బరాక్ ఒబామా, జో బిడెన్ ,ఎలాన్ మస్క్
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న ఏడాదిలోనే సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. రాజకీయ ప్రముఖులు, టెక్నాలజీ మొఘల్స్, సంపన్నులే లక్ష్యంగా వారి ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, మీడియా మొఘల్ మైక్ బ్లూమ్‌బర్గ్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తోపాటు యాపిల్, ఉబర్ వంటి సంస్థల అకౌంట్లు బుధవారం హ్యాక్ అయ్యాయి. వారి అధికారిక ఖాతాలలో హఠాత్తుగా అనుమానాస్పద పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.
ఈ పోస్టులన్నీ క్రిప్టో కరెన్సీకి సంబంధించినవే కావడం గమనార్హం. బిట్‌కాయిన్ సైబర్ నేరగాళ్లు చేసిన ఈ పనితో ట్విట్టర్ వణికిపోయింది. ‘‘వచ్చే 30 నిమిషాల్లో నాకు వెయ్యి డాలర్లు పంపండి. నేను తిరిగి 2 వేల డాలర్లు పంపుతాను’’అంటూ బిట్‌కాయిన్ లింక్ అడ్రస్ ఇస్తూ ప్రముఖుల అధికారిక ఖాతాలలో ట్వీట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆ ట్వీట్లు మూడు, నాలుగు గంటలసేపు ఉన్నాయి. హ్యాక్ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ట్విట్టర్ యంత్రాంగం పోస్టులన్నింటినీ తొలగించి తాత్కాలికంగా ఆ ఖాతాలను నిలిపివేసింది. భద్రతా పరమైన అంశాలను పరీక్షించి అకౌంట్లను పునరుద్ధరించింది.
బిట్‌కాయిన్ వాలెట్‌లోకి లక్షకు పైగా డాలర్లు
సోషల్ మీడియా చరిత్రలోనే అతి పెద్దదైన ఈ హ్యాకింగ్ ద్వారా బిట్‌కాయిన్ వాలెట్‌లోకి లక్షా12 వేలకు పైగా డాలర్లు వచ్చి చేరాయని అంచనా. ఒకసారి గుర్తు తెలియని వాలెట్లలోకి వెళ్లిన మొత్తాన్ని తిరిగి రాబట్టడం అసాధ్యమని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ‘‘మా సంస్థకు ఇవాళ గడ్డుదినం. ఈ దాడి అత్యం త భయానకమైనది. ఏం జరిగిందో విచారించి ట్విట్టర్‌లో భద్రతాపరమైన లోపాలను పరిష్కరిస్తాం’’అని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే ట్వీట్ చేశారు.
ఎలా హ్యాక్ చేశారంటే
బిట్‌కాయిన్ సొమ్ముల్ని రెట్టింపు చేసుకోండంటూ గతంలోనూ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి కానీ, ఇలా పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల ఖాతాలు హ్యాక్ కావడం ఇదే మొదటిసారి. దీనిని సమన్వయ సామాజిక ఇంజనీరింగ్ దాడిగా ట్విట్టర్ సపోర్ట్ టీమ్ అభివర్ణించింది. ట్విట్టర్‌లో అంతర్గతంగా ఉండే వ్యవస్థలు, టూల్స్ సాయంతో హ్యాకర్లు ట్విట్టర్ ఉద్యోగుల అడ్మినిస్ట్రేషన్ ప్రివిలేజెస్ సంపాదించారు. దాని ద్వారా ప్రముఖుల పాస్‌వర్డ్‌లు తెలుసుకొని మెసేజ్‌లు పోస్టు చేశారని ట్విట్టర్ సపోర్ట్ టీమ్ తెలిపింది. వీలైనంత త్వరగా డబ్బులు సంపాదించడమే వారి లక్ష్యమని ఇలాంటి స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment