
హైదరాబాదీ ఐటీ సంస్థలపై పాక్ హ్యాకర్ల దాడి?
పాకిస్థాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు గత పది రోజులుగా హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలపై సైబర్ దాడులు చేస్తున్నారు.
పాకిస్థాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు గత పది రోజులుగా హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలపై సైబర్ దాడులు చేస్తున్నారు. ఈ విషయాన్ని సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సిఎస్‌సి) ప్రతినిధి ఒకరు తెలిపారు. సైబర్ దాడులపై దర్యాప్తు మొదలైందని, 'రాన్సమ్‌వేర్'ను ఉపయోగించి వాళ్లు సమాచారాన్ని దొంగిలించారని చెప్పారు. డీక్రిప్షన్ కీలు కావాలంటే పెద్దమొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. టర్కీ, సోమాలియా, సౌరీ అరేబియా లాంటి దేశాల్లో ఉన్న సెర్వర్లను ఉపయోగించుకుని పాక్ హ్యాకర్లు ఈ దాడులు చేశారని సైబర్ సెక్యూరిటీ ఫోరం అధికారులు తెలిపారు. వీటిలో కొన్ని దాడులను సమర్థంగా ఛేదించామని, అయితే ఇంకా చాలా సంస్థలకు సంబంధించి మాత్రం సమస్య అలాగే ఉందని సైబర్ సెక్యూరిటీ ఫోరం అధినేత దేవారజ్ వడయార్ చెప్పారు. రాన్సమ్‌వేర్ దాడులు ఉన్నట్టుండి ఈ మధ్యకాలంలోనే పెరిగాయన్నారు. గత పదిరోజులుగా పాకిస్థాన్ నుంచే ఈ దాడులు జరుగుతున్నాయని తెలిపారు.
కొన్ని ఐటీ సంస్థలు నేరుగా ఈ విషయాన్ని ఎస్‌సిఎస్‌సికి ఫిర్యాదుచేయగా, మరికొన్ని ప్రైవేటు సైబర్ సెక్యూరిటీ సంస్థల ద్వారా కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చాయి. అయితే సంస్థల భద్రత దృష్ట్యా ఏయే కంపెనీలపై సైబర్ దాడులు జరిగాయో మాత్రం వెల్లడించడం లేదు. సైబరాబాద్ పరిధిలో మొత్తం 2,500 ఐటీ కంపెనీలు ఉన్నాయి. వాటిలో 1300 పెద్ద కంపెనీలు. ఇవి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కాం)లో రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా తమ సేవలు అందిస్తుంటాయి. ప్రధానంగా వీటి క్లయింట్లు అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఉన్నారు.
ప్రాక్జీ సెర్వర్లను ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి మారుస్తుంటారు. కానీ, మన దేశంలోని ఎథికల్ హ్యాకర్లు ఈ దాడులు చేస్తున్నవాళ్లు ఎవరన్న విషయాన్ని ఐపీ అడ్రస్‌ల ద్వారా గుర్తించారు. వాళ్లు వాడిన పోర్టు, నెట్‌వర్క్ నోడ్ సహా అన్ని వివరాలూ రాబట్టారు. సర్జికల్ దాడులకు ప్రతీకారంగా తాము ఏడువేల భారతీయ వెబ్‌సైట్లను హ్యాక్ చేసినట్లు పాక్ హ్యాకర్లు ప్రకటించుకున్నారు. ఆ తర్వాత అందులో భాగంగానే ఇప్పుడు హైదరాబాద్ ఐటీ కంపెనీలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. సైబర్ దాడులకు గురైన కంపెనీలలో చాలావరకు ఆర్థికాంశాల ఆధారంగానే పనిచేస్తాయి. తమ నెట్‌వర్క్ లావాదేవీలు జరగడం లేదని ముందుగా ఈ కంపెనీలు నిపుణులకు తెలిపాయి. సినాప్సిస్ ద్వారా ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయగా, రియాద్ నుంచి రాన్సమ్‌వేర్ దాడులు జరిగినట్లు గుర్తించామని వడయార్ తెలిపారు.
ఒక కంపెనీకి చెందిన డేటా మొత్తాన్ని హ్యాకర్లు లాక్ చేసేశారు. దాన్ని అన్‌లాక్ చేయాలంటే దాదాపు రూ. 420 కోట్లు చెల్లించాలని వాళ్లు డిమాండ్ చేశారు. అయితే, ఒకవేళ ఆ మొత్తం వాళ్లకు చెల్లించినా.. మొత్తం సమాచారం వచ్చే అవకాశం తక్కువేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సమాచారం ప్రాధాన్యాన్ని బట్టి వాళ్లు అడిగే మొత్తం పెరుగుతూ ఉంటుంది. అడిగిన మొత్తం చెల్లించినా డీక్రిప్షన్ కోడ్‌లు ఇస్తారన్న నమ్మకం లేదు. ఇప్పటికి చాలా కేసుల్లో వాళ్లు ఇలాగే చేశారని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఇ2 ల్యాబ్స్ అనే సంస్థ వ్యవస్థాపకుడు జకీ ఖురేషీ తెలిపారు.