కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుబంధు పథకాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మరోసారి రైతుబంధు చెక్కుల ద్వారా యాసంగి పంటకు రైతులకు చేయూత అందించనున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. తిమ్మాపూర్ మండలం మల్లాపూర్‌లో రైతులకు చెక్కులు అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పట్టాదారులైన రైతులందరికీ యాసంగి పంట పెట్టుబడి సాయం చెక్కులను సోమవారం నుంచి పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని 16 మండలాల్లో 1,43,281 చెక్కుల రూపంలో రబీ సీజన్‌కు రూ.126.54 కోట్లు పెట్టుబడి సాయం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో చెక్కుల వెరిఫికేషన్ పూర్తిచేశారు.
కోడ్ నుంచి మినహాయింపు...
రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే చెక్కులకు ఎన్నికల కోడ్ అడ్డువస్తుందని ముందుగా భావించినా.. ఎన్నికల కమిషన్ మినహాయింపు ఇచ్చింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే చెక్కుల పంపిణీని పూర్తిచేయాలని భావిస్తున్నారు. రబీ సీజన్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే మొదలెట్టారు. జిల్లాలో 3,23,031 ఎకరాల భూమి సాగవుతుండగా.. ఎకరానికి రూ.4 వేల లెక్కన యాసంగి పంటకు రూ.126.54 కోట్లు పంపిణీ చేయనున్నారు. అసైన్డ్ భూముల లబ్ధిదారులు, ఆర్‌వోఆర్, పట్టాదారులు, ఏజెన్సీ ఏరియాలో వ్యవసాయం చేసే గిరిజనేతరులతో సహా పట్టాదారులైన రైతులందరికీ పంట పెట్టుబడి కింద ఆర్థిక సహాయం చెక్కులు అందనున్నాయి.
చెక్కుల పంపిణీకి ప్రత్యేక బృందాలు...
చెక్కుల పంపిణీలో రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు కీలకంగా వ్యవహరించనున్నారు. జిల్లా వ్యవసాయశాఖాధికారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామాలవారీగా ఆర్‌ఐలు, వీఆర్‌వో, వీఆర్‌ఏలు, ఏఈవోలు, మండల వ్యవసాయాధికారులు సమన్వయంతో చేపట్టనున్నారు. సహకార, ఇతరశాఖలను వినియోగించుకోనున్నారు. ఇప్పటికే చెక్కుల వెరిఫికేన్‌ను పూర్తిచేసి ట్రెజరీల్లో భద్రపరిచిన అధికారులు శనివారం అన్ని తహసీల్, వ్యవసాయశాఖ కార్యాలయాలకు పంపించి, సోమవారం నుంచి గ్రామాల వారీగా పంపిణీ చేయనున్నారు. జిల్లాలో ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు, సిండికేట్, తెలంగాణ గ్రామీణ బ్యాంకులు చెక్కులను సరఫరా చేశాయి. రైతు ఖాతాకలిగి ఉన్న సంబంధిత బ్యాంకు బ్రాంచితోపాటు రాష్ట్రంలో ఎక్కడైనా సంబంధిత బ్యాంకులో నగదు తీసుకునే వెసులుబాటు కల్పించారు. రైతులకు పెట్టుబడి సాయం చెల్లించేలా బ్యాంకుల్లో నగదు నిల్వలు ఉంచేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. గతంలో మాదిరిగానే చెక్కులు విత్‌డ్రా చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.
చెక్కులు పంపిణీకి సిద్ధం
రైతు బందు చెక్కులు పంపిణీకి సిద్ధమయ్యాయి. రైతులకు అందించాల్సిన చెక్కులన్నింటిని వెరిఫికేషన్ చేసి పంపిణి చేస్తాం. శుక్రవారం తిమ్మాపూర్ మండలం మల్లాపూర్‌లో లాంఛనంగా ప్రారంభించాం. సోమవారం నుంచి జిల్లాలోని అన్ని గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం రైతులందరికీ పంపిణీ చేస్తాం.– జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment