సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతుబంధు పంపిణీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం సీఈసీని కోరడం.. ఈ పథకం గురించి ప్రచార సభల్లో ఎలాంటి ప్రస్తావన చేయకూడదన్న అంశంతోపాటు పలు షరతులను విధిస్తూ సీఈసీ ఈ నెల 25న అనుమతి ఇవ్వడం తెలిసిందే.
అయితే పోలింగ్‌కు ముందే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు సాయం జమకానుందని మంత్రి హరీశ్‌రావు ఈ నెల 25న పాలకుర్తిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. దీనిపై పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. దీనిని సీఈసీ తీవ్రంగా పరిగణించింది. మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారంలో రైతుబంధుకు సంబంధించి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎన్నికల కోడ్‌ను, షరతులను ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైతుబంధు పంపిణీకి సంబంధించి ఇచ్చిన అనుమతిని ఉపసంహరిస్తున్నట్టు పేర్కొంది.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్ సోమవారం ఉదయం లేఖ రాశారు. రబీ పంటల కోసం రైతుబంధు కింద గత ఐదేళ్లుగా అక్టోబర్–జనవరి మధ్యకాలంలో నగదు సాయం అందిస్తున్నారని, ఇందుకు నిర్దిష్టమైన తేదీలేమీ లేవని సీఈసీ అందులో అభిప్రాయపడింది. నవంబర్ నెలలోనే పంపిణీ చేయాలన్న ప్రాముఖ్యత ఏదీ లేదని పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని ఆదేశించింది.
ఈసీ విధించిన షరతులివే..
2018లో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా రైతుబంధు అమలుకు అనుమతిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పలు షరతులను విధించింది. పథకంలోకి కొత్త లబ్ధిదారులను చేర్చరాదని, నగదు బదిలీపై ఎలాంటి ప్రచారం చేయవద్దని పంపిణీ ప్రక్రియలో రాజకీయ నేతలెవరూ భాగస్వాములు కావొద్దని స్పష్టం చేసింది. తాజాగా బీఆర్‌ఎస్ సర్కారు యాసంగికి సంబంధించిన రైతుబంధు సొమ్మును ఈ నెల 24 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, దీనికి అనుమతి ఇవ్వాలని ఈ నెల 18న కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
2018 నాటి షరతులకు లోబడి నగదు జమ చేస్తామని పేర్కొంది. అయితే సీఈసీ పాత షరతులకు తోడుగా మరిన్ని నిబంధనలు విధిస్తూ అనుమతినిచ్చింది. పోలింగ్‌కు 48గంటల ముందే నగదు జమ పూర్తికావాలని.. దీనిపై ఎన్నికల ప్రచారంలో ఎలాంటి ప్రస్తావన చేయవద్దని ఆదేశించింది.
మీ వల్లే ఆగింది.. కాదు మీరే ఆపారు!
ఎన్నికల ప్రచారంలో రైతుబంధు రచ్చరచ్చ జరుగుతోంది. సీఈసీ రైతుబంధును ఆపేయడానికి కారణం మీరంటే.. మీరంటూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఒకదానిపై మరొకటి దుమ్మెత్తిపోస్తున్నాయి. సోమవారం సాగిన ఎన్నికల ప్రచారంలో దాదాపు అన్నిచోట్లా ఈ అంశంపైనే విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. రైతులకు సాయం అందడం కాంగ్రెస్ పారీ్టకి ఇష్టం లేదని, ఆ పార్టీ ఫిర్యాదు చేయడం వల్లే ఎన్నికల సంఘం రైతుబంధును ఆపిందని బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు.
బీఆర్‌ఎస్‌వన్నీ అబద్ధాలని కాంగ్రెస్ దీటుగా స్పందించింది. ముందుగానే ఆర్థికసాయం పంపిణీ చేయాలని మేం సూచించామని, కానీ బీఆర్‌ఎస్ కావాలని జాప్యం చేస్తూ ఎన్నికల స్టంట్ చేసిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పారీ్టలు రెండూ రైతులను అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ నేతలు విమర్శించారు.
‘రైతు బంధు’ ఆపండి
Published Tue, Nov 28 2023 5:03 AM | Last Updated on Tue, Nov 28 2023 5:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment