న్యూదిల్లీ: దాదాపు అన్ని రంగాలూ, సకల కార్యకలాపాలూ అంతర్జాలంతో అనుసంధానమైవుతున్న డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. దీని ద్వారా వేగవంతమైన అద్భుత ప్రయోజనాలు ఒక కోణమైతే.. హ్యాకింగ్‌లూ, వైరస్ దాడులూ, మోసాలూ దీని మరో కోణం. దీంతో సైబర్ భద్రత అనివార్యమైంది. చాలా కంపెనీలకు సైబర్ భద్రతకు సంబంధించిన ఆందోళనలు పెరుగుతున్నాయి.
పీడబ్ల్యూసీ నిర్వహించిన 2023 గ్లోబల్ రిస్క్ సర్వే–ఇండియా నివేదికలో సైబర్ సెక్యూరిటీపై కంపెనీలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు వెల్లడయ్యింది. దీని ప్రకారం భారతీయ కంపెనీలకు పొంచి ఉన్న రిస్కుల్లో సైబర్ సెక్యూరిటీ అగ్ర స్థానంలో ఉంది. రాబోయే 12 నెలల్లో తమ సంస్థలకు అత్యధికంగా సైబర్ సెక్యూరిటీ రిస్కులు పొంచి ఉన్నాయని సుమారు 38 శాతం మంది రిస్క్ మేనేజ్‌మెంట్ లీడర్లు తెలిపారు. తర్వాత స్థానాల్లో వాతావరణ మార్పులు (37 శాతం మంది), ద్రవ్యోల్బణం (36 శాతం), ఇతరత్రా డిజిటల్.. టెక్నాలజీ (35 శాతం) రిస్కులు ఉన్నాయి. 67 ప్రాంతాలకు చెందిన 3,910 మంది బిజినెస్, రిస్క్ మేనేజ్‌మెంట్ లీడర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 163 భారతీయ సంస్థలు ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీపరమైన రిస్కు గతేడాది నివేదికలో మూడో స్థానంలో ఉండగా ఈ ఏడాది మొదటి స్థానానికి చేరింది. నివేదికలో మరిన్ని వివరాలు..
- సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు భారతీయ సంస్థలు సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేసుకునేందుకు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న వాటిలో 55 శాతం సంస్థలు వచ్చే 1–3 ఏళ్లలో కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నాయి.
- 71 శాతం దేశీ సంస్థలు రిస్క్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి సైబర్ సెక్యూరిటీ, ఐటీ డేటాను సేకరించి, విశ్లేషిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 61 శాతంగా ఉంది.
- దేశీ వ్యాపార దిగ్గజాలు రిస్కు తీసుకునే సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు రిసు్కల వల్ల వచ్చే అవకాశాలను గుర్తించడంలోనూ సముచితంగా వ్యవహరిస్తున్నాయి. ఆలోచనా ధోరణిలో ఈ తరహా మార్పులనేవి సంస్థ పురోగతికి దోహదపడనున్నాయి.
- 99 శాతం దిగ్గజాలు ఇటు రిస్కులను సమర్ధంగా ఎదుర్కొంటూనే అటు వృద్ధి సాధించగలమనే ధీమాతో ఉన్నాయి. ఇందులో 66 శాతం సంస్థలు అత్యంత ధీమాగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఈ గణాంకాలు వరుసగా 91 శాతం, 40 శాతంగా ఉన్నాయి.
- టెక్నాలజీల్లో విప్లవాత్మక మార్పులను రిసు్కలుగా కాకుండా అవకాశాలుగా భారతీయ వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి. 69 శాతం దేశీ ఎగ్జిక్యూటివ్‌లు జనరేటివ్ ఏఐని ముప్పుగా కాకుండా అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా వీరి సంఖ్య 60 శాతంగా ఉంది.
ఇదీ చదవండి: చనిపోయినా సంపద సేఫ్..! కానీ..
- రిస్క్ మేనేజ్‌మెంట్ కోసం జెనరేటివ్ ఏఐలాంటి కొత్త టెక్నాలజీలను కూడా కంపెనీలు పెద్ద యెత్తున వినియోగించుకుంటున్నాయి. ఆటోమేటెడ్ రిస్క్ అసెస్‌మెంట్, స్పందన కోసం 48 శాతం దేశీ సంస్థలు ఏఐ, మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇది 50 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment