రైతు‘బంధువులు’ పెరిగారు! | Rythu Bandhu Scheme Beneficiaries Steadily Increasing In Telangana | Sakshi
Sakshi News home page

రైతు‘బంధువులు’ పెరిగారు!

Published Sun, Dec 19 2021 2:23 AM | Last Updated on Sun, Dec 19 2021 10:27 AM

Rythu Bandhu Scheme Beneficiaries Steadily Increasing In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాగు పనులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశ్యంతో తలపెట్టిన రైతుబంధు పథకం కింద లబ్ధిదారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రతి సీజన్‌లో రైతుబంధు సాయం పొందేవారి సంఖ్య సగటున లక్ష వరకు పెరుగుతోంది. 2018, ఏప్రిల్‌ నుంచి ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అప్పుడు ఎకరానికి రూ.4 వేల సాయం చొప్పున ఇవ్వగా.. ఏడాది తర్వాత నుంచి ఎకరాకు రూ.5 వేలు అందిస్తోంది.

పథకం అమల్లోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల ఎకరాల భూమికి సంబంధించి 50.25 లక్షల మంది లబ్ధిదారులకు రూ.5,236.30 కోట్లు పంపిణీ చేశారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన మూడేళ్లలో లబ్ధిదారుల సంఖ్య 60.84 లక్షలకు చేరింది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణానికిగాను రూ.7,360.41 కోట్లు రైతుబంధు కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. ప్రస్తుతం రబీ సీజన్‌ నిధులను త్వరలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

17 లక్షల ఎకరాలకు పరిష్కారం... 
వ్యవసాయ భూముల క్రయవిక్రయాలతో యజ మానుల సంఖ్యలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్నపాటి వివాదం ఉన్న భూములపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో పెద్ద సంఖ్యలో భూ యజమానులు లావాదేవీలు సాగిం చే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ధరణిలో సాంకేతికతను అప్‌డేట్‌ చేస్తుండటంతో మ్యూ టేషన్, సక్సెషన్‌ లాంటి అపరిష్కృత సమస్యలకు ప రిష్కారం లభించింది.

ఆయా లబ్ధిదారులంతా రై తుబంధు సాయానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారుల సంఖ్య, భూ విస్తీర్ణం పెరుగుతోంది. పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి 17 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమైనట్లు స్పష్టమవుతోంది.

సీసీఎల్‌ఏ గణాంకాల్లో... 
సాగు భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియంతా ఇప్పుడు రెవెన్యూ విభాగం పర్యవేక్షిస్తోంది. ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ జరిగిన క్షణాల్లోనే పోర్టల్‌లో వివరాలు మారిపోతుంటాయి. రిజిస్ట్రేషన్‌ కాగానే లబ్ధిదారుకు మ్యూటేషన్‌ పూర్తయి పాసు పుస్తకం ప్రింట్‌ కాపీని ఇస్తున్నారు. నాలుగైదు రోజుల్లో పోస్టు ద్వారా పాసుపుస్తకం లబ్ధిదారు ఇంటికి చేరుతుంది.

ఈ క్రమంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) కార్యాలయం గణాంకాల ప్రకారం.. 63.25 లక్షల మంది పేరిట 1.50 కోట్ల ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ ఉంది. ఈ లెక్కన లబ్ధిదారులకు రూ.7,508.78 కోట్లు అవసరమని అంచనా వేసింది. అయితే రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఈ లెక్కన రబీ సీజన్‌లో లబ్ధిదారుల సంఖ్య అటుఇటుగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement