పార్ట్‌–బీ.. పెట్టుబడి ఏది..? | Farmers Protest For Rythu Bandhu Cheques Adilabad | Sakshi
Sakshi News home page

పార్ట్‌–బీ.. పెట్టుబడి ఏది..?

Published Wed, Oct 24 2018 8:58 AM | Last Updated on Wed, Oct 24 2018 8:58 AM

Farmers Protest For Rythu Bandhu Cheques Adilabad - Sakshi

రైతుబంధు సాయం ఇవ్వాలని భీంపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పిప్పల్‌కోఠి గ్రామస్తుల ధర్నా(ఫైల్‌)

 సాక్షి, ఆదిలాబాద్‌ అర్బన్‌: ఈ యేడాది ఖరీఫ్‌ సీజన్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతుబంధు పథకం రైతులందరికీ భరోసా ఇవ్వలేకపోతోంది. ఈ పథకం కింద పెట్టుబడి సాయం ఆశించిన రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు భూ రికార్డుల ప్రక్షాళన సర్వే జరిగిన విషయం తెలిసిందే. ఆ సర్వే వివరాలను ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులు భూములను రెండు భాగాలుగా చేసి తప్పులు లేని భూములను పార్ట్‌–ఏలో, తప్పులు, వివాదాలు ఉన్న భూములను పార్ట్‌–బీలో చేర్చారు. పార్ట్‌–ఏ భూములకు రైతుబంధు పథకం వర్తింపజేయగా, పార్ట్‌–బీ భూముల లెక్కలు ఇప్పటికీ అంతుచిక్కడం లేదు.

తప్పులు, వివాదాలు ఉన్నట్లుగా తేలిన భూములను  పార్ట్‌–బీలో చేర్చి దాదాపు ఏడాది గడుస్తున్నా ఆ లెక్కలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. పార్ట్‌–బీ భూములకు ఈ యేడాది మేలో ప్రారంభమైన  పెట్టుబడి పథకం దూరమైందని చెప్పవచ్చు. జిల్లాలో సుమారు 38 వేల ఎకరాల భూములు వివిధ సమస్యలు, తప్పులు, వివాదాల్లో ఉన్నాయి. ఈ భూములను అధికారులు పార్ట్‌–బీలో చేర్చడంతో ప్రభుత్వం నుంచి ప్రతీ సీజన్‌కు రావాల్సిన రూ.15.20 కోట్లు ఆగిపోతున్నాయి. కాగా, పార్ట్‌–బీ భూములను ప్రభుత్వం, రెవెన్యూ శాఖ పట్టించుకోకపోవడంతో రైతుబంధు సొమ్ము తమకు దక్కడం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పనుల్లో జిల్లా యంత్రాంగం బీజీగా ఉండడంతో పార్ట్‌–బీ భూముల యాజమానులు ఎన్నికల తర్వాత కొలువుదీరే సర్కారుపైనే ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు.

జిల్లాలో భూ స్వరూపం ఇలా.. 
జిల్లాలో 18 మండలాలు, వాటి పరిధిలో 509 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతీ గ్రామంలో వ్యవసాయ భూములతోపాటు అటవీ, సీలింగ్, ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములున్నాయి. జిల్లా భౌగోళిక ప్రాంతం 9,01,467 ఎకరాల్లో విస్తరించి ఉండగా, అన్ని రకాల భూములు 8,46,952 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇందులో 3,71,636 ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా, 1,88,485 ఎకరాల్లో అటవీ భూమి ఉందని గతేడాది జరిగిన భూ రికార్డుల ప్రక్షాళన సర్వేలో వెల్లడైంది. 3,71,636 ఎకరాలు ఉన్న వ్యవసాయ భూములను పరిశీలిస్తే.. ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్న భూమి 3,33,636 ఎకరాలు ఉండగా, వివాదాలు, తప్పులు, సమస్యలు ఉన్న భూములు 38 వేల ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ భూములనే పార్ట్‌–బీలో చేర్చారు. జిల్లాలో మొత్తం 2,01,980 సర్వే నంబర్లు ఉండగా, ఇందులో సుమారు 30,108 సర్వే నంబర్లలోని భూములు తప్పులుగా ఉన్నాయని సర్వేలో గుర్తించారు. సర్వే అనంతరం ఎలాంటి సమస్యలను లేని భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతోపాటు తప్పులు లేని వ్యవసాయ భూముల వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. ఆ లెక్క ప్రకారం జిల్లాలో గత ఖరీఫ్‌ సీజన్‌లో 1.17 లక్షల మంది పట్టాదారులకు పెట్టుబడి సొమ్ము అందజేశారు. ఈ రబీ సీజన్‌లో కూడా ఆ భూములకే పెట్టుబడి సొమ్ము వస్తోందని చెప్పవచ్చు.

పార్ట్‌–బీ భూములకు యేడాదికి రూ.30.40 కోట్లు 
భూ రికార్డుల ప్రక్షాళన సర్వే ముగిసి దాదాపు పది నెలలు గడుస్తున్నా పార్ట్‌–బీలో చేర్చిన భూములను రెవెన్యూ శాఖ పట్టించుకోవడం లేదు. ఈ భూములపై ప్రభుత్వం కూడా శ్రద్ధ వహించకపోవడంతో ఆ లెక్కలు అలాగే ఉన్నాయి. రెవెన్యూ కోర్టు కేసులు, సివిల్‌ కేసులు, సరిహద్దు గుర్తింపు, శివాయ్‌ జమేధార్‌ సమస్యలు, థర్డ్‌పార్టీ సమస్యలు ఉన్న భూములు ఇప్పటికీ వివాదాల నుంచి బయటపడడం లేదు. పార్ట్‌–బీలో చేర్చిన సుమారు 38 వేల ఎకరాల భూములు వివిధ సమస్యలు, కేసులు, వివాదాల్లో ఉండడంతో రైతుబంధుకు దూరమవుతున్నాయి.

పార్ట్‌–బీలో చేర్చిన 38 వేల ఎకరాలకు ఎకరానికి రూ.4 వేల చొప్పున లెక్కేసుకున్న ఒక సీజన్‌కు రూ.15.20 కోట్లు జిల్లాకు వచ్చే ఆస్కారం ఉండేది. యేడాదిలో రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.8 వేల చొప్పున రూ.30.40 కోట్లు వస్తుండేది. కానీ ఆ భూముల సమస్యలకు పరిష్కారం ఇంత వరకు దొరకకపోవడంతో ఆ సొమ్ము జిల్లాకు రావడం లేదు. ఇప్పుడున్న భూములకు ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సొమ్ము మరింత అదనంగా జిల్లాకు రైతులకు దక్కాలంటే పార్ట్‌–బీ భూముల పరిష్కారంపై ఆధారపడి ఉందనే చెప్పవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement