
సాక్షి, హైదరాబాద్: రైతులకు రబీ పెట్టుబడి సొమ్మును ఈ నెల 22 నుంచే అందజేయాలని వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. మొదటి దశలో ఇప్పటివరకు సేకరించిన 10 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయనుంది. అందుకు సంబంధించి ముమ్మరంగా సన్నాహాలు చేస్తుంది. ‘పండుగ తర్వాత ఈ నెల 22 నుంచి ఇవ్వాలనుకుంటున్నాం. అన్నీ సక్రమంగా జరిగితే అంతకుముందే రైతుల ఖాతాల్లోకి రబీ పెట్టుబడి సొమ్ము జమ చేస్తాం’అని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రైతుల ఖాతాలను ఎప్పటికప్పుడు వేగంగా అప్‌లోడ్ చేసేలా మొబైల్ యాప్ కూడా వ్యవసాయ శాఖ రూపొందించింది. దానివల్ల గ్రామాల్లో వ్యవసాయాధికారులు వీలైనంత త్వరగా రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించడం సాధ్యపడుతుంది.
వేగంగా బ్యాంకు ఖాతాల సేకరణ..
గత ఖరీఫ్‌లో ప్రభుత్వం రైతులకు పెట్టుబడి చెక్కులను గ్రామసభల్లో అందజేసిన సంగతి తెలిసిందే. దాదాపు 51 లక్షల మంది రైతులకు రూ.5,200 కోట్ల వరకు ప్రభుత్వం అందజేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రబీలో చెక్కుల రూపంలో ఇవ్వకూడదని, ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అందుకు ప్రత్యామ్నాయంగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే రైతుబంధు సొమ్ము జమ చేయాలని స్పష్టం చేసింది. దీంతో వ్యవసాయ శాఖ రైతుల నుంచి బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ ఖాతాల నంబర్లను ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా అప్‌లోడ్ చేసి రిజర్వ్ బ్యాంకుకు పంపించాల్సి ఉంది. రిజర్వ్ బ్యాంకు వద్ద ఉన్న ఈ–కుబేర్ సాఫ్ట్‌వేర్ ద్వారా రైతులకు పెట్టుబడి సొమ్ము వెళ్తుంది. రైతుకు ఖాతా ఉన్న బ్యాంకుతో సంబంధం లేకుండా ఒకేసారి వారి ఖాతాల్లోకి సొమ్ము చేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment