Money transpfers
-
రైతుబంధు సాయం.. రూ.350 కోట్లు
ఖరీఫ్ ప్రారంభ సమయానికే రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అవుతుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇక సాగు పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన బాధ తప్పిందని అన్నదాతలు సంబరపడుతున్నారు. ఆన్లైన్లో భూ వివరాలు నమోదైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందనుంది. గత రబీ సీజన్ వరకు ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి సాయాన్ని జమ చేసిన ప్రభుత్వం.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున జమ చేస్తోంది. ప్రభుత్వం గత రబీలో ఎంపిక చేసిన రైతులందరికీ పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. రైతు సమగ్ర సమాచారం సేకరణతో.. సాగులో లేని భూములకు రైతుబంధు వర్తింపజేస్తారో లేదోనని రైతులు ఆందోళన చెందారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాచారం(ఇబ్రహీంపట్నం): ఆన్లైన్లో భూ వివరాలు నమోదైన జిల్లాలోని 2,77,516 మంది రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున జమ చేయడానికి రూ.350 కోట్లు విడుదలయ్యాయి. రెండు రోజుల నుంచి రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఖరీష్‌కు పెరిగిన రైతుల సంఖ్య... గత రబీ సీజన్లో పెట్టుబడి సాయాన్ని 2,74,000 మంది రైతులకు అందజేస్తే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో అదనంగా 3,500 మంది రైతులు పెరిగారు. జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 2,77,516 ఉండగా, అందులో 2లక్షల 24వేల మంది రైతులకు సంబంధించి భూ వివరాలు, ఆధార్, బ్యాంకు ఖాతాలను ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. దాదాపు 20వేల మందికి పైగా రైతులు సరైన వివరాలు అందజేయని కారణంగా రైతుబం«ధు పెట్టుబడి సాయాన్ని కోల్పోతున్నారు. ఆన్లైన్ నమోదు కోసం రైతులు రికార్డులు అందజేస్తే వెంటనే వారి ఖాతాలో పెట్టుబడి సాయం నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా భూముల క్రయ, విక్రయాల వల్ల కూడా కొందరి రైతులకు రైతుబంధు అందడం లేదు. భూ వివరాలు తక్షణమే అందజేస్తే ఆన్లైన్లో నమోదు చేసి ఖాతాలో పెట్టుబడి సాయం నిధులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఎకరాకు రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంచడం వల్ల రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రైతులకు ఎంతో మేలు ప్రభుత్వం రైతులకు మంచి అదునులో రైతుబంధు సాయం జమ చేస్తుండడం సంతోషకరం. 15 ఎకరాల్లో పత్తి సాగుకు రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తున్నా. పెట్టుబడి సాయం అందడం వల్ల అప్పు చేయాల్సిన పరిస్థితి తప్పింది. ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం అందజేస్తుండడంతో రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. – బత్తుల మోహన్‌రెడ్డి, రైతు, మాడ్గుల -
ఎదురుచూపులే..
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఖరీఫ్ సీజన్ పూర్తి కావచ్చింది. నవంబర్ నుంచి యాసంగి సాగు పనులు జోరందుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుబంధు పథకం కింద అందించే పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం రెండవ విడత రైతుబంధు చెక్కుల పంపిణీని ఈ నెలలోనే చేపట్టాలని అంతా సిద్ధం చేసింది. అయితే ముందస్తు అసెంబ్లీఎన్నిల షెడ్యూల్ వెలువడడంతో కేంద్ర ఎన్నికల సంఘం రైతుబంధు చెక్కుల పంపిణీకి నిలిపివేసింది. ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయాలని ఆదేశించింది. దీంతో ఎకరాకు రూ.4వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు వ్యవసాయ అధికారులు బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. రెండవ విడతలో మొత్తం అర్హులైన రైతులు 1,16,557 మందికి గాను రూ.166.80 కోట్లు వరకు అందాల్సి ఉంది. ఇప్పటివరకు 65,220 మంది ఖాతాల వివరాలు తీసుకోగా, ఇందులో 51,337 మంది రైతుల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఇందులో 13,400 మంది రైతుల ఖాతాల్లో రూ.14 కోట్ల వరకు నగదు పడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెలాఖరు వరకు ఖాతాల వివరాలు సేరించనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. మొదట ఈనెల 25వ తేదీ వరకు గడువు విధించగా, గత పదిహేను రోజులుగా మండల వ్యవసాయ కార్యాలయ వద్ద రైతుల సందడి నెలకొంది. పూర్తి స్థాయిలో రైతులు ఖాతా వివరాలు అందజేయకపోవడంతో మరో వారం రోజులు గడువు పెంచారు. కోటపల్లి, తాండూర్, దండేపల్లి, జన్నారం మండలాల్లో 80 శాతం వివరాలు సేకరించారు. మిగతా మండలాల్లో 50 నుంచి 70 శాతం పూర్తయ్యింది. రైతుల ఇంటి వద్దకు వెళ్లి వివరాలు సేకరించాల్సి ఉండగా, వ్యవసాయ అధికారులు కార్యాలయాల్లో కూర్చొని పని కానిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండడంతో రైతులు సమయానికి కార్యాలయాలకు వచ్చి వివరాలు అందించలేకపోతున్నారు. దీనికి తోడు సేకరించిన రైతుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో కొంత వరకు సాంకేతిక సమస్యలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. పెంచిన గడువులోగా అయినా పూర్తిస్థాయిలో రైతుల ఖాతాల వివరాలు తీసుకుంటే నగదు జమ అయ్యే అవకాశం ఉంటుంది. మొదటి విడత రైతులకే.. గత ఖరీఫ్‌లో రైతుబంధు చెక్కులు పొందిన రైతులకే రెండవ విడత యాసంగి పెట్టుబడి సాయం అందుతుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రెండవ విడత చెక్కులు పంపిణీ చేయకుండా మొదటి విడత చెక్కులు తీసుకున్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఈ నెల 10వ తేదీ నుంచి రైతుల ఖాతాల వివరాలు సేకరణ పనిలో పడ్డారు. ఖాతాలో ఆప్‌లోడ్ అయిన కొద్ది రోజులకు రైతుల సెల్‌కు ఖాతాలో నగదు జమ అయినట్లు మెసేజ్ వస్తోంది. అయితే ఇప్పటివరకు సాయం పొందాల్సిన రైతులకు సంబంధించిన ఖాతాల దరఖాస్తులు 65 శాతం రాగా.. ఇందులో 52 శాతం ఆన్లైన్లో అప్లోడ్ అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రైతులు సహకరిస్తే పెట్టుబడి సాయం పూర్తిస్థాయిలో అందేందుకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడే ఆస్కారం లేదని వ్యవసాయ అధికారులు అంటున్నారు. నెలాఖరు వరకు గడువు : వీరయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రైతుల వివరాల సేకణరకు తొలుత ఈ నెల 25వ తేదీ వరకు ప్రభుత్వం గడువు విధించింది. వివరాల సేకరణలో ఆలస్యం కావడంతో గడువును నెలాఖరు వరకు పెంచడం జరిగింది. రైతులు ఆలస్యం చేయకుండా ఖాతాల వివరాలు అందజేస్తే సత్వరమే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం. ఇప్పటివరకు 80 వేల మంది రైతుల వరకు ఖాతాల వివరాలు సేకరించాం. ఇందులో 62వేల మంది రైతుల వివరాలను ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేశాం. జిల్లాలో ఇప్పటివరకు రూ.14 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. -
మరింత సౌకర్యంగా మనీ ట్రాన్స్ఫర్
మీ బంధువులెవరైనా ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళుతున్నారనుకోండి. ఆ తర్వాత మీకు రెమిటెన్స్ అనే పదం పరిచయమవుతుంది. విదేశాలకు వెళ్లడం, రెమిటెన్స్ అనే పదాలకు ఒకదానితో మరొకదానికి సంబంధం ఉంది. సులభంగా చెప్పాలంటే, మెరుగైన ఆర్థిక, జీవన ప్రమాణాల కోసం చాలా మంది విదేశాలకు వెళుతుంటారు. అక్కడ ధనం ఆర్జించి తమ కుటుంబాలకు ఆ దేశం నుంచి సొంతదేశానికి డబ్బులు పంపిస్తారు. దీనినే రెమిటెన్స్ అంటారు. భారత్‌లాంటి పెద్ద దేశాల్లో రెమిటెన్స్‌లకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యత ఉంది. భారత్‌లో చాలా కుటుంబాల్లో రెమిటెన్సెస్ చాలా కీలకమైన ఆదాయ వనరుగా చెప్పవచ్చు. విదేశాల నుంచి స్వదేశంలోని తమ వారికి డబ్బులను పంపించే విషయంలో చాలా మంది చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అక్కడ నుంచి ఇక్కడకు డబ్బులు పంపించే విధానం సౌకర్యంగా ఉండాలి, డబ్బులు త్వరగా ఇక్కడి వాళ్లకు అందాలి, ఆ సొమ్ములు సురక్షితంగా చేరాలి. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతుండటంతో విదేశాల నుంచి స్వదేశాలకు డబ్బులు పంపించే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. రెమిటెన్సెస్‌కు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని పద్ధతులు..., బ్యాంకుల ద్వారా చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యాన్నందిస్తున్నాయి. ఈ విధానంలో డబ్బులు పంపించే వ్యక్తి సదరు బ్యాంక్ శాఖకు వెళ్లి తమ సొమ్ములను డిపాజిట్ చేయాలి. ఈ డబ్బులను అందుకునే వ్యక్తి తమకు సమీపంలోని అదే బ్యాంక్ శాఖకు వెళ్లి తమ సొమ్ములను కలెక్ట్ చేసుకోవచ్చు. చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, అధిక వేతనాలు పొందేవాళ్లు, కార్మికులు, ఇతర శ్రామికులు ఈ విధానాన్నే ఎంచుకుంటారు. అత్యంత నమ్మకమైనది కావడమే దీనికి కారణం. మరోవైపు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ (ఎన్ఈఎఫ్టీ) ద్వారా కూడా డబ్బులను పంపించవచ్చు. ఈ రెండు పద్ధతుల్లో అక్కడవాళ్లకు, ఇక్కడి వాళ్లకు ఆయా బ్యాంక్ శాఖల్లో ఖాతాలుండడం తప్పనిసరి. ఐఎంటీఓ ద్వారా ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ ఆపరేటర్స్(ఐఎంటీఓ) ద్వారా డబ్బులు పంపించడం పెరిగిపోతోంది. సులభంగా, సౌకర్యంగా ఉండటమే దీనికి కారణం. సంప్రదాయమైన క్యాష్-టు-క్యాష్ మెథడ్‌లో అక్కడ డబ్బులు పంపించే వ్యక్తి సమీపంలోని ఐఎంటీఓ అదీకృత ఏజెంట్ దగ్గరకు వెళ్లాలి. తగిన గుర్తింపు ధుృవపత్రాలు చూపించి నగదు డిపాజిట్ చేయాలి. ఇక్కడ డబ్బులు పొందే వ్యక్తి తన సమీపంలోని ఐఎంటీఓ ఏజంట్ దగ్గరకు వెళ్లి, తగిన ధ్రువపత్రాలు సమర్పించి ఆ డబ్బులను తీసుకోవచ్చు. అక్కడ డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత నిమిషాల్లోనే ఇక్కడ డబ్బులు తీసుకోవచ్చు. దీంట్లో క్యాష్-టు-కార్డ్ విధానం కూడా ఉంది. ఈ విధానంలో అక్కడి వ్యక్తి ఇక్కడ వ్యక్తి కార్డ్‌కు నేరుగా సొమ్ములను పంపించవచ్చు. ఇక క్యాష్-టు-అకౌంట్ అనే విధానంలో విదేశాల్లో డబ్బులు పంపించే వ్యక్తి ఏజెంట్ దగ్గరకు వెళ్లి డిపాజిట్ చేయాలి. ఆ నిధులు ఇక్కడి వ్యక్తి అకౌంట్లోకి వచ్చేస్తాయి. తన సౌలభ్యాన్ని బట్టి ఈ వ్యక్తి ఎప్పుడైనా ఈ డబ్బులను తీసుకోవచ్చు. ఆన్లైన్ విధానం.. ఇప్పుడిప్పుడే ఈ విధానం ప్రాచుర్యం పొందుతోంది. ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ఏ కంప్యూటర్తోనైనా డబ్బులు పంపించవచ్చు. చాలా మంది విదేశాల్లోని భారత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు స్వదేశంలోని తమ తల్లిదండ్రులకు, బంధువులకు ఈ విధానంలోనే డబ్బులు పంపిస్తారు. దీనికి బ్యాంక్ అకౌంట్ ఉండడం తప్పనిసరి. కొత్త టెక్నాలజీ మనీ ట్రాన్స్ఫర్స్ స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగిపోతోంది. దీంతో మొబైల్ ట్రాన్స్ఫర్లు కూడా పెరిగిపోతున్నాయి. భవిష్యత్తులో ఇవి ఇంకా మరింతగా పెరుగుతాయి.