జాతి వివక్షపై ధిక్కార స్వరం, వలసవాదులపై ఉదారవాదం, చట్టసభల్లో ప్రశ్నించే తత్వం, వాదనా పటిమతో ప్రత్యర్థుల్ని తికమకపెట్టే సామర్థ్యం, అద్భుతమైన నాయకత్వ లక్షణం.. ఇవే కమలా హ్యారిస్ రాజకీయ జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. అమెరికా అధ్యక్షురాలు కావాలన్న కల తీరకపోయినా, ఎప్పటికైనా అనుకున్నది సాధించగలనన్న ఆత్మవిశ్వాసం ఆమెలో నిండిపోయింది. ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం ఒక చరిత్ర సృష్టించింది. ఆ చరిత్ర తిరగరాయడానికి బాటలు కూడా వేస్తోంది.
భారత సంతతి మహిళకు గొప్ప గౌరవం లభించింది. అమెరికా ప్రభుత్వంలో రెండో అత్యున్నత పదవిని అలంకరించే అవకాశం తలుపు తట్టింది. డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత మూలాలున్న కమలా హ్యారిస్ ఎంపికయ్యారు. విశేష రాజకీయ అనుభవం, గొప్ప పాలనా చాతుర్యం, అద్భుతమైన వాదనాపటిమ ఉన్న కమలా హ్యారిస్‌ను తన లెఫ్ట్‌నెంట్‌గా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఎంచుకున్నారు. కమలా హ్యారిస్ తండ్రి డొనాల్డ్ హ్యారిస్‌ది జమైకా. తల్లి శ్యామల గోపాలన్ ఇండియన్(చెన్నై). అలా ఆఫ్రో, ఆసియన్ మూలాలున్న కమల ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్నారు.
జో బైడెన్ ప్రచార వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిని, పాలనా తీరును, వలస విధానాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపిక వ్యూహాత్మకంగా మంచి నిర్ణయంగా భావిస్తున్నారు. అమెరికా ఓటర్లలో కీలకమైన భారతీయులు సహా ఆసియన్లు, ఆఫ్రికన్ల ఓట్లను ఆమె కచ్చితంగా ప్రభావితం చేయగలరన్న అభిప్రాయం యూఎస్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తాజా నిర్ణయంతో బైడెన్ ప్రచారం మరింత ఊపందుకునే అవకాశముందని భావిస్తున్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపిక అత్యుత్తమం అని మాజీ అధ్యక్షుడు, డెమొక్రాటిక్ పార్టీ నేత బరాక్ ఒబామా.. మేమిద్దరం కలిసి ట్రంప్‌ను ఓడించబోతున్నాం అని జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఈ అవకాశం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని కమలా హ్యారిస్ పేర్కొన్నారు.
వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన కమలాదేవి హ్యారిస్‌కు అరుదైన గౌరవం లభించింది. ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ల అభ్యర్థిగా కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ ఎంపికయ్యారు. నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మహిళలు, నల్లజాతీయులు, ప్రవాస భారతీయుల ఓట్లను కొల్లగొట్టే వ్యూహంలో భాగంగానే కమలా హ్యారిస్ ఎంపిక జరిగింది. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న జో బైడెన్ మంగళవారం నాడు కమలా హ్యారిస్‌ను ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటిస్తూ డెమొక్రాట్ సహచరులందరికీ మెసేజ్‌లు పంపించారు. ఒక నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా తొలిసారి ఎంపిక చేసి బైడెన్ చరిత్ర సృషించారు. 55 ఏళ్ల కమలా హ్యారిస్ ఎన్నికల్లో నెగ్గితే అమెరికా ఉపాధ్యక్ష పదవికి మొట్టమొదటి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా. మొదటి ఆసియా అమెరికన్‌గా రికార్డులకెక్కుతారు. భారతీయ– జమైకా మూలాలున్న కమల ప్రస్తుతం బైడెన్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు.
భయం లేని పోరాటయోధురాలు: బైడెన్
కమలా హ్యారిస్‌ను భయం బెరుకు లేని పోరాటయోధురాలిగా, దేశంలో అత్యద్భుతమైన ప్రజాసేవకురాలిగా బైడెన్ అభివర్ణించారు. ‘‘కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేశాను. ఎన్నికల ప్రక్రియలో ఆమె నాకు అత్యుత్తమ భాగస్వామి. మేమిద్దరం కలిసి ట్రంప్‌ని ఓడించబోతున్నాం. హ్యారిస్‌కు పార్టీ సహచరు లందరూ ఘనంగా స్వాగతం పలకండి’’అని తన సందేశంలో బైడెన్∙పేర్కొన్నారు. ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపిక చేయడం తనకు దక్కిన అత్యంత గౌరవం అని కమలా హ్యారిస్ అన్నారు.
ఒబామా సలహా మేరకే !
కమలా హ్యారిస్‌ను ఎంపిక చేయడానికి జో బైడెన్ పార్టీలో అందరితోనూ విస్తృతంగా సంప్రదించారు. ఉపాధ్యక్ష పదవికి మహిళనే ఎంపిక చేస్తానని గతంలోనే ఆయన ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మరికొందరు పార్టీ ప్రతినిధులతో కూడిన బోర్డు కమలా హ్యారిస్‌ను ఎంపిక చేయాలని సలహా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కమల అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే ఒబామా హర్షం వ్యక్తం చేశారు. ‘‘దేశానికి ఇవాళ ఎంతో శుభ దినం. ఒక సెనేటర్‌గా కమలా హ్యారిస్ నాకు చాలా కాలంగా తెలుసు. మన రాజ్యాంగాన్ని కాపాడడానికి ఆమె జీవితాన్నే ధారపోస్తున్నారు. కమలా హ్యారిస్‌ను గెలిపించుకుందాం‘‘అని ట్వీట్ చేశారు. కాగా, కమలా హ్యారిస్ ఎంపికపై అధ్యక్షుడు ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక సెనేటర్‌గా హ్యారిస్ అత్యంత భయంకరమైన వ్యక్తి అని తీవ్రంగా విమర్శించారు.
కమలా ఎంపికకి కారణాలివే !
అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఒక మహిళను అందులోనూ నల్లజాతీయురాలిని, ప్రవాస భారతీయురాలిని ఎంపిక చేయడానికి ఎన్నో కారణాలున్నాయి. ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో ఆఫ్రికన్ అమెరికన్లు, ఎన్నారైలు, ఏ పార్టీకి చెందని తటస్థుల ఓట్లు కొల్లగొట్టాలంటే హ్యారిసే సరైన ఎంపికన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కమలా దేవి హ్యారిస్ మాటలు తూటాల్లా పేలతాయి. ఒక అటార్నీ జనరల్‌గా, ప్రజాప్రతినిధిగా ఆమె వాదనా పటిమకి ప్రత్యర్థి ఎంతటివాడైనా చిత్తయిపోవాల్సిందే. జాతి వివక్ష పోరాటాల్లో, వలసదారులకి అండగా నిలవడంలో కమలా హ్యారిస్ చురుకైన పాత్ర పోషించారు.
అన్నింటికి మించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని సమర్థంగా ఢీ కొనే సత్తా కలిగిన నాయకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. కరోనా వైరస్ ఎదుర్కోవడంలో ట్రంప్ సర్కార్ వైఫల్యాలను, సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా లైంగిక వివాదాల్లో చిక్కుకున్న బ్రెట్‌ని నియమించిన సమయంలోనూ కమలా హ్యారిస్ కాంగ్రెస్ సమావేశాల్లో తన వాక్పటిమతో అందరినీ ఆకర్షించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ప్రిలిమినరీ స్థాయి ఎన్నికల్లో కమలా పోటీ పడినప్పుడు ఆమెలోని నాయకత్వ లక్షణాలు బయటకు వచ్చాయి. బైడెన్ వయసు 77 ఏళ్లు కావడంతో చురుగ్గా ఉంటూ, ప్రగతిశీల భావాలు కలిగిన వారినే ఎంపిక చేయాలని ఆయన భావించారు. ఇవన్నీ కమలకి కలిసొచ్చాయి.
వారి ఓట్లే కీలకం
అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్ ఓట్లు 13శాతం ఉన్నాయి. ఒకే పార్టీకి మద్దతుగా నిలవని రాష్ట్రాల్లో వీరి ఓట్లు అత్యంత కీలకం. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అధ్యక్ష ప్రిలిమినరీ ఎన్నికల్లో అత్యధిక రాష్ట్రాల్లో ఆఫ్రికన్ అమెరికన్లు జో బైడెన్‌కే మద్దతు పలికారు. అప్పట్నుంచి నల్లజాతికి చెందిన వారినే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అమెరికా పోలీసు అధికారి దాష్టీకానికి బలైపోయిన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనల్లో హ్యారిస్ చురుకైన పాత్ర పోషించారు.
ఇక కమలా దేవికున్న భారతీయ మూలాలు కూడా ఆమెను ఎంపిక చేయడానికి కారణమే. ఈసారి ఎన్నికల్లో 13 లక్షల మంది ఇండియన్ అమెరికన్లు ఓటు హక్కు వినియోగించుకుంటారని ఒక అంచనా. పెన్సిల్వేనియాలో 2 లక్షలు, మిషిగావ్‌లో లక్షా 25 వేల ఎన్నారై ఓట్లు ఉన్నాయి. ఆ రెండు రాష్ట్రాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకం. 2016లో 77% మంది ఇండియన్ అమెరికన్లు డెమోక్రట్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కి ఓటు వేశారని అంచనాలున్నాయి. ఇవన్నీ కమలా రాజకీయ జీవితాన్నే మలుపు తిప్పాయి.
అమ్మ చెప్పిన మాట
‘ఊరకే కూర్చొని ఫిర్యాదులు చేయడం మానెయ్. ఏదో ఒకటి చేయడం ప్రారంభించు’’. తల్లి శ్యామల గోపాలన్ ఉపదేశించిన ఈ మంత్రాన్ని ఇప్పటికీ తు.చ. తప్పకుండా పాటిస్తోంది డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్. అవే ఆమెను ఇప్పుడీ స్థాయిలో నిలబెట్టాయి. ప్రతీ రోజూ ఆ మాటలే గుర్తు చేసుకుంటూ స్ఫూర్తిని పొందుతూ ఉంటానని కమల గర్వంగా చెప్పుకుంటారు. ఆమె తండ్రి డేవిడ్ హ్యారిస్ జమైకా దేశస్తుడు. తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు. చెన్నైకి చెందిన కేన్సర్ పరిశోధకురాలు, పౌరహక్కుల ఉద్యమకారిణి. ఆరు దశాబ్దాల క్రితమే శ్యామల అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడే డేవిడ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి కమల, మాయ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కమల చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. దీంతో ఆమె బాల్యమంతా హిందూ తల్లి సంరక్షణలోనే గడిచింది. అందుకే భారతీయ తత్వాన్ని ఆకళింపు చేసుకున్నారు. నల్లజాతీయుల కష్టాలను అర్థం చేసుకున్నారు. ‘‘అమెరికా మమ్మల్ని బ్లాక్ గర్ల్స్‌గానే చూస్తుందని మా అమ్మకి బాగా తెలుసు. అందుకే మమ్మల్ని ఆత్మవిశ్వాసంతో పెంచింది. నల్లజాతీయురాలినని చెప్పుకోవడానికి నేను గర్వపడతాను’’అని కమలా హ్యారిస్ తన ఆటోబయోగ్రఫీ ది ట్రూత్స్ వి హోల్డ్‌లో రాసుకున్నారు. తన సహచర లాయర్ డగ్లస్ ఎమాఫ్‌ను పెళ్లాడారు. డగ్లస్‌కు మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. వారిద్దరూ వీరితోనే ఉంటారు. ఎలా, కోల్ అనే ఆ ఇద్దరు పిల్లల ప్రేమ తనకెంతో శక్తినిస్తుందని కమల చెప్తారు.
నేను అమెరికన్‌నే
కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న ఓక్లాండ్‌లో జన్మించారు. బెర్కెలేలో పెరిగారు. కెనడాలో పాఠశాల విద్యనభ్యసించారు. వాషింగ్టన్ హోవార్డ్ యూనివర్సిటీలో డిగ్రీ, కాలిఫోర్నియా వర్సిటీలో లా చదివారు. శానిఫ్రాన్సిస్కోలో పెద్ద ప్రాసిక్యూటర్‌గా ఎదిగారు. 2010లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. అటార్నీ జనరల్‌గా ఆమె ప్రదర్శించిన వాక్పటిమ రాజకీయ జీవితానికి పునాదిగా మారింది. 2017లో జరిగిన ఎన్నికల్లో కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు. సెనేట్‌లో కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత సంతతి మహిళ ఆమె. ఇద్దరు వలసదారులకు పుట్టినప్పటికీ తనని తాను అమెరికన్‌గానే హ్యారిస్ చెప్పుకుంటారు.
అధ్యక్షురాలు కావాలని కలలు
సెనేటర్‌గా పేరు తెచ్చుకున్న కమలా అమెరికా అధ్యక్షురాలు కావాలని కలలు కన్నారు. జో బైడెన్‌తోనే పోటీపడ్డారు. తనవాదనా పటిమతో బైడెన్‌ను ఇరుకున పెట్టారు. ఆయన్ను జాతి విద్వేషిఅంటూ తిట్టిపోశారు. కానీ బైడెన్ ధాటికి నిలబడలేక రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కొద్ది నెలలకే బైడె గెలుపునకు కృషి చేస్తానని ప్రకటించారు. ఈసారి ఉపాధ్యక్షురాలిగా కమలా నెగ్గితే 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడే అవకాశం ఉంటుంది. ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మూడో మహిళ కమల.
ఇడ్లీ సాంబార్ అంటే ప్రాణం
కమలాకు భారతీయ రుచులు అంటే అమితమైన ఇష్టం. ఇడ్లీ సాంబారు ఇష్టంగా లాగించేస్తారు. చిన్నతనంలో పప్పు, బంగాళదుంపల వేపుడు, పెరుగన్నం తింటూనే ఆమె పెరిగారు. తల్లితో కలిసి తరచూ చెన్నైకి వస్తూ ఉండేవారు. తాత పీవీ గోపాలన్ ప్రభావం తనపై ఉందని బయోగ్రఫీలో హ్యారిస్ రాసుకున్నారు.
తల్లి శ్యామలతో కమల (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment