ఖరీఫ్ ప్రారంభ సమయానికే రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అవుతుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇక సాగు పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన బాధ తప్పిందని అన్నదాతలు సంబరపడుతున్నారు. ఆన్‌లైన్‌లో భూ వివరాలు నమోదైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందనుంది. గత రబీ సీజన్ వరకు ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి సాయాన్ని జమ చేసిన ప్రభుత్వం.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఎకరాకు రూ.5 వేల చొప్పున జమ చేస్తోంది. ప్రభుత్వం గత రబీలో ఎంపిక చేసిన రైతులందరికీ పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. రైతు సమగ్ర సమాచారం సేకరణతో.. సాగులో లేని భూములకు రైతుబంధు వర్తింపజేస్తారో లేదోనని రైతులు ఆందోళన చెందారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
యాచారం(ఇబ్రహీంపట్నం): ఆన్‌లైన్‌లో భూ వివరాలు నమోదైన జిల్లాలోని 2,77,516 మంది రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున జమ చేయడానికి రూ.350 కోట్లు విడుదలయ్యాయి. రెండు రోజుల నుంచి రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి.
ఖరీష్‌కు పెరిగిన రైతుల సంఖ్య...
గత రబీ సీజన్‌లో పెట్టుబడి సాయాన్ని 2,74,000 మంది రైతులకు అందజేస్తే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో అదనంగా 3,500 మంది రైతులు పెరిగారు. జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 2,77,516 ఉండగా, అందులో 2లక్షల 24వేల మంది రైతులకు సంబంధించి భూ వివరాలు, ఆధార్, బ్యాంకు ఖాతాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరిగింది. దాదాపు 20వేల మందికి పైగా రైతులు సరైన వివరాలు అందజేయని కారణంగా రైతుబం«ధు పెట్టుబడి సాయాన్ని కోల్పోతున్నారు. ఆన్‌లైన్ నమోదు కోసం రైతులు రికార్డులు అందజేస్తే వెంటనే వారి ఖాతాలో పెట్టుబడి సాయం నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా భూముల క్రయ, విక్రయాల వల్ల కూడా కొందరి రైతులకు రైతుబంధు అందడం లేదు. భూ వివరాలు తక్షణమే అందజేస్తే ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఖాతాలో పెట్టుబడి సాయం నిధులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఎకరాకు రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంచడం వల్ల రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
రైతులకు ఎంతో మేలు
ప్రభుత్వం రైతులకు మంచి అదునులో రైతుబంధు సాయం జమ చేస్తుండడం సంతోషకరం. 15 ఎకరాల్లో పత్తి సాగుకు రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తున్నా. పెట్టుబడి సాయం అందడం వల్ల అప్పు చేయాల్సిన పరిస్థితి తప్పింది. ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం అందజేస్తుండడంతో రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. – బత్తుల మోహన్‌రెడ్డి, రైతు, మాడ్గుల
Comments
Please login to add a commentAdd a comment