వాషింగ్టన్: నోటి దురుసుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా మరోసారి ఆయన నోరు పారేసుకున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాట్ అభ్యర్థిగా ఎంపికైన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అర్హతను ప్రశ్నించడమే కాక.. జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఆమె ఒక నల్లజాతి మహిళ. తల్లిదండ్రలు ఇక్కడకు వలస వచ్చారు. నేను విన్నది ఏంటంటే ఆమె ఇక్కడ జన్మించలేదు. అలాంటి వ్యక్తి అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా పనికిరాదు. వైట్‌హౌస్ అవసరాలను తీర్చడానికి ఆమె అర్హురాలు కాదు’ అంటూ జాత్యంకార వ్యాఖ్యలు చేశారు ట్రంప్. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ్వడానికి ఆమెకు అర్హత లేదన్నారు. ట్రంప్ తన వ్యాఖ్యలతో ఆన్‌లైన్ మిస్‌ఇన్‌ఫర్‌మేషన్ క్యాంపెయిన్‌కు ఆజ్యం పోసినట్లయ్యింది అంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతోనే ట్రంప్ రాజకీయాల్లో ఎదిగారని విమర్శిస్తున్నారు. (బైడెన్ తెలివైన నిర్ణయం)
అయితే ట్రంప్ వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ్వడానికి కమలా హ్యారిస్‌కు అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు నెటిజనులు. ఆమె కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జన్మించారని.. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ్వడానికి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు. ఆమె వివరాలను పరిశీలించిన న్యాయవాదులు కూడా దీని గురించి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు. ఈ క్రమంలో లయోలా లా స్కూల్ ప్రొఫెసర్ జెస్సికా లెవిన్సన్ ‘చాలు ఆపండి, ముగించండి. అది ఏదైనా సరే.. నిజాయతీగా ఉండండి. ఇక్కడ రంగు, తల్లిదండ్రులు గురించిన వ్యాఖ్యలు అనవసరం. పైగా ఇవి పూర్తిగా జాత‍్యంహకార వ్యాఖ్యలు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జో బిడెన్ కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా ప్రకటించిన కొద్దిసేపటికే ట్రంప్ తన అక్కసును వెల్లగక్కడం గమనార్హం. (ట్రంప్ అధ్యక్ష పదవికి తగడు)
గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి కూడా ట్రంప్ ఇలానే ప్రచారం చేశారు. ఆయన కెన్యాలో జన్మించారని.. అధ్యక్షుడిగా ఎన్నికవ్వడానికి అర్హత లేదని ట్రంప్ ఆరోపించారు. దాంతో ఒబామా తాను హవాయిలో జన్మించినట్లు చూపిస్తూ తన జనన ధృవీకరణ పత్రాన్ని విడుదల చేశారు. అయినా కూడా ట్రంప్ అది ఫేక్ సర్టిఫికెట్ అంటూ రాద్దాంతం చేశారు. ఆ తర్వాత 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దీని గురించి ట్రంప్‌ను ప్రశ్నిస్తే.. అది ఎప్పుడో అయిపోయిందని.. ఒబామా ఇక్కడే జన్మించాడని వ్యాఖ్యనించడం విశేషం. తాజాగా కమలా హ్యారిస్ విషయంలో కూడా ట్రంప్ తప్పుడు ప్రచారానికి ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment