సాక్షి, హైదరాబాద్: కొత్తగా మరో మూడు లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి రూ. 250 కోట్ల సొమ్ము జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.వీరంతా ఖరీఫ్‌లో అర్హత పొందలేదు. అప్పట్లో కొందరికి పట్టాదారు పాసు పుస్తకాలు రాకపోవడం, ఇతరత్రా వివాదాలు నెలకొనడంతో అవరోధం ఏర్పడింది. వాటిని సరిదిద్ది రబీలో అర్హులుగా మార్చినా, కోడ్ నేపథ్యంలో పెట్టుబడి సొమ్ము ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో వారికి తాత్కాలికంగా పంపిణీ నిలిపివేశారు. తాజాగా కోడ్ ముగియడంతో వీరందరికీ పెట్టుబడి సొమ్ము అందజేయాలని నిర్ణయించారు. అయితే అందుకు గాను ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదని, వచ్చాక వారికి రైతుబంధు సొమ్ము అందజేస్తామని అధికారులు అంటున్నారు.
రబీలో ఇప్పటివరకు 50 లక్షల మందికి అందజేత...
రబీలో ఇప్పటివరకు 50 లక్షల మంది రైతులకు రూ. 4,724 కోట్లు అందజేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. వీరికి అదనంగా మరో 3 లక్షల మందికి ఇవ్వనున్నారు. ఇదిలావుంటే ఖరీఫ్‌లో ఇచ్చినట్లే రబీలోనూ చెక్కులు ఇవ్వాలని మొదట్లో వ్యవసాయశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు అధికారులు 53 లక్షల మంది రైతుల పేరుతో చెక్కులు ముద్రించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో వాటిని నిలుపుదల చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేశారు. దీంతో ఆ చెక్కులన్నీ ప్రస్తుతం అలాగే ఉండిపోయాయి.
వీటిని వచ్చే ఖరీఫ్‌లో గడువు తేదీ పెంచి వినియోగించాలని తొలుత వ్యవసాయశాఖ భావించింది. అయితే వచ్చే ఖరీఫ్ నుంచి ఎకరాకు రూ. 5 వేల వంతున ఇవ్వాలని సర్కారు నిర్ణయించినందున చెక్కుల సమస్య ఇబ్బందికరంగా మారినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా రూ. 4వేల మొత్తానికి చెక్కులను అందజేసి, మిగతా రూ.వెయ్యి రైతుల బ్యాంకు ఖాతాల్లో వేసే యోచన కూడా చేస్తున్నారు. తద్వారా పాత చెక్కులు వృథా కాకుండా ప్రభుత్వానికి రూ. 100 కోట్ల వరకు మిగులుతుందని అంటున్నారు. రైతు బంధుకు గాను పెరిగిన మొత్తంతో ఏడాదికి రూ. 15 వేలు కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
కొత్తగా మరో మూడు లక్షల మందికి ‘రైతుబంధు’
Published Sun, Dec 16 2018 3:02 AM | Last Updated on Sun, Dec 16 2018 3:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment