ప్రముఖ అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్‌కు సైబర్ షాక్ తగిలింది. సంస్థ అందించిన సమాచారం ప్రకారం ఈ మెయిల్ వ్యవస్థపై సైబర్‌దాడి జరిగింది. దీంతో క్లయింట్లకు చెందిన విలువైన సమాచారం, రహస్యమైన మెయిల్స్ హ్యాకర్ల బారిన పడ్డాయి. దీనిపై పూర్తిగా విచారణ ప్రారంభించామని డెలాయిట్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
చాలా కొద్ది మంది ఖాతాదారులను మాత్రమే ఈ దాడి ప్రభావితం చేసిందనీ, ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించామని తెలిపింది. క్లయింట్ బిజినెస్ వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేదనీ పూర్తి విచారణ జరిపిస్తున్నామని ప్రకటించింది. అలాగే తమ సైబర్-సెక్యూరిటీ వ్యవస్థ చాలా ఉత్తమమైందనీ, ఖాతాదారుల రహస్య సమాచారాన్ని రక్షించడంలోనూ, వారి సైబర్‌సెక్యూరిటీ భద్రతకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని సంస్థ పేర్కొంది.
అయితే చాలా పెద్ద సంఖ్యలో ఖాతాదారుల నుండి సమాచారం లీక్ అయిందనీ ది గార్డియన్ దినపత్రిక సోమవారం నివేదించింది. ఇందులో పెద్ద సంస్థలు, అమెరికా ప్రభుత్వ విభాగాలు కూడా ఉన్నాయని తెలిపింది. అమెరికాలోనే అతి పెద్ద ప్రైవేట్ సంస్థ డెలాయిట్ డేటాపై గత ఏడాది అక్టోబర్ నుంచి మార్చి వరకూ హ్యాకర్లు కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలోనే భారీ సైబర్‌దాడికి గురైందట.