పోటీ నుంచి వైదొలుగుతున్నానని ప్రకటన
దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయమని వెల్లడి
కమలా హ్యారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తాను వైదొలుగుతున్నానని డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి (భారత కాలమాన ప్రకారం) ‘ఎక్స్’ ఖాతాలో ఒక లేఖను పోస్టు చేశారు. దేశ ప్రయోజనాల కోసం, తమ పార్టీ ప్రయోజనాల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేల్చిచెప్పారు.
గత మూడున్నరేళ్లలో ఒక దేశంగా మనం గొప్ప ముందడుగు వేశామని అమెరికా ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. ఎన్నో ఘనతలు సాధించామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రజలకు ఇప్పటిదాకా సేవలందించడం అతి గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.
మరోసారి పోటీ చేయాలన్న ఆలోచన లేదని, అధ్యక్షుడిగా మిగిలిన పదవీ కాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యతలపై దృష్టి పెడతానని పేర్కొన్నారు. వచ్చే వారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తానని, తన నిర్ణయాన్ని పూర్తిగా తెలియజేస్తానని వెల్లడించారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు బైడెన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె అసాధారణమైన భాగస్వామి అని ప్రశంసల వర్షం కురిపించారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా భారతీయ అమెరికన్ మహిళ కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని బైడెన్ బలపరిచారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించటానికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం తథ్యమని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన బైడెన్ అనూహ్యంగా వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో గత నెలలో జరిగిన డిబేట్‌లో బైడెన్ తడబడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వయసు కారణంగా మతిమరుపు సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలంటూ బైడెన్‌పై సొంత పార్టీ నాయకులు ఒత్తిడి పెంచారు. అందుకే ఆయ న ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముంచిన డిబేట్
సీఎన్‌ఎన్ ఛానల్ వేదికగా జూన్ 27న డొనాల్డ్ ట్రంప్– జో బైడెన్‌ల మధ్య తొలి అధ్యక్ష చర్చ జరిగింది. ఈ చర్చలో బైడెన్ పదేపదే తడబడటం, మాటల కోసం తడుముకోవడం, మతిమరుపుతో పేలవ ప్రదర్శన కనబరిచారు. దాంతో 81 ఏళ్ల బైడెన్ మానసిక ఆరోగ్యంపై అమెరికన్లలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సొంత డెమొక్రాటిక్ పార్టీలోనూ ఆయన సామర్థ్యంపై సందేహాలు తీవ్రమయ్యాయి. ట్రంప్‌ను బైడెన్ ఓడించలేడనే బలమైన అభిప్రాయం పారీ్టలో నెలకొంది.
ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ... బైడెన్‌తో మాట్లాడుతూ డెమొక్రాటిక్ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడమే మేలని కుండబద్ధలు కొట్టారు. ప్రతినిధుల సభ, సెనేట్‌లలోనూ డెమొక్రాట్లకు అపజయాలు ఎదురవుతాయని హెచ్చరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం పలువురు డెమొక్రాటిక్ కీలక నాయకులతో ప్రైవేటు సంభాషణల్లో బైడెన్ వైదొలిగితేనే ట్రంప్‌ను ఓడించే అవకాశాలుంటాయని చెప్పారు.
ఐదుగురు చట్టసభ సభ్యులు బైడెన్ వైదొలగాలని బాహటంగానే డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా డెమొక్రాటిక్ పారీ్టకి విరాళాలు ఇస్తున్న దాతలు.. బైడెన్ తప్పుకోవాలని షరతు పెడుతూ విరాళాలను నిలిపివేశారు. దాంతో నాన్సీ పెలోసీ రంగంలోకి దిగి తెరవెనుక పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. బైడెన్ శిబిరానికి వాస్తవాన్ని తెలియజెప్పారు. అన్నివైపులా నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో కోవిడ్‌తో డెలావెర్‌లోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న బైడెన్ ఆదివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు
ప్రకటించారు.
ఇప్పుడేంటి?
ఓపెన్ కన్వెన్షన్.. కమలకు ఛాన్స్
బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంతో నవంబరు 5 జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి ఎవరవుతారనే ఆసక్తి నెలకొంది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మొగ్గు కనపడుతున్నా.. పార్టీ నిబంధనావళి ప్రకారం ఓపెన్ కన్వెన్షన్ (ఎవరైనా పోటీపడవచ్చు) జరుగుతుంది. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థని ఎన్నుకోవడానికి రాష్ట్రాల వారీగా నిర్వహించిన ప్రైమరీల్లో బైడెన్ తిరుగులేని మెజారిటీని కూడగట్టుకున్నారు.
4,000 పైచిలుకు డెలిగేట్లలో 3,900 మంది డెలిగేట్లను బైడెన్ గెల్చుకున్నారు. నిబంధనల ప్రకారం ఆగస్టులో అధ్యక్ష అభ్యరి్థని ఖరారు చేయడానికి జరిగే జాతీయ కన్వెన్షన్‌లో వీరిందరూ బైడెన్‌కు బద్ధులై ఉండాలి. ఇప్పుడాయనే స్వయంగా రేసు నుంచి వైదొలిగారు కాబట్టి.. డెమొక్రాటిక్ టికెట్ కోసం పార్టీ సభ్యులెవరైనా పోటీపడొచ్చు. దీన్నే ఓపెన్ కన్వెన్షన్ అంటారు.
కమలా హారిస్‌కు అవకాశాలు మెరుగ్గా ఉన్నా.. డెమొక్రాటిక్ పార్టీలోని ముఖ్యనేతలైన కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, మిషిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్‌లు ఆమెకు ప్రధాన పోటీదారులుగా ఉంటారని భావిస్తున్నారు. నామినేషన్ జాబితాలో పేరు లేనప్పటికీ డెలిగేట్లు తమకు నచి్చన అభ్యరి్థకి ఓటు వేసే వీలు కూడా ఉంది. నాలుగు వేల పైచిలుకు డెలిగేట్లు ఆగస్టులో తమ తదుపరి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. తొలిరౌండ్‌లో ఫలితం తేలకపోతే 700 మంది సూపర్ డెలిగేట్లను ఓటు వేయడానికి అనుమతిస్తారు. డెమొక్రాటిక్ నామినీ ఎన్నికయ్యేదాకా ఓటింగ్ కొనసాగుతుంది. ముమ్మర లాబీయింగ్, తెరవెనుక మంత్రాంగాలు జరగడం ఖాయం.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment