ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రకటించింది. ఉక్రెయిన్‌కు మూడువైపుల బలగాల్ని మోహరించింది. ఉక్రెయిన్‌కు సరిహద్దులకు యుద్ధ ట్యాంక్‌లను పంపించింది. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలకు తమ బలగాల్ని పంపిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ మరో ప్రమాదం అంచున పడినట్లు తెలుస్తోంది.
సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈఎస్ఈటీ నివేదిక ప్రకారం..ఉక్రెయిన్‌ను టార్గెట్ చేస్తూ ఆ దేశ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన కంప్యూటర్లలో ప్రమాదకరమైన వైరస్‌ను పంపినట్లు తేలింది. గత రెండు నెలలుగా దేశంలోని వందలాది కంప్యూటర్లలో ఈ వైరస్‌ను ఇన్‌స్టాల్ చేసినట్లు వెల్లడించింది. ఈ వైరస్ సాయంతో హ్యాకర్లు ఉక్రెయిన్ కు సంబంధించిన దేశ అంతర్గత మిలటరీ రహస్యాలు, ఇరుదేశాలతో ఉన్న సత్సంబంధాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని సమాచారం.
మరోవైపు రష్యా తన సరిహద్దుల చుట్టూ దళాలను మోహరించడంతో ఉక్రెయిన్ ఇప్పటికే గత కొన్ని వారాలుగా హ్యాకర్ల బారిన పడుతోంది. ఈ వారం మాస్కో తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు దళాలను ఆదేశించిన తర్వాత పూర్తి స్థాయి హ్యాకింగ్ భయాలు పెరిగాయి. దీంతో వైరస్ దాడుల్ని ఎవరు చేశారనే విషయాన్ని తెలుసుకునేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రయత్నాల్లో భాగంగా హెర్మెటికా డిజిటల్ లిమిటెడ్ అనే కంపెనీకి జారీ చేసిన సర్టిఫికెట్ తో వైపింగ్ సాఫ్ట్‌వేర్ సాయంతో హ్యాకింగ్ కార్యకలాపాలు జరిగినట్లు గుర్తించారు. అయితే దాదాపు ఏడాది క్రితం సైప్రియాట్ రాజధాని నికోసియాలో ఏర్పాటు చేసిన హెర్మెటికా సంస్థ గురించి ఆరా తీయగా.. ఆ కంపెనీ వివరాలు కానీ, వెబ్‌సైట్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
వైరస్ ఎలా పనిచేస్తుంది?
టెక్ నిపుణులు అభిప్రాయం ప్రకారం..ఉక్రెయిన్ కంప్యూటర్లపై దాడి చేసిన సాఫ్ట్‌వేర్...కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌లోని మొత్తం డేటాను చదవలేని విధంగా అందించడం, స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో స్టోర్ చేసిన డేటాను యాక్సెస్ చేసేందుకు వీలు లేకుండా సాఫ్ట్‌వేర్ పనిచేస్తుండగా.. హానికరమైన ప్రోగ్రామ్‌ను కంప్యూటర్ల నుంచి వేరు చేసేందుకు సైబర్ సెక్యూరిటీ నిపుణులు పోటీ పడుతున్నారు.
మాకేం సంబంధంలేదు
ఉక్రెయిన్పై జరుగుతున్న సైబర్ దాడులపై ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులు రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో రష్యా సైబర్ దాడులకు పాల్పడుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ రష్యా మాత్రం ఉక్రెయిన్ ఆరోపణల్ని ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment