సాక్షి, హైదరాబాద్ : రైతుబంధు పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం అందించేం దుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) షరతులతో కూడిన అనుమతి జారీ చేసింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగ దును ట్రాన్స్‌ఫర్ చేయాలని, చెక్కుల పంపిణీ జరపరాదని తేల్చి చెప్పింది. ముందు గుర్తిం చిన లబ్ధిదారులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు ఐదు ప్రధాన షరతులతో అనుమతించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి ఎస్‌కే రుడోలా శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్‌కుమార్‌కు లేఖ రాశారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాలకు కొత్త లబ్ధిదారుల పేర్లను జత చేయరాదని ఈ లేఖలో ఈసీఐ కోరింది. కార్యక్రమానికి సంబంధించి ప్రచారాన్ని నిర్వహించరాదని స్పష్టం చేసింది. కిట్స్/సామగ్రి, ఇతరాత్ర వస్తువుల పంపిణీకి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించరాదని, పెట్టుబడి సహాయం పంపిణీ ప్రక్రియలో రాజకీయ నేతలు పాల్గొనరాదని ఆంక్షలు విధించింది. రైతుబంధు కార్యక్రమానికి సంబంధించి ఈసీఐ నుంచి వచ్చిన మార్గదర్శకాలను సీఈవో కార్యాలయం వెంటనే రాష్ట్ర వ్యవసాయ శాఖకు తెలియజేసింది.
ఖాతాలను పరిశీలించండి...
తక్షణమే రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించాలని, ఇప్పటికే తమ వద్ద ఉన్న లక్షలాది మంది ఖాతాలను మరోసారి పరిశీలించి సరిచూసుకోవాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతుబంధు కింద ఖరీఫ్‌లో ఎంతమంది సొమ్ము తీసుకున్నారో వారి ఖాతాలను సేకరించి తిరిగి 10 నుంచి 15 రోజుల్లో సొమ్ము జమ చేయాలని నిర్ణయించింది. రబీ రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం 11 జిల్లాల్లో అక్కడక్కడా ప్రారంభమైంది. అయితే, కేంద్ర ఎన్నికల కమిషన్‌న్ చెక్కుల పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో శనివారం నుంచి చెక్కుల పంపిణీని నిలిపివేస్తున్నట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా ‘సాక్షి’కి వివరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. అయితే, ఇప్పటి వరకు ముద్రించిన 30 లక్షల చెక్కులు వృథా కానున్నాయి.
2 లక్షల మంది కొత్తవారికి నిలిపివేత
ఖరీఫ్‌లో పెట్టుబడి సొమ్ము తీసుకున్న రైతులకే రబీ సొమ్ము ఇవ్వాలని, కొత్త రైతులకు ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడంతో కొత్త రైతుల్లో ఆందోళన మొదలైంది. మొత్తం 52 లక్షల మందికి రబీలో రైతుబంధు సొమ్ము ఇవ్వాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈసారి ధరణి వెబ్‌సైట్ ద్వారా కొత్తగా మరో 2 లక్షల మంది వరకు రైతులు లబ్ధి పొందే అవకాశం ఏర్పడిందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఎన్నికల కమిషన్ నిర్ణయంతో వారందరికీ పెట్టుబడి సొమ్ము దక్కే అవకాశం లేకుండా పోయింది. ఎన్నికలు అయ్యాక వారికి ఇచ్చే అవకాశముంది. కొత్త వారు ఎవరనేది తెలుసుకోవడం కష్టంగా మారిందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి.
నేడు అత్యవసర సమావేశం
రైతుబంధుపై ఎన్నికల కమిషన్ నిర్ణయంతో వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు, బ్యాంకర్లు శనివారం అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment