జపాన్‌లో ఏటా మంచుగూళ్ల సంబరాలు జరుగుతాయి. నెల్లాళ్ల పాటు జరిగే ఈ సంబరాల్లో జపాన్ ప్రజలు బాగా హిమపాతం జరిగే ప్రదేశాల్లో మంచుగూళ్లు నిర్మించుకుని, వాటిలో గడుపుతూ విందు వినోదాలతో ఓలలాడతారు. ‘యునిషిగవా ఓన్సెన్ కమకురా’ పేరిట జరుపుకొనే ఈ సంబరాలు ‘స్నో హౌస్ ఫెస్టివల్’గా అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందాయి. ఈ ఏడాది ఈ సంబరాలు జనవరి 26 నుంచి ఫిబ్రవరి 25 వరకు జరుగుతున్నాయి.
ఈ సంబరాల్లో మంచు దట్టంగా పేరుకునే ప్రదేశాల్లో ‘ఇగ్లూ’ల మాదిరిగా మంచుతోనే చిన్న చిన్న గూళ్ల వంటి ఇళ్లు నిర్మించుకుని, వాటిలోనే తాత్కాలికంగా బస చేస్తారు. రాత్రివేళ వాటిలో పెద్ద సంఖ్యలో కొవ్వొత్తులు, లాంతర్లు వెలిగించి, పరిసరాలను దేదీప్యమానం చేస్తారు. జపాన్‌లోని షింటో మతస్థుల దేవుడు ‘కమకురా దైమ్యోజిన్’ గౌరవార్థం ఈ సంబరాలను జరుపుకొంటారు. ఈ సంబరాల్లో షింటో మతస్థుల జలదేవత ‘సుయిజిన్’కు ప్రత్యేక పూజలు జరుపుతారు.
జపాన్‌ను పన్నెండో శతాబ్ది నుంచి పద్నాలుగో శతాబ్ది వరకు పరిపాలించిన ‘కమకురా షొగునటే’ పాలకుల కాలం నుంచి షింటో మతస్థులు ఈ వేడుకలను జరుపుకొంటూ వస్తున్నారు. ఆనాటి రాచరిక ఆచార వ్యవహారాలను తలపించేలా ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సంబరాల్లో భాగంగా యోకోటే నగరంలో ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు జరిపే కార్యక్రమాలను జానపద సాంస్కృతిక వారసత్వ కార్యక్రమంగా జపాన్ సాంస్కృతిక శాఖ గుర్తించింది.
ఇవి కూడా చదవండి: కొంపముంచిన స్టంట్: ఏకంగా 29వ అంతస్థు నుంచి
Comments
Please login to add a commentAdd a comment