
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్‌లోనూ రైతుబంధు పథకాన్ని అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ఆ రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారుల బృందం ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన సం గతి తెలిసిందే. కొన్ని జిల్లాల్లోనూ ఆ బృందం పథ కంపై అధ్యయనం చేసింది. తెలంగాణలో ఈ ఏడాది ఖరీఫ్, రబీలకు కలిపి ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు ఇచ్చారు. వచ్చే ఖరీఫ్ నుంచి ఎకరానికి ఏడాదిలో రూ.10 వేలు ఇవ్వనున్నారు. జార్ఖండ్ ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలంగాణ వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అంటే ఒక సీజన్‌కు ఎకరానికి రూ.2,500 చొప్పున ఇచ్చే అవకాశముంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తామని తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ఉన్నతాధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించి ఇక్కడ పథకం తీరు తెన్నులను పరిశీలించనుందని అధికారులు చెబుతున్నారు.
జార్ఖండ్‌లోనూ మన సాఫ్ట్‌వేర్!
జార్ఖండ్ ప్రభుత్వం అక్కడ రైతుబంధును అమలు చేస్తే తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్‌ను తీసుకునే అవకాశముందని సమాచారం. ఈ మేరకు తెలంగాణ అధికారులను వారు కోరినట్లు తెలిసింది. రైతుబంధు పథకాన్ని రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయడంలో వ్యవసాయశాఖ భారీ కసరత్తే చేసింది. రైతుల వివరాలు, వారికి ఉన్న భూమి వివరాలను పక్కాగా రూపొందించింది. ఒకటికి నాలుగు సార్లు పరిశీలించి సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి పరిచింది. దీంతో పొరపాట్లు తలెత్తకుండా పథకం అమలు జరిగింది. ఈ నేపథ్యంలో మన సాఫ్ట్‌వేర్‌ను తీసుకోవాలని జార్ఖండ్ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఆ రాష్ట్ర అధికారులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చే అవకాశమున్నట్లు తెలిసింది.
కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శం : కేటీఆర్
తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అన్నారు. ఒడిశా, జార్ఖండ్ తర్వాత తాజాగా పశ్చిమ బెంగాల్‌లోనూ రైతుబంధు, రైతుబీమా లను ప్రవేశపెట్టనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మమత ప్రకటిం చారని, ఈ మేరకు ఆమె ప్రకటనను జోడిస్తూ కేటీఆర్ ట్విట్టర్‌లో సోమవారం పోస్టు చేశారు.