ప్రపంచాన్ని వణికిస్తున్న సైబర్ దాడులు ఇప్పట్లో ఆగేలా లేవు. తాజాగా దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ రెస్టారెంట్ గైడ్ జొమాటో హ్యాకర్ల బారిన పడింది.
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న సైబర్ దాడులు ఇప్పట్లో ఆగేలా లేవు. తాజాగా దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ రెస్టారెంట్ గైడ్ జొమాటో హ్యాకర్ల బారిన పడింది. ఈ యాప్‌కు సంబంధించిన 1.7 కోట్ల ఖాతాదారుల సమాచారం చోరీకి గురైంది. ఇందులో కీలకమైన పాస్‌వర్డ్స్, ఈమెయిల్ ఐడీలు, చిరునామాల వంటివి ఉన్నట్టు సంస్థ గురువారం ప్రకటించింది.
ఇటీవల తనిఖీలు చేస్తున్న సందర్భంగా తమ నిపుణుల బృందం డేటా చోరీ విషయాన్ని గుర్తించిందని తెలిపింది. అయితే ఈ హ్యాకింగ్ ఎప్పుడు జరిగింది... ఇది ర్యాన్సమ్‌వేర్ వాన్నాక్రై దాడా... కాదా అన్నది సంస్థ వెల్లడించలేదు. అయితే ఖాతాదారుల క్రెడిట్ కార్డు సమాచారం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దాన్ని అత్యున్నత భద్రతా ప్రమాణాలున్న పీసీఐ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్‌లో భద్రపరిచామని జొమాటో వెల్లడించింది.