేందుకు ఇక్కడివే, బోగస్ చిరునామాలతో ఉండేవి తప్పనిసరి. దీనికోసం నైజీరియన్లు భారీ పథక రచన చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు ఎరవేస్తున్న ఈ ఏజెంట్లు బ్యాంకు ఖాతాలను తెరిచి, తమ వ్యాపారానికి సహకరిస్తే ప్రతి లావాదేవీలోనూ కమీషన్ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. వీరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు కొందరు రాజకీయ ప్రముఖుల నల్లధనాన్ని తాము వైట్ మనీగా మారుస్తామని, దాని కోసమే ఖాతాలంటూ నమ్మబలికి వారిని ఒప్పిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఖాతాలు తెరిచిన వారికి, ఏజెంట్లకు మధ్య... ఏజెంట్లకు నైజీరియన్లకు మధ్య ఎలాంటి లింకు లేకపోవడంతో దొరకడం కష్టమవుతుంది. ఆర్ఎల్’ విషయంలో ఇలా జరిగింది: నగరానికి చెందిన ఆర్ఎల్ ట్రేడర్స్ సంస్థ రెగ్జిన్ తదితర ఫ్యాబ్రిక్ వ్యాపారం చేస్తుంటుంది. వీరు సరుకును ముంబైకి చెందిన రెస్పాన్సివ్ ప్రొడక్ట్స్ సంస్థ నుంచి ఖరీదు చేస్తుంటుంది. అందుకు సంబంధించిన చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే జరుగుతుంటాయి. రెస్పాన్సివ్’ ఈ-మెయిల్‌ను హ్యాక్ చేసిన నైజీరియన్లు దాని ద్వారా ఆర్ఎల్’కు ఓ సందేశం పంపారు. ఇన్‌కమ్‌ట్యాక్స్ ఇబ్బందుల నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతా మార్చామని పేర్కొంటూ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిగత ఖాతా వివరాలను అందులో పొందుపరిచారు. ఈ ఈ-మెయిల్‌ను నిజమని నమ్మిన ఆర్ఎల్’ సంస్థ రూ.13 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది. తమకు అందాల్సిన డబ్బు అందలేదంటూ రెస్పాన్సివ్’ నుంచి వర్తమానం రావడంతో జరిగిన మోసం గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో ఈ కేసును దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ రవికిరణ్ ఆదివారం ఢిల్లీలో నైజీరియన్లకు ఖాతాలు ఇవ్వడం ద్వారా సహకరించిన మాజిద్ సల్మానీ, ఇలియాస్ అహ్మద్, మహ్మద్ అయాజ్‌లను అరెస్టు చేసింది. సరిచూసుకోకుంటే నష్టపోవాల్సిందే: ఇటీవల కాలంలో అకౌంట్ టేకోవర్ నేరాలు పెరుగుతున్నాయి. ఈ తరహా నేరాల్లో నిందితులు చిక్కడం, నగదు రికవరీ కావడం కష్టసాధ్యం. వీటిని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిర్ధారించుకోవడం ముఖ్యం..... బ్యాంక్ ఖాతా మారిందంటూ మీకు కస్టమర్ పంపినట్లు మెయిల్ వస్తే అనుమానించి వారిని సంప్రదించండి. మీరు లావాదేవీలు నెరిపే వారితో ఖాతా మారినట్లయితే ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామని స్పష్టంగా చెప్పండి. నిర్థారించుకోకుండా నగదు లావాదేవీలు వద్దు. - రవికిరణ్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్.