ఓటర్లను గందరగోళ పరుస్తున్న ఫేక్ వీడియోలు
ఎన్నికల ప్రక్రియపై పెను ప్రభావం!
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను ఉపాధ్యక్షురాలు, సొంత పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ విమర్శిస్తున్న వీడియో..
విమర్శకులను ఏకిపారేస్తూ, ఎల్జీబీటీక్యూలను తిట్టి పోస్తూ బైడెన్ ఫోన్ కాల్స్ రికార్డులు..
మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ ఫొటో..
... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డీప్ ఫేక్ హల్‌చల్‌కు ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చాక అమెరికాలో జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నికలివి. దానికి తోడు ఏకపక్షంగా సాగేలా కని్పంచిన పోటీ కాస్తా బైడెన్ స్థానంలో హారిస్ రంగప్రవేశంతో హోరాహోరీగా మారింది. ఈ నేపథ్యంలో ఓటర్లను గందరగోళపరచడానికి, ఉద్రిక్తతలను రేకెత్తించడానికి ఏఐ మరింతగా దురి్వనియోగం కావచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
2024 జనవరిలో డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీ సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ గొంతును అనుకరిస్తూ న్యూహ్యాంప్‌షైర్ ప్రజలకు ఫేక్ ఫోన్ కాల్స్ వెళ్లాయి. ప్రైమరీల్లో పాల్గొంటే సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనే అర్హత కోల్పోతారంటూ ఓటర్లను ఆయన హెచ్చరిస్తున్నట్టుగా ఉన్న ఆ ఫేక్ కాల్స్ సంచలనమే సృష్టించాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ– ఆధారిత వాయిస్ రోబోకాల్స్‌పై నిషేధం విధించింది. అలాంటి వీడియోలను సృష్టించినా, ప్రసారం చేసినా సదరు కంపెనీలకు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయినా డీప్ ఫేక్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది.
బైడెన్‌ను మూర్ఖుడన్న కమల
కుబేరుడు మస్క్ ఎక్స్‌లో షేర్ చేసిన కమల డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయింది. బైడెన్ మూర్ఖుడని, దేశాన్ని నడపడం ఆయనకు తెలీదని కమల అన్నట్టు ఆ వీడియోలో ఉంది. ఒక్క స్మైలీ ఎమోజీని మినహాయిస్తే అది పేరడీ అనడానికి ఆ వీడియోలో ఎటువంటి సంకేతాలూ లేవు. ఇలాంటివాటి ప్రభావం తటస్థ ఓటర్లపై చాలా ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
విమర్శకులను తిట్టినట్టుగా...
బైడెన్ అధ్యక్ష బరి నుంచి తప్పుకుని తనకు బదులుగా హారిస్‌ను అభ్యరి్థత్వాన్ని సమరి్థంచే క్రమంలో తన విమర్శకులను విపరీతంగా తిట్టిపోయడమే గాక ఎల్జీబీటీక్యూలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు, ఓ మానిప్యులేటెడ్ వీడియో పీబీఎస్ మీడియా సంస్థ లోగోతో సహా తెరపైకి వచి్చంది. దాంతో పీబీఎస్ టెలివిజన్ సంస్థ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. అసలు వీడియోను తమ చానల్లో లైవ్ ప్రసారం చేసింది. అది నిజానికి జూలై 13న ట్రంప్‌పై హత్యాయత్నం తర్వాత రాజకీయ హింసను ఖండిస్తూ బైడెన్ మాట్లాడిన వీడియో. వీక్షకులను మోసగించేందుకు తమ లోగోను వాడుతూ డీప్ ఫేక్ వీడియో చేసినట్టు పీబీఎస్ తేలి్చంది.
ట్రంప్ అరెస్టు!
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లింపుల రికార్డులను తారుమారు చేసిన కేసులో ట్రంప్‌ను కోర్టు దోషిగా తేల్చాక పోలీసులు ఆయనను బలవంతంగా అరెస్టు చేసినట్లు కొన్ని వారాల క్రితం ఒక ఫొటో వైరలైంది. అది కూడా డీప్ ఫేక్ బాపతేనని డిజిటల్ ఫోరెన్సిక్స్ నిపుణులు తేల్చారు.
తప్పుడు ట్వీట్లతో..
వీటికి తోడు తప్పుడు ట్వీట్లను సృష్టించి ఓటింగ్‌నే తారుమారు చేసే ఏఐ చాట్‌బాట్ సామర్థ్యాన్ని సివ్‌ఏఐ సంస్థ సహ వ్యవస్థాపకుడు లుకాస్ హాన్సెన్ ప్రదర్శించారు. అందులో అలెన్, టెక్సాస్ ‘పోలింగ్ కేంద్రాలు పార్కింగ్ కోసం ఛార్జ్ చేస్తున్నాయి’ అంటూ ఏఐ టూల్‌కు సందేశమిచ్చారు. అంతే...! అలెన్ అధికారులు చాలా పోలింగ్ కేంద్రాల్లో గప్‌చుప్‌గా 25 డాలర్ల పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారంటూ సెకన్ల వ్యవధిలోనే లక్షల మందికి ట్వీట్లు చేరిపోయాయి.
సమస్యేనంటున్న అమెరికన్లు
ఇలాంటి మోసపూరిత చర్యలు ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఆగ్రహం రగిల్చే ప్రమాదముందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను ఏఐ ఆధారిత అసత్యాలు ప్రభావితం చేస్తాయని 50 శాతానికి పైగా అమెరికన్లు భావిస్తున్నట్టు మీడియా గ్రూప్ ఆక్సియోస్, బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ మారి్నంగ్ కన్సల్ట్ గతేడాది చేసిన పోల్‌లో వెల్లడైంది. దీనిపై 200కి పైగా న్యాయవాద బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఏఐ అసత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు తక్షణం రంగంలోకి దిగాలంటూ టెక్ సీఈఓలకు ఏప్రిల్లో లేఖ రాశాయి. రాజకీయ ప్రకటనల్లో డీప్ ఫేక్స్ వాడకాన్ని నిషేధించాలని, వాస్తవిక ఎన్నికల కంటెంట్‌ను ప్రోత్సహించేలా అల్గారిథంను ఉపయోగించాలని కోరాయి. ఈ నేపథ్యంలో, ఏఐ కంటెంట్‌ను పక్కాగా లేబులింగ్ చేసే దిశగా కృషి చేస్తున్నట్టు టెక్ దిగ్గజాలు చెబుతున్నాయి.
ఆటో టెక్నాలజీ లేదు
ఏఐ ద్వారా సృష్టించే ఫేక్ వీడియో కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ మధ్య తేడాను ఆటోమేటిక్‌గా గుర్తించే టెక్నాలజీ ఏదీ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. దాంతో ఏదైనా కంటెంట్‌పై ఫ్యాక్ట్ చెక్ చేసే లోపే అది వైరల్ అవుతోంది. అది ఫేక్ అని చివరికి తేలినా, అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment