ఖరీఫ్‌లో రైతుబంధు చెక్కులను అందుకున్న రైతులు (ఫైల్)
సాక్షి, నాగర్‌కర్నూల్: రైతుబంధు పథకం ద్వారా ఖరీఫ్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు పెట్టుబడి సాయం కింద అధికారులు చెక్కులు పంపిణీ చేశారు. కానీ ఈ రబీలో మాత్రం చెక్కుల పంపిణీకి ఎన్నో చిక్కులు ఎదురవుతున్నాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో కాకుండా నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
సర్వత్రా అయోమయం
పెట్టుబడి సాయాన్ని ఖాతాల్లో జమ చేస్తారనే విషయం తెలుసుకున్న రైతులు అయోమయంలో పడ్డారు. బ్యాంకుల్లో ఖాతా ఉన్న రైతులు కుదుటగా ఉండగా ఖాతాలు లేనివారు ఆందోళన చెందుతున్నారు. సాగులో పెట్టుబడి అధికమవడం, ఎరువుల ధరలు పెరగడం, చీడపీడల ఉధృతి పెరుగుతుడడంతో ఎకరాలకు రూ.4వేల సాయంతో కొంత ఊరట లభిస్తుందని రైతులు ఆశించారు. కానీ వారికి నిరాశే మిగిలేలా ఉంది. మొదటి విడతలో జిల్లాలోని తిమ్మాజీపేట మండలం కొడుపర్తి, అప్పాయిపల్లి గ్రామాల్లో చెక్కులను పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు పూర్తిచేశారు. శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఈ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయాల్సి వచ్చింది.
ఆందోళనలో రైతులు
రైతుబంధు పథకం కింద జిల్లాకు వచ్చిన చెక్కులను వ్యవసాయాధికారులు భద్రపరిచి పంపిణీకి సిద్ధం చేసుకుంటున్న సమయంలోనే పంపిణీ నిలిపి వేయాలని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఖరీఫ్‌లో తీసుకున్న రైతుల ఖాతాలోకే నేరుగా జమచేయాలని నిర్ధేశించారు. ఈ రబీ సీజన్‌కు జిల్లాలోని 352 గ్రామాల్లోఉన్న 2,30,766 మంది రైతులకు రూ.266 కోట్ల 91 లక్షల 22వేల 820 లను 2,33,719 చెక్కుల రూపంలో అందించడానికి అధికారులు సిద్ధమయ్యారు. మొదటగా 1,49,800 చెక్కులను పంపిణీ చేయడానికి జిల్లాలోని ఆయా వ్యవసాయ కార్యాలయాలకు చెక్కులు చేరుకున్నాయి. అయితే గతంలో చెక్కులు పొందిన రైతులు ఆధార్‌కార్డు, పాస్‌పుస్తకం చూపితే బ్యాంకులో నగదు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు ఖాతాలో జమచేయాలంటే ప్రతీ రైతుకు ఖాతా ఉండాల్సిందేననే నిబంధ ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఖాతాలేని రైతులు వేలల్లో ఉన్నారు. వారి పరిస్థితి ఏంటనే ప్రశ్నకు ఎవరివద్ద కూడా సమాధానం లభించడంలేదు.
అధికారుల్లోనూ అస్పష్టత
చెక్కుల రూపంలో కాకుండా నేరుగా రైతులు ఖాతాలో డబ్బులు జమచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రైతులకు పెట్టుబడి సాయం ఎలా అందించాలనే అంశంపై అధికారుల్లో కూడా స్పస్టత లేకుండా పోయింది. ఖాతాలోనే డబ్బులు జమ చేయాలంటే ప్రతీ రైతు నుంచి ముందు ఖాతా నంబర్‌ను సేకరించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియకే చాలా సమయం పడుతుంది. ఇకపోతే ఖాతాలేని రైతులకు కొత్త ఖాతాలు తెరిపించి పాస్‌బుక్కులు ఇచ్చేవరకు చాలా సమయం పడుతుంది.
జిల్లాలోని 2,30,766 మంది రైతుల ఖాతా నంబర్‌లను సేరించాలంటే అధికారులకు తలకు మించిన భారం. సమయం కూడా తక్కువగా ఉండటం, ప్రస్తుతం అధికారులంతా ఎన్నికల పనుల్లో బిజీగా ఉండడంలతో ఈ ప్రక్రియ ఇప్పుడు పూర్తయ్యేలా కనిపించడంలేదు. ఒకవేళ శరవేగంగా పనులు ప్రారంభించినా ఎంతవరకు సాధ్యమైతుంది.. అనే అంశంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఖాతా నంబర్‌లు సేకరించి వారి ఖాతాలో డబ్బులు జమచేసే వరకు రైతులు పొలం పనుల్లో బిజీగా ఉండే రోజులు వస్తాయి. గత ఖరీఫ్‌లో అనుకున్న సమయానికి రైతులకు పెట్టుబడి సాయం అందగా ఈ సీజన్‌లో మాత్రం అందుతాయో లేదోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
స్పష్టమైన ఆదేశాలు రాలేదు
రబీ సీజన్‌కు సంబంధించి రైతుబంధు చెక్కులనుశనివారం నుంచి పంపిణీ చేయాల్సి ఉండగా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ప్రస్తుతం నలిపివేశాం. నేరుగా రైతుల ఖాతాలో జమచేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ ప్రక్రియను ఎలా కొనసాగించాలనే అంశంపై ఇంకా స్పష్టమైన వివరాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో 1,49,800 చెక్కులు సిద్ధం చేశాం. తదుపరి ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. – బైరెడ్డి సింగారెడ్డి,జిల్లా వ్యవసాయాధికారి
Comments
Please login to add a commentAdd a comment