సాక్షి, ఆదిలాబాద్‌అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతుబంధు’ పథకం కింద పెట్టుబడి సాయం రైతులకు ఇంకా చేరలేదు. 2018–19 రబీ సీజన్ ముగింపునకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నా.. ఇంత వరకు సొమ్ము చేతికి అందలేదు. ఈ నెలాఖరు వరకు రబీ పంట వేస్తేనే సరైన సమయానికి పంట చేతికి వస్తుంది. ఇందుకు రైతులు భూములను చదును చేసి సిద్ధంగా ఉంచగా, కొందరు పంటలు కూడా వేశారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.4 వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తోంది. రబీ సీజన్ ముగుస్తున్నా ఆ డబ్బులు ఇంతవరకు బ్యాంకు ఖాతాలకు చేరకపోవడంతో రైతులు ఆయోమయానికి గురవుతున్నారు.
జిల్లా యంత్రాంగం ఎన్నికల పనుల్లో ఉండడం, ఒక్క వ్యవసాయ శాఖనే పెట్టుబడి సాయంపై దృష్టి సారించడంతో రైతుబంధు సొమ్ము రైతులకు సరైన సమయానికి పనికొచ్చేట్లు కన్పించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1,11,164 మంది రైతులు ఉండగా, అధికారులు ఇప్పటివరకు 1,00,456 మంది రైతుల నుంచి ఖాతాల వివరాలు సేకరించారు. ఇంకా 10,708 ఖాతాలను రైతుల వద్ద నుంచి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరించాల్సి ఉంది. సేకరించిన వాటిని పైస్థాయి అధికారులకు అప్‌లోడ్ చేయాల్సి ఉంది.
33 వేల మంది రైతులకు నగదు జమ
జిల్లాలోని 18 మండలాల పరిధిలో 1,11,164 మంది రైతులు ఉన్నారు. ఇప్పటిదాక 33 వేల మంది రైతులకు పెట్టుబడి అందగా, ఇంకా 78,164 మంది రైతులకు పెట్టుబడి సొమ్ము రావాల్సి ఉంది. జిల్లాలో గత నెల రోజులుగా వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో) 1,00,456 మంది రైతుల ఖాతాలు సేకరించారు. ఆ వివరాలను మండల వ్యవసాయ అధికారుల(ఎంఏవో)కు అందజేశారు. ఎంఈవోలు 88,012 ఖాతాలను రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించారు. అందులో నుంచి 33 వేల మంది రైతులకు మాత్రమే ‘రైతుబంధు’ కింద పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యింది. వివరాలు పంపినా ఇంకా 55,012 మంది రైతుల ఖాతాలకు నగదు చేరలేదు. ఇదిలా ఉండగా, జిల్లా రైతులకు మొత్తం రూ.178 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.55 కోట్లు మాత్రమే వచ్చింది. మిగతా రూ.123 కోట్ల నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.
కొనసాగుతున్న ఖాతాల సేకరణ..
జిల్లా వ్యాప్తంగా మండల వ్యవసాయ విస్తరణ అధికారులు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుల బ్యాంకు ఖాతాలను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ గత నెల రోజుల నుంచి కొనసాగుతోంది. జిల్లాలో 1,11,164 మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు 1,00,456 మంది రైతుల ఖాతాలను సేకరించారు. మిగతా 10,708 మంది రైతుల ఖాతాలు తీసుకోవాల్సి ఉంది. కాగా, ఏఈవోలు గ్రామాల వారీగా వెళ్లి రైతుల ఖాతాల వివరాలు సేకరించి, ఆ ఖాతా పని చేస్తుందా.. లేదా అనేది సరి చూడాల్సి వస్తోంది. ఒకవేళ రైతు ఇచ్చిన బ్యాంకు ఖాతా పనిచేయకపోతే నగదు అందులో జమ కాదు. ఫలితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతోపాటు అధికారులను రైతులు నిలదీసే అవకాశాలు లేకపోలేదు. ఇందుకు అధికారులు ముందే జాగ్రత్త పడుతూ ఖాతాలను పరిశీలన చేస్తున్నారు.
ఈ నెలాఖరులోగా ‘అందరికీ పెట్టుబడి’..
జిల్లాలోని రైతులందరికీ ఈ నెలాఖరులోగా రైతుబంధు సాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల చొప్పున యాభై ఎకరాల వరకు పరిమితి లేకుండా ఇస్తోంది. ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి యేడాదికి ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం చేస్తోంది. మొదటి విడత ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సాయం ఎలాంటి సమస్యలు లేకుండా పంపిణీ కాగా, రెండో విడత రబీ సీజన్ పెట్టుబడి పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నందున రైతులకిచ్చే పెట్టుబడి సాయాన్ని వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ మేరకు మొదటి విడత చెక్కులు పొందిన రైతులే రెండో విడత నగదు పొందడానికి అర్హులుగా గుర్తించారు.
ఆన్‌లైన్ ద్వారా నగదు జమ చేసేందుకు మొదటి విడత చెక్కులు పొందిన రైతుల వద్ద నుంచి పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంకు పాస్‌బుక్ వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరించారు. రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి పెట్టుబడి నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా.. ఇంతవరకు సగం మంది రైతులకు కూడా సాయం అందకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment