‘డిజిటల్‌ అరెస్ట్‌’ గురించి తెలుసా..? | New Approach Of Cyber Crime Is Digital Arrest | Sakshi
Sakshi News home page

New Cyber Crime: ‘డిజిటల్‌ అరెస్ట్‌’ గురించి తెలుసా..?

Published Mon, Jan 15 2024 8:00 AM | Last Updated on Mon, Jan 15 2024 10:58 AM

New Approach Of Cyber Crime Is Digital Arrest - Sakshi

పదేళ్ల కిందట క్రైమ్‌ వేరు. ఇప్పుడు జరుగుతున్న క్రైమ్‌ వేరు. దానివల్ల కలిగే బాధ మారకపోయినా.. క్రైమ్‌ జరిగేతీరు, దాని విధానం, రూపం మారుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్‌ దాడులు ఎక్కువవుతున్నాయి. ఆన్‌లైన్‌లో వివిధ రకాల మోసాలు జరుగుతున్నాయి. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వివరాలు చోరీ చేసి షాపింగ్‌ చేయటం తెలిసిందే. పిన్‌ నంబరు కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేయటం కొత్త విషయమేమీ కాదు. సిమ్‌ స్వాప్‌ చేసి మన ఫోన్‌కు అందాల్సిన మెసేజ్‌లను మళ్లించి, డబ్బు లాగడం మామూలై పోయింది. అజ్ఞాత వ్యక్తులు ఫోన్‌ చేసి, తీయని మాటలతో మభ్యపెట్టో, నగ్న చిత్రాలతో బెదిరించో ఖాతాలు ఖాళీ చేయటమూ చూస్తున్నదే. సంస్థల కంప్యూటర్ల మీద దాడిచేసి, వాటిని పనిచేయకుండా నిలిపివేయడం..డబ్బులు ఇస్తేనే విడుదల చేయటం మరో తరహా మోసం. అయితే తాజాగా ‘డిజిటల్‌ అరెస్ట్‌’ వంటి కొత్త నేరాలూ వెలుగులోకి వస్తున్నాయి.

డిజిటల్‌ అరెస్ట్‌ అంటే..

సైబర్‌ నేరాలు పెచ్చుమీరుతున్న రోజుల్లో రోజుకో కొత్తరకం మోసాలు వెలుగు చూస్తున్నాయి. డిజిటల్‌ అరెస్ట్‌ ఇలాంటిదే. ఇందులో సైబర్‌ నేరగాళ్లు వీడియో కాల్‌ చేసి తాము పోలీసులమనో, దర్యాప్తు అధికారులమనో నమ్మిస్తారు. బ్యాంకు ఖాతా, సిమ్‌ కార్డు, ఆధార్‌ కార్డు వంటివి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించుకున్నారని బెదిరిస్తారు. విచారణ పూర్తయ్యేంతవరకూ అక్కడి నుంచి కదలటానికి వీల్లేదని కట్టడి చేస్తారు. డబ్బులు చెల్లిస్తే వదిలేస్తామని చెబుతారు. వారి ఖాతాలోకి డబ్బులు జమయ్యాక విడిచిపెడతారు. ఇలా మనిషిని ఎక్కడికీ వెళ్లనీయకుండా.. ఒకరకంగా అరెస్ట్‌ చేసినట్టుగా నిర్బంధించటమే ‘డిజిటల్‌ అరెస్ట్‌’.

డిజిటల్‌ అరెస్ట్‌ కొత్త సైబర్‌ నేరం కావటం వల్ల ప్రజలు దీన్ని పోల్చుకోవటం కష్టమైపోతోంది. దర్యాప్తు అధికారులమని తొందర పెట్టటం వల్ల కంగారుపడి, ఏది ఎక్కడికి దారితీస్తోందనే భయంతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇటీవల మనదేశంలో వెలుగులోకి వచ్చిన ఘటనలే దీనికి నిదర్శనం.

నోయిడాకు చెందిన ఒక మహిళకు ఒకరు ఫోన్‌ చేసి, తాను దర్యాప్తు అధికారినని చెప్పాడు. ‘మీ ఆధార్‌ కార్డుతో సిమ్‌ కొన్నారు. దాన్ని ముంబయిలో మనీ లాండరింగ్‌ కోసం వాడుకున్నారు’ అని బెదిరించాడు. దర్యాప్తు అనేసరికే ఆమె హడలిపోయారు. దీన్ని గుర్తించిన నేరగాడు మరింత రెచ్చిపోయాడు. తదుపరి విచారణ కోసం కాల్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అవతలి నుంచి మరో నేరగాడు తాను ముంబయి పోలీసు అధికారినని చెప్పి విచారణ ఆరంభించాడు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ నిరంతరాయంగా స్కైప్‌ కాల్‌ చేశాడు. అంతసేపూ ఆమెను అక్కడి నుంచి కదలనీయలేదు. అతడి ఖాతాలోకి రూ.11.11 లక్షలను ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాక గానీ కాల్‌ కట్‌ చేయలేదు. చివరికి తాను మోసపోయానని ఆ మహిళ గుర్తించి సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు.

ఇదీ చదవండి: రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే..

మరేం చేయాలంటే..

భారతీయ చట్టాల్లో ఇప్పటివరకూ డిజిటల్‌ అరెస్ట్‌ అనేదే లేదన్న సంగతి తెలుసుకోవాలి. ఎవరైనా దర్యాప్తు అధికారులమని చెప్పి, విచారణ చేస్తున్నామంటే భయపడొద్దు. వెంటనే కాల్‌ను కట్టేయాలి. మరోసారి ఆలోచించుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్లకు విషయాన్ని తెలియజేయాలి. సాధారణంగా ప్రభుత్వ సంస్థలు గానీ అధికారులు గానీ కాల్‌ చేసి బెదిరించటం, భయపెట్టటం చేయరు. కాబట్టి అలాంటి కాల్‌ వస్తే దాన్ని గుర్తించాలి. వారి విశ్వసనీయతను ధ్రువీకరించుకోవాలి. మరీ ఎక్కువగా బెదిరిస్తే అన్ని వివరాలతో నోటీసు పంపించమని అడగాలి. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి వారిని కలుస్తానని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రహస్య సమాచారాన్ని వెల్లడించొద్దు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా, పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డుతో ముడిపడిన వివరాలను ఇవ్వద్దు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement