సాక్షి, సంగారెడ్డి: లాక్‌డౌన్, కరోనా వైరస్ వ్యాప్తి వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ సంక్షేమ పథకాలు ఆగవని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో, సదాశివపేట మున్సిపాలిటీలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, వీధి వ్యాపారులకు రుణాల అందజేత కార్యక్రమాలలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని, అయినప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రతినెలా రూ. వెయ్యి కోట్లు ఆసరా పింఛన్ల కోసం నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు. అదే విధంగా పంట పెట్టుబడి సాయం కింద రైతుబంధుకు ఈ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,400 కోట్లు అందించామని వివరించారు. కరోనాతో అన్ని వ్యాపారాలు చాలా వరకు దెబ్బతిన్నాయని, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందువల్ల వారు తిరిగి వ్యాపారాలు చేసుకోవడానికి మున్సిపాలిటీల వారీగా అర్హులను గుర్తించి ఒక్కొక్కరికీ తక్కువ వడ్డీతో రూ.10 వేలు అందజేస్తున్నామని చెప్పారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని మంత్రి స్పష్టం చేశారు.
‘టెస్ట్ అండ్ ట్రీట్’
కరోనా వైరస్‌తో ఎవరూ భయపడవద్దని, లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా పరీక్షలు చేసుకోవచ్చునని హరీశ్ సూచించారు. పీహెచ్‌సీలలో సైతం పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వైరస్ గురించి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు వస్తుందన్నారు. టెస్ట్ అండ్ ట్రీట్‌మెంట్ పద్ధతిలో కరోనా విషయంలో అన్ని సౌకర్యాలు ఆసుపత్రులలో ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment