
తెలంగాణ రైతుల ఖాతాలో మే 15 నుంచి 25 వరకు రైతుబందు నగదు జమ కానుంది. ఈ పథకానికి అర్హులైన రైతుల జాబితాను సీసీఎల్‌ఏ అందజేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. రైతుబంధు పథకానికి 63.25లక్షల మంది రైతులు అర్హులని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకానికి 63,25,695 మంది అర్హులైన రైతులకు చెందిన 150.18లక్షల ఎకరాలకు 7508.78 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. గత యాసంగి కన్నా 2.81లక్షల మంది రైతులు పెరిగారని నూతనంగా 66,311ఎకరాలు ఈ పథకంలో చేరినట్లు మంత్రి తెలిపారు.
మొదటిసారి అర్హులైన రైతులు స్థానిక ఏఈఓలు, ఏఓలను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన నకలు అందించాలని మంత్రి సూచించారు. బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారిన వినియోగదారులు ఆందోళన చెందవద్దని ఏమైనా అనుమానాలుంటే స్థానిక వ్యవసాయాధికారులు నివృత్తి చేస్తారని తెలిపారు. గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లకు గానూ రూ.14,656.02 కోట్లు, ఈ వానకాలం, యాసంగి సీజన్ల కోసం బడ్జెట్లో రూ.14,800 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment