సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యులు రెండు వారాల పాటు హైదరాబాద్ నగరంలో అతిథులుగా ఉండబోతున్నారు. వన్డే వరల్డ్ కప్‌లో రెండు వామప్ మ్యాచ్‌లతో పాటు రెండు ప్రధాన మ్యాచ్‌లను కూడా పాకిస్తాన్ ఇక్కడి ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది. మెగా టోర్నీలో పాల్గొనేందుకు బాబర్ ఆజమ్ నాయకత్వంలోని 15 మంది సభ్యుల బృందం బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది.
శంషాబాద్ విమానాశ్రయంలో హెచ్‌సీఏ ప్రతినిధులు పాక్ జట్టుకు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో జట్టుకు నగర పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పాక్ క్రికెట్ టీమ్ ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై అడుగు పెట్టడం విశేషం. 2016లో ఇక్కడే టి20 ప్రపంచకప్ ఆడిన ఆ టీమ్ మళ్లీ ఇప్పుడే మరో వరల్డ్ కప్ కోసం ఇక్కడకు వచ్చింది. టీమ్‌లోని మొహమ్మద్ నవాజ్, సల్మాన్ ఆగాలకు మాత్రమే గతంలో భారత్‌లో ఆడిన అనుభవం (జూనియర్ స్థాయిలో) ఉండగా... టీమ్ కెప్టెన్, ఇప్పటి అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన బాబర్ ఆజమ్ తొలిసారి భారత్‌లో ఆడబోతున్నాడు.
భారత్ బయల్దేరే ముందు లాహోర్‌లో మీడియాతో మాట్లాడిన బాబర్ ఆజమ్ తమ జట్టు మెరుగైన ప్రదర్శన ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్‌తో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ‘గతంలో భారత్‌లో ఆడకపోయినా మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. దాదాపు ఆసియా ఖండంలోనే ఇతర దేశాల్లాగే ఉండే ఇక్కడి పరిస్థితులపై మాకు అవగాహన ఉంది. అందుకే మేం తగిన విధంగా సన్నద్ధమై వచ్చాం. హౌస్‌ఫుల్‌గా ఉండబోయే అహ్మదాబాద్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా.
నా సొంత రికార్డుల గురించి ఆలోచన లేదు. ఎంత స్కోరు చేసినా జట్టు విజయానికి ఉపయోగపడటం ముఖ్యం’ అని బాబర్ అన్నాడు. ఉప్పల్ స్టేడియంలో రేపు న్యూజిలాండ్‌తో, అక్టోబర్ 3న ఆ్రస్టేలియాతో పాకిస్తాన్ రెండు వామప్ మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం ప్రధాన టోర్నీలో అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో, అక్టోబర్ 10న శ్రీలంకతో ఆ జట్టు తలపడుతుంది. మరోవైపు కేన్ విలియమ్సన్ నేతృత్వంలో క్రైస్ట్‌చర్చ్ నుంచి వచ్చిన న్యూజిలాండ్ టీమ్ రెండో బృందం కూడా బుధవారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment