భూ మార్పిడికి రైతుల మొగ్గు! | Farmers Ideology Was Changing With Rythu Bandhu Scheme | Sakshi
Sakshi News home page

భూ మార్పిడికి రైతుల మొగ్గు!

Published Thu, May 2 2019 1:39 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Farmers Ideology Was Changing With Rythu Bandhu Scheme - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని చూసిన తర్వాత అన్నదాతల ఆలోచనలు మారుతున్నాయి. వ్యవసాయ భూమి ఉండటం ఎంత లాభదాయకమో ఇప్పుడు వారికి తెలిసివస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో వివిధ కారణాల వల్ల వ్యవసాయ భూములను వ్యవసాయేతర వినియోగం (నాన్‌ అగ్రికల్చరల్‌ / నాలా) కోసం మార్పిడి చేసుకున్న రైతులు ఇప్పుడు తిరిగి అవే భూములను వ్యవసాయ భూములుగా మార్చాలంటూ రెవెన్యూ ఉన్నతాధికారులను కోరుతున్నారు. నాన్‌ అగ్రికల్చరల్‌ భూమిని అగ్రికల్చర్‌ భూమిగా మార్చుకునేందుకు పలువురు పట్టాదారులు ముందుకు వస్తున్నారు. గతంలో కంపెనీల నిర్మాణం, లేదా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమనో ముందుగానే అగ్రికల్చర్‌ భూములను నాన్‌ అగ్రికల్చర్‌ భూములుగా మార్పిడి చేసుకున్నారు. దీనికోసం ఆయా రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే ఆ భూములు నాన్‌ అగ్రికల్చర్‌ భూములుగా మారిపోయాయి. ప్రస్తుతం ఆ భూముల్లో కంపెనీల నిర్మాణం చేపట్టకపోవడంతో పాటు, మరికొన్ని భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేయకపోవడంతో చాలా ప్రాంతాల్లో అలాగే ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం పేర ఎకరాకు సంవత్సరానికి రూ.8 వేల చొప్పున గత ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు ఆర్థిక సాయం అందజేసింది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుంచి పెంచిన డబ్బులు అందనున్నాయి. ఎకరాకు ఒక సీజన్‌కు రూ.5 వేల చొప్పున సంవత్సరానికి రూ.10 వేలు రైతుకు అందనున్నాయి. దీంతో పాటు గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతు సాధారణ మరణం పొందినా రూ.5 లక్షల బీమా సౌకర్యం వర్తిస్తోంది. రైతుల పిల్లలకు అగ్రికల్చర్‌ బీఎస్సీ సీట్లలో (పాస్‌ పుస్తకాలు ఉన్నవారికి ) రిజర్వేషన్‌ అవకాశం కూడా ఉంది. అదే మాదిరిగా, బంగారు రుణాలపై కూడా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పెట్టి పొందితే తక్కువ వడ్డీకే రుణాలు అందుతున్నాయి. వాటితో పాటు పంట రుణాలు కూడా బ్యాంకుల నుంచి అతితక్కువ వడ్డీకి వస్తున్నాయి. ఇలా.. వ్యవసాయ భూమి ఉన్న రైతులు ఎన్నో ప్రయోజనాలను పట్టాదారు పాస్‌ పుస్తకాలతో పొందుతున్నారు. దీంతో పలువురు రైతులు తిరిగి తమ ‘నాలా’భూములను రద్దు చేయించుకుని వ్యవసాయ భూములుగా మార్చుకునేందుకు ముందుకు వస్తున్నారు. 

నష్టపోతున్న ‘నాలా’యజమానులు 
కంపెనీల నిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం తమ వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకున్న వారు తాము నష్టపోతున్నామన్న భావనకు వచ్చారు. అగ్రికల్చర్‌ భూమిని నాన్‌ అగ్రికల్చర్‌ భూమిగా ఒక సారి మారిస్తే.. ఇక, ఆ భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉండవు. పైగా ప్రభుత్వం వ్యవసాయ భూములకు అందించే ఎలాంటి పథకాలు కూడా ఆ యజమానులకు వర్తించవు. నాన్‌ అగ్రికల్చర్‌ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పితే ఆ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం నుండి సబ్సిడీ పొందే అవకాశం ఉంది. కానీ అవి ఏర్పాటు చేయని కారణంగా ఇటు సబ్సిడీ రాకపోవడంతో పాటు వ్యవసాయదారులకు ఇచ్చే పథకాలు కూడా వర్తించకపోవడంతో వారు పునరాలోచనలో పడుతున్నారు. దీంతో అగ్రికల్చర్‌ భూములను నాన్‌ అగ్రికల్చర్‌ భూములుగా మార్చుకున్నవారు తిరిగి వ్యవసాయ భూములుగా మార్చుకునేందుకు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకుంటున్నారు. 

సీసీఎల్‌ఏకు దరఖాస్తులు  
నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం చర్లగౌరారం శివారులో గట్టు పద్మావతి, యాపాల వెంకట్‌రెడ్డి అనే ఇద్దరు భూ యజమానుల పేర సర్వే నంబర్‌ 254లో ఆరున్నర ఎకరాల  భూమి ఉంది. గతంలో అక్కడ బయోగ్యాస్‌ ప్లాంట్‌ కోసం తమ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పిడిచేసుకున్నారు. కానీ, అక్కడ ఆ ప్లాంటును నెలకొల్పలేదు. ఫలితంగా ఆ భూమి నాన్‌ అగ్రికల్చరల్‌ భూమిగానే కొనసాగుతోంది. దీంతో వీరు అగ్రికల్చర్‌ భూమిగా మార్చుకునేందుకు సీసీఎల్‌ఏకు దరఖాస్తు చేసుకున్నారు. వీరే కాకుండా.. వివిధ మండలాల నుంచి నాన్‌ అగ్రికల్చర్‌ భూమిని అగ్రికల్చర్‌ భూమిగా మార్చా లంటూ ఏడాది కాలంగా రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారని జిల్లా రెవెన్యూ అధికార వర్గాలు చెబుతున్నాయి. నాన్‌ అగ్రికల్చర్‌ భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకోవాలనుకున్నా.. ప్రభుత్వం ఇచ్చే ఉచిత విద్యుత్‌ను కూడా వాడుకునే అవకాశం ఉండదు.

ప్రత్యేక చట్టంచేయాల్సిందే
అగ్రికల్చర్‌ భూమిని నాన్‌ అగ్రికల్చర్‌ భూమిగా మార్చేందుకు మాత్రమే చట్టం ఉందని, కానీ.. నాన్‌ అగ్రికల్చర్‌ భూమిని తిరిగి అగ్రికల్చర్‌ భూమిగా మార్చేందుకు చట్టం లేదని, దీనికోసం కొత్త చట్టం చేయాల్సిందేనని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు దరఖాస్తులు పెట్టుకుంటున్నారని, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని అధికారవర్గాలు చెప్పాయి. తాజాగా కొందరు సీసీఎల్‌ఏకు దరఖాస్తు చేసుకోగా అక్కడినుంచి నల్లగొండ కలెక్టరేట్‌కు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి కూడా అన్ని వివరాలను సీసీఎల్‌ఏకు రాసి తిరిగి పంపుతున్నట్లు రెవెన్యూ వర్గాలు చెప్పాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement