ఆదమరిస్తే అకౌంట్ టేకోవరే...
ఇంటర్‌నెట్‌లో పొంచిఉన్న నయా నేరగాళ్ళు
- నగరానికి చెందిన సంస్థకు రూ.13 లక్షల టోకరా
- నైజీరియన్లే ప్రధాన సూత్రధారులుగా గుర్తింపు
- సహకరించిన ముగ్గురు ఢిల్లీవాసుల అరెస్టు
హైదరాబాద్: ఈ-మెయిల్స్, ఎస్సెమ్మెస్‌లే పెట్టుబడిగా ఆన్‌లైన్‌లో అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు తాజాగా చేస్తున్న సరికొత్త నేరం అకౌంట్ టేకోవర్. ఆర్థిక లావాదేవీలతో కూడిన ఈ-మెయిల్ ఖాతాలను హ్యాక్ చేయడం, చెల్లింపుల సమయం వరకు వేచి చూసి బ్యాంక్ ఖాతా’ మార్చేయడం ద్వారా తేలిగ్గా లక్షలు, కోట్లలో స్వాహా చేస్తున్నారు.
ఈ నేరగాళ్ల బారినపడి నగరానికి చెందిన ఆర్.ఎల్. ట్రేడింగ్ కంపెనీ రూ.13 లక్షలు నష్టపోయింది. ఈ కేసును హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లోని సైబర్ క్రైమ్ ఠాణా అధికారులు దర్యాప్తు చేశారు. ఆదివారం ఢిల్లీలో ముగ్గురు నేరగాళ్ళను అరెస్టు చేసి రూ.12 లక్షలు రికవరీ చేశారు. అకౌంట్ టేకోవర్‌గా పిలిచే ఈ వ్యవహారంలో బాధితులంతా దాదాపు వ్యాపారులే ఉంటున్నారు. ఈ సైబర్ నేరం చేయడం కోసం తొలుత నైజీరియన్లు గ్రూపులుగా ఏర్పడి వ్యాపార/ఆర్థిక లావాదేవీలతో కూడిన ఈ-మెయిల్ ఐడీలను హ్యాక్ చేస్తున్నారు. అందులో ఉండే లావాదేవీలతో పాటు వారి భాషా శైలి, చెల్లింపులు/వసూళ్ల విధానం కొంతకాలం పాటు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ప్రధానంగా రెండు రాష్ట్రాలు, దేశాల మధ్య ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్ వ్యాపారం చేసే వారే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు. హ్యాకింగ్ తరవాత స్ఫూఫింగ్... ఇలా హ్యాక్ చేసిన ఈ-మెయిల్‌ను నిరంతరం అధ్యయనం చేడయం ద్వారా వారికి డబ్బు రావాల్సి, చెల్లించాల్సిన సమయం వచ్చినప్పుడు స్ఫూఫింగ్‌కు దిగుతున్నారు. నిర్ణీత రుసుం తీసుకుని స్ఫూఫింగ్ సాఫ్ట్‌వేర్, సదుపాయాన్ని అందించే వెబ్‌సైట్లు ఇంటర్‌నెట్‌లో అనేకం ఉన్నాయి. వీటి సర్లర్వు విదేశాల్లో ఉండటం నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఈ సైట్‌లోకి ఎంటర్ అయిన తరవాత సదరు వ్యక్తి ఈ-మెయిల్ ఐడీతో పాటు ఆ మెయిల్ అందుకోవాల్సిన వ్యక్తిది, రిసీవ్ చేసుకునేప్పుడు అతడి ఇన్‌బాక్స్‌లో ఏది కనిపించాలో అది కూడా పొందుపరుస్తారు. ఆ తరవాత నగదు తీసుకోవాల్సిన వ్యక్తి పంపినట్లే ఇవ్వాల్సిన వారికి మెయిల్ చేస్తారు. వ్యాపారుల ఈ-మెయిల్స్ అప్పటికే హ్యాక్ చేసి ఉండటంతో వారే పంపిస్తున్నట్లు కస్టమర్లకు లేఖ పంపిస్తున్నారు. అందులో అనివార్య కారణాల నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతా మారిందని, కొత్త అకౌంట్‌లో నగదు వేయాలని చెప్తూ నేరగాళ్లకు సంబంధించిన నెంబర్ ఇస్తున్నారు. దీంతో సదరు వ్యాపారికి చేరాల్సిన డబ్బు వీరి ఖాతాలో పడిపోతోంది.
చిక్కకుండా ఉండేందుకు జాగ్రత్తలు... పక్కా వ్యవస్థీకృతంగా వ్యవహారాలు సాగిస్తున్న నైజీరియన్లు ఏ సందర్భంలోనూ ఇక్కడకు రాకుండా, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అకౌంట్ టేకోవర్ స్కామ్స్‌లో బ్యాంకు ఖాతాలు ఎంతోకీలకం. వీటిని వారే నేరుగా తెరిస్తే పోలీసులకు దొరికే అవకాశాలు ఉంటాయి. ఇలా కాకుండా ఉండేందుకు ఇక్కడివే, బోగస్ చిరునామాలతో ఉండేవి తప్పనిసరి. దీనికోసం నైజీరియన్లు భారీ పథక రచన చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు ఎరవేస్తున్న ఈ ఏజెంట్లు బ్యాంకు ఖాతాలను తెరిచి, తమ వ్యాపారానికి సహకరిస్తే ప్రతి లావాదేవీలోనూ కమీషన్ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. వీరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు కొందరు రాజకీయ ప్రముఖుల నల్లధనాన్ని తాము వైట్ మనీగా మారుస్తామని, దాని కోసమే ఖాతాలంటూ నమ్మబలికి వారిని ఒప్పిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఖాతాలు తెరిచిన వారికి, ఏజెంట్లకు మధ్య... ఏజెంట్లకు నైజీరియన్లకు మధ్య ఎలాంటి లింకు లేకపోవడంతో దొరకడం కష్టమవుతుంది.
ఆర్‌ఎల్’ విషయంలో ఇలా జరిగింది: నగరానికి చెందిన ఆర్‌ఎల్ ట్రేడర్స్ సంస్థ రెగ్జిన్ తదితర ఫ్యాబ్రిక్ వ్యాపారం చేస్తుంటుంది. వీరు సరుకును ముంబైకి చెందిన రెస్పాన్సివ్ ప్రొడక్ట్స్ సంస్థ నుంచి ఖరీదు చేస్తుంటుంది. అందుకు సంబంధించిన చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతుంటాయి. రెస్పాన్సివ్’ ఈ-మెయిల్‌ను హ్యాక్ చేసిన నైజీరియన్లు దాని ద్వారా ఆర్‌ఎల్’కు ఓ సందేశం పంపారు. ఇన్‌కమ్‌ట్యాక్స్ ఇబ్బందుల నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతా మార్చామని పేర్కొంటూ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిగత ఖాతా వివరాలను అందులో పొందుపరిచారు. ఈ ఈ-మెయిల్‌ను నిజమని నమ్మిన ఆర్‌ఎల్’ సంస్థ రూ.13 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసింది. తమకు అందాల్సిన డబ్బు అందలేదంటూ రెస్పాన్సివ్’ నుంచి వర్తమానం రావడంతో జరిగిన మోసం గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో ఈ కేసును దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ రవికిరణ్ ఆదివారం ఢిల్లీలో నైజీరియన్లకు ఖాతాలు ఇవ్వడం ద్వారా సహకరించిన మాజిద్ సల్మానీ, ఇలియాస్ అహ్మద్, మహ్మద్ అయాజ్‌లను అరెస్టు చేసింది.
సరిచూసుకోకుంటే నష్టపోవాల్సిందే: ఇటీవల కాలంలో అకౌంట్ టేకోవర్ నేరాలు పెరుగుతున్నాయి. ఈ తరహా నేరాల్లో నిందితులు చిక్కడం, నగదు రికవరీ కావడం కష్టసాధ్యం. వీటిని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
నిర్ధారించుకోవడం ముఖ్యం.....
బ్యాంక్ ఖాతా మారిందంటూ మీకు కస్టమర్ పంపినట్లు మెయిల్ వస్తే అనుమానించి వారిని సంప్రదించండి. మీరు లావాదేవీలు నెరిపే వారితో ఖాతా మారినట్లయితే ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామని స్పష్టంగా చెప్పండి. నిర్థారించుకోకుండా నగదు లావాదేవీలు వద్దు. - రవికిరణ్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్.