
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న డా.రుద్రమూర్తి్త. చిత్రంలో జయేశ్ రంజన్, తమీర్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు పెట్రేగి పోతున్నా ఇజ్రాయెల్ మాత్రం ఈ దాడుల బారిన ఎక్కువగా పడటం లేదు. ఇందుకు అక్కడి నిర్బంధ మిలటరీ సేవలే కారణం’ అని బ్రిగేడియర్ జనరల్ డోరన్ తమీర్ వెల్లడించారు. సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటుచేసిన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ ‘సైబర్ సెక్యూరిటీ కాన్‌క్లేవ్ 3.0’ జరిగింది. ఈ సదస్సులో తమీర్ కీలక ఉపన్యాసం చేశారు.
సైబర్ సెక్యూరిటీ రంగంలో ఇజ్రాయెల్ వేగంగా ముందుకు వెళ్తోందని, ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమ వర్గాలు.. అన్నీ సమన్వయం తో పనిచేస్తుండటం ఇందుకు కారణమన్నారు. ఐటీ ఆధారిత మౌలిక సదుపాయాల వ్యవస్థల్లోని లోపాల కారణంగా ప్రపంచం ప్రతిక్షణం సైబర్ దాడుల ముప్పును ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు సైబర్ దాడుల నుంచి ఈ వ్యవస్థలను రక్షించుకోవడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయని, అయితే కార్పొరేట్ సంస్థలు అప్‌డేట్ కావడం లేదన్నారు.
సైబర్ సెక్యూరిటీలో ప్రత్యేక విధానం..
సైబర్ సెక్యూరిటీ విషయంలో దేశంలో ప్రత్యేక విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ ఇప్పటికే రికార్డు సాధించిందని ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. ఇటీవలి ‘వనా క్రై ర్యాన్‌సమ్ వేర్’ దాడులను సైబర్ సెక్యూరిటీ నిపుణులు, పోలీసుల సాయంతో సమర్థంగా తిప్పికొట్టగలిగామని పేర్కొన్నారు.
కేంద్ర హోం శాఖ సీఐఎస్‌వో డాక్టర్ రుద్రమూర్తి మాట్లాడుతూ, దేశ ప్రజలందరికీ సురక్షితమైన ఐడెంటిటీని అందించిన ఆధార్ వ్యవస్థ ఇప్పటివరకూ హ్యాక్ కాలేదని.. పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేసిన నిపుణులు ప్రశంసనీయులని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌సీఎస్‌సీ అధ్యక్షుడు భరణీ అలోర్, సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.